ద్వారా: సోహం శా
జూలై 12 2024
జనవరి 21, 2024 నాటి ఈ వీడియో అస్సాం లోని నగాన్ జిల్లాలో జరిగిన ఘటనకి సంబంధించినది. రాహుల్ గాంధీ తాజా మణిపూర్ పర్యటనకి సంబంధం లేనిది.
క్లైమ్ ఏంటి?
“రాహుల్ గాంధీ, వెనక్కి వెళ్లిపో”, “రాహుల్ గాంధీ డౌన్ డౌన్” అంటూ జనాలు నినాదాలు ఇస్తున్న వీడియో ఒకటి ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో వైరల్ అయ్యింది.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజా మణిపూర్ పర్యటనలో జరిగిన ఘటన ఇది అంటూ క్లైమ్ చేశారు. ఈ ఫుటేజీ లో జనాలు “రకీబుల్ హసన్ గో బ్యాక్”, ‘రకీబుల్ ను తొలగించండి, సమగురి ని రక్షించండి” అంటూ ఆంగ్లం లోను, అస్సామీస్ లోనూ పోస్టర్లు పట్టుకుని ఉండటం మనం చూడవచ్చు. రకీబుల్ హుస్సేన్ ధుబ్రీ లోక్ సభ సభ్యుడు. ఇంతకమునుపు, సమగురి శాసనసభ్యుడు.
“అన్యాయపు యాత్ర”, “రాహుల్ గాంధీ గో బ్యాక్” లాంటి నినాదాలని కూడా మనం ఈ వీడియోలో వినవచ్చు. ఈ వీడియో లో రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగొయ్ కూడా ఉన్నారు. వీరు ఇరువురిని పోలీసు నిరసనకారుల నుండి పోలీసులు దూరం తీసుకెళ్లడం కూడా మనం ఇందులో చూడవచ్చు.
సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
“తన రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా కొత్త గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక మణిపూర్ లోని స్థానికులు రాహుల్ గాంధీ ని వెనక్కి వెళ్లిపోమంటున్నారు. ఇది నిన్న అనగా 8-7-2024 నాడు జరిగింది. దానితో రాహుల్ గాంధీ వెనుదిరగాల్సి వచ్చింది,” అని ఒక యూజర్ ఈ వీడియో షేర్ చేసి రాసుకొచ్చారు. గతంలో తప్పుడు సమాచారం షేర్ చేసిన చరిత్ర ఉన్న అరుణ్ పూడూర్ కూడా ఈ వీడియోని ఇదే క్లైమ్ తో షేర్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
అయితే, ఈ వీడియో మణిపూర్ కి చెందిన వీడియో కాదని, అస్సాం కి చెందిన పాత వీడియో అని మా పరిశోధన లో తేలింది.
వాస్తవం ఏమిటి?
వైరల్ వీడియో లో పైన కుడి వైపు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ లోగో చూశాము.
వీడియో లో కనిపిస్తున్న ఏఎన్ఐ లోగో (సౌజన్యం: ఎక్స్)
దీని ద్వారా మాకు మరింత నిడివి ఉన్న ఇదే వీడియో లభించింది. ఈ వీడియో ని ఏఎన్ఐ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో జనవరి 21, 2024 నాడు పోస్ట్ చేసింది. “ఈ రోజు సాయంత్రం నగాన్ లో అంబాగన్ ప్రాంతంలో అనేక మంది ‘రాహుల్ గాంధీ గో బ్యాక్’, ‘అన్యాయపు యాత్ర’ లాంటి పోస్టర్లు పట్టుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి నిరసన తెలిపారు,” అని ఈ వీడియో కి శీర్షిక పెట్టారు.
అలాగే, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఘటన గురించి ప్రచురించిన కథనం డెక్కన్ హెరాల్డ్ లో మాకు లభించింది. భారత్ జోడో యాత్ర లో భాగంగా అస్సాం లోని రుపోహీ కి రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, అంబాగన్ ప్రాంతంలో ఒక ఆహార దుకాణం బయట ఈ ఘటన చోటుచేసుకుంది అని ఈ కథనం లో ఉంది. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు భూపేన్ కుమార్ బోరా మీద ఆ రోజు ఉదయం దాడి జరిగింది అని, అలాగే వేరే ఘటనలో జైరాం రమేష్ కార్ మీద కూడా దాడి జరిగింది అని కూడా ఈ కథనం లో ఉంది.
ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే “పూజా గిఫ్ట్ స్టోర్” అనే దుకాణం, దాని ముందు “గురుకుల్ గ్లోబల్ అకాడెమీ” అనే బోర్డు మాకు కనిపించాయి.
వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)
వీటిని గూగుల్ మ్యాప్స్ ద్వారా మేము జియో లొకేట్ చేశాము. అస్సాం లోని పచిం సుయలని అనే ప్రాంతంలో ఇవి ఉన్నాయి. గూగుల్ ఇమేజెస్ లో “గురుకుల్ గ్లోబల్ అకాడెమీ” అనే బోర్డు కూడా మాకు లభించింది. ఈ దుకాణం బోర్డు మీద ఇది అస్సాం లోని నగాన్ లో అంబాగన్ ప్రాంతంలో ఉంది అని ఉంది.
ఈ దుకాణం పచిం సుయలని ప్రాంతంలో ఉన్నట్టు మేము గుర్తించాము (సౌజన్యం: గూగుల్ మ్యాప్స్)
జూలై 8, 2024 నాడు మణిపూర్ లో రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు నిరసనలు జరిగాయి అనే కథనాలు లేవు. మణిపూర్ లో మే 2023 నుండి అంతరుద్ధ్యం నడుస్తున్నది. ది హిందూ లో కథనం ప్రకారం నాటి నుండి 221 మంది చనిపోగా, 50000 మంది అంతర్గతంగా విస్తాపన కి గురయ్యారు.
తీర్పు
ఈ క్లైమ్ తప్పు. ఇది అస్సాం కి చెందిన జనవరి 2024 నాటి వీడియో.
(అనువాదం - గుత్తా రోహిత్)