ద్వారా: అనురాగ్ బారువా
ఆగస్టు 7 2024
2021 లో ఈ ఘటన మీద రిపోర్ట్ చేసిన పాత్రికేయులు ఈ వీడియో పాతది అని, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకి సంబంధం లేదని మాకు తెలిపారు,
(గమనిక - ఈ కథనంలో లైంగిక దాడికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)
క్లైమ్ ఏంటి?
ఒక మంచం మీద ఒక మహిళని బలవంతంగా పట్టుకున్నట్టున్న పాక్షికంగా బ్లర్ చేసిన ఒక స్క్రీన్ షాట్ ని బంగ్లాదేశ్ లోని ఢాకా విశ్వవిద్యాలయంలో ఒక హిందూ మహిళ మీద లైంగికంగా దాడి చేస్తున్నారు అని అర్థం వచ్చేటట్టు షేర్ చేస్తున్నారు. ఈ ఘటన పూర్తి వీడియో ఉందని, బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం హయంలో ఇటువంటివి మరిన్ని జరుగుతాయి అని కూడా రాసుకొచ్చారు.
కొంతమంది యూజర్లు ఈ స్క్రీన్ షాట్ తో పాటు, 6-సెకన్ల నిడివి ఉన్న వీడియో ని కూడా షేర్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది పురుషులు ఒక మహిళని వివస్త్రని చేస్తూ, దాడి చేస్తున్నట్టు ఉంది. వైరల్ స్క్రీన్ షాట్ ఈ వీడియో లోనిదే. ఈ వీడియో లోని విషయం కారణంగా ఈ వీడియో పోస్ట్ ఆర్కైవ్ మేము ఇవ్వడం లేదు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో కొంత మంది యూజర్స్ ఒకే శీర్షికతో ఈ వీడియోని షేర్ చేశారు - లౌకిక/వామపక్ష హిందువులారా. మీ కూతుళ్ళు/సోదరీమణులు కూడా ‘హిందూ వస్తువులు’ వాళ్ళకి. ఈ రోజున బంగ్లాదేశ్ లో హిందూ సోదరీమణులు పరిస్థితి ఇది. వారిని కాపాడటానికి మనమేమీ చేయలేని పరిస్థితి. హిందువులు ఏడవటం ఆపి, పోరాడటం మొదలుపెట్టాలి. @narendramodi గారు కాస్త మేల్కొని ఏమైనా చేయండి.
ఈ వీడియోని మొదటిగా ‘ఇస్లామిక్ ఆర్మీ - లేటెస్ట్ వెర్షన్’ అనే టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేశారు. ఈ ఛానల్ లో బంగ్లాదేశ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి.
వాస్తవాలు ఏమిటి?
ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, న్యూస్ బంగ్లా 24 వారి కథనం లభించింది. జూన్ 8, 2021 నాటి ఈ కథనంలో ఈ వీడియోలోని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. బెంగళూరు లో బంగ్లాదేశ్ జాతీయుల రేప్ కేసుకి సంబంధించిన విషయం ఇది అని ఈ కథనంలో ఉంది. “భారతదేశం లో యువతుల మీద దాడి: మనుషుల అక్రమరవాణా సూత్రధారుల ఒప్పుకోలు” అనేది ఈ కథనం బెంగాలీ శీర్షిక. ఇందులో బంగ్లాదేశ్, భారత దేశం ఆమధ్య మనుషుల అక్రమ రవాణా వ్యవస్థ నడిపే అష్రఫుల్ మొండల్ (బాస్ రఫీ అని కూడా పేరు), అబ్దుర్ రహ్మాన్ ల అపరాధ అంగీకారం ఉంది. ఈ కథనం లో ఈ వీడియో గురించి కూడా ఉంది. ఒక మహిళ మీద ఐదుగురు పురుషులు దాడి చేశారు అని, ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది అని ఈ కథనంలో ఉంది.
ఈ వీడియో మొదటగా 2021 లో వైరల్ అయ్యింది. బెంగళూరు లో బంగ్లాదేశ్ కి చెందిన మహిళ మీద లైంగిక దాడి జరిగింది అని ఆ సంవత్సరం మే లో కథనాలు వచ్చాక ఈ వీడియో వైరల్ అయ్యింది. అనేక భారతీయ మీడియా సంస్థలు ఈ ఘటన మీద రిపోర్ట్ చేశాయి. జూలై 8, 2021 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, మే నెలలో తూర్పు బెంగళూరు లో రామమూర్తి నగర్ లో ఒక బంగ్లాదేశ్ మహిళని రేప్ చేసి, దాడి చేసిన ఆరోపణల మీద ముగ్గురు మహిళలతో సహా 12 మంది బంగ్లాదేశ్ జాతీయుల మీద కేసు పెట్టారు.
హిందుస్థాన్ టైమ్స్ లో మే 29, 2021 నాడు అరుణ్ దేవ్ అనే పాత్రికేయులు ఈ ఘటన గురించి ఒక కథనం రాశారు. ఇరవైలలో ఉన్న ఒక మహిళ మీద దాడి చేస్తునట్టున్న వీడియో వైరల్ అయ్యాక పౌరసత్వ పత్రాలు లేని నలుగురు బంగ్లాదేశ్ పురుషులని అరెస్ట్ చేశారు అని ఈ కథనంలో రాశారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో 2021 నాటి ఘటనకి సంబంధించినదే అని అరుణ్ దేవ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ధ్రువీకరించారు.
ఈ వీడియో ఆ సమయంలో అస్సాం లో కూడా వైరల్ అయ్యింది. స్క్రోల్ లో జూలై 8, 2021 నాడు వచ్చిన ఒక కథనంలోనిందితులు ఈ ఘటనని రికార్డ్ చేసి, అస్సాం లోని తమ స్నేహితులతో షేర్ చేశారని, ఆ తరువాత అది వైరల్ అయ్యింది అని, పోలీసు విచారణ జరిగింది అని ఈ కథనంలో ఉంది. స్క్రోల్ పాత్రికేయులు రోకిబజ్ జమాన్ ఈ వీడియో 2021 నాటి ఘటనకి సంబంధించినదే అని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు.
స్క్రోల్ కథనం లో బెంగళూరు పోలీస్ కమీషనర్ మే 27, 2021 నాడు ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ ) ఉంది. “వీడియో లో ఉన్న విషయాలు, ప్రాధమిక విచారణ తరువాత ఇద్దరు మహిళలతో సహా ఆరుగురి మీద రామమూర్తి నగర్ స్టేషన్ లో రేప్, దాడికి సంబంధించిన కేసు నమోదు చేశాము,” అని ఈ పోస్ట్ లో ఉంది.
మరింత సమాచారం కోసం రామమూర్తి నగర్ పోలీసులని సంప్రదించాము. వారు జవాబిస్తే ఇక్కడ పొందుపరుస్తాము.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న హింస
ఒక వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ విధానానికి సంబంధించి జూన్ నెల చివర్లో షేక్ హాసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం మొదలయ్యింది. ఈ విధానం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం 1971 లో విముక్తి ఉద్యమంలో పాల్గొన్న కుటుంబసభ్యులకి కేటాయిస్తారు. ఈ విధానాన్ని 2018 లో రద్దు చేశారు. అయితే, ఒక కోర్టు దీనిని జూన్ 2024 లో తిరిగి తీసుకొచ్చింది.
నిరసనలకి జవాబుగా ఇంటర్నెట్ సదుపాయాలని తొలగించారు, పోలీస్ కర్ఫ్యూ పెట్టారు. అయితే, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో కొంతమంది నిరసనకారులు చనిపోయారు.
ఈ నిరసనల తరువాత, బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఈ విధానాన్ని పాక్షికంగా కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 93 శాతం మెరిట్ ఆధారంగానే నియమించాలి అని తీర్పునిచ్చింది. అయితే, నిరసనలు కొనసాగాయి. షేక్ హసీనా కి వ్యతిరేకంగా, పాలక పార్టీ అవామీ లీగ్ కి వ్యతిరేకంగా కొనసాగాయి.
ఒక బీబీసీ కథనం ప్రకారం, ఆగస్ట్ 5 నాటికి చనిపోయినవారి సంఖ్య 280.
ఆగస్ట్ 5 నాడు షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత తన ఇంటి మీద దాడి చేసిన, తన తండ్రి బంగ్లాదేశ్ విముక్తి నాయకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు వచ్చాయి. షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలోఉన్నారు. బ్రిటన్ కి వెళ్ళే అవకాశం ఉందని అంచనా.
ఈ నేపధ్యంలో నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం లో తాత్కాలిక ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఏర్పాటు చేసింది . ఆగస్ట్ 6 సాయంత్రం 6 గంటలకి కర్ఫ్యూ కూడా ఎత్తివేశారు.
తీర్పు
2021 లో బెంగళూరు లో చోటు చేసుకున్న లైంగిక దాడికి సంబంధించిన వీడియోని బంగ్లాదేశ్ లో “హిందు మహిళల పరిస్థితి” అని క్లైమ్ చేస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితికి సంబంధం లేని పాత వీడియో.
(అనువాదం - గుత్తా రోహిత్)