ద్వారా: రాజేశ్వరి పరస
నవంబర్ 7 2024
లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, పోలీసులు వీడియోలో వ్యక్తి పేరు పోలుమతి దిలీప్ అని తెలియజేసారు.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను జై శ్రీ రామ్ అంటూ నినాదం చేయటం మనం చూడవచ్చు. ఇందులో అతనిని వరుసగా ప్రశ్నలు అడగటం కూడా మనం చూడవచ్చు.
ఒక వార్త సంస్థకు చెందిన ఎక్స్ అకౌంట్ కూడా ఈ వీడియోను షేర్ చేసింది. దీనికి శీర్షిక గా, “ఆలయాల లిస్ట్ తయారు చేసుకుని మరి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. భీమవరం రామాలయంలో ఓ ఇస్లామిస్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని బ్యాగ్ నుండి ఆలయాల జాబితా రికవరీ చేయబడింది. దేహశుద్ధి చేసి ఊరేగించి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.ముత్యాలమ్మ దేవాలయం తరహాలో ఆలయ విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్లాన్ చేయడం ,హిందుల వేషధారణలో వచ్చి ధ్వంసం చేయడమే ఈ ముఠా పని.” ఇదే తరహా వ్యాఖ్యలతో అనేక పోస్టులు షేర్ చేయబడ్డాయి, వాటి ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు, ఒక హిందూ వ్యక్తి. భీమవరం II పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం వీడియో లో కనిపిస్తున్న వ్యక్తి పేరు పోలుమతి దిలీప్, అతను షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి.
మేము ఏమి కనుగొన్నాము?
మా పరిశోధన ప్రకారం, ఇదే వీడియోని ఎన్డీటీవీ ఛానల్ కూడా నవంబర్ 1, 2024 నాడు ఉపోడ్ చేయటం జరిగింది. ఆ కథనం లో ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం లో జరిగినట్టు తెలుస్తుంది. దేవాలయాన్ని అపవిత్రం చేసిన నెపం తో ఆ వ్యక్తిపై దాడి చేసినట్టుగా కథనం పేర్కొంది.
వెస్ట్ గోదావరి పోలీసులు తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్టును కుడా మేము కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ). ఇందులో ఈ విషయమై భీమవరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు అయినట్టు పేర్కొన్నారు. పైగా, ఈ కేసుకు సంభందించిన ఎఫ్ ఐ ఆర్ పరిశీలించగా, అందులో ఉన్న వ్యక్తి 35 సంవత్సరాల పోలుమతి దిలీప్, అతను షెడ్యూల్డ్ కులాల లోని మాలా వర్గానికి చెందిన వ్యక్తి (ఆర్కైవ్ ఇక్కడ). ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, అక్టోబర్ 31 నాడు, దిలీప్ రామాలయం వద్ద ఉన్న వ్యక్తులను అసభ్య పద జాలం తో దూషించటం తో అతని పై దేవాలయ పూజారి కేసు నమోదు చెయ్యటం జరిగింది.
ఈ కేసు విషయమై లాజికల్లీ ఫ్యాక్ట్స్ పూజారిని సంప్రదించగా, ఆయన మాతో మాట్లాడుతూ, దిలీప్ అనే క్యాక్తి తనని కొంత మంది వ్యక్తులు కొట్టడం తో, అతను గుడి లోని అమ్మవారిపై కోపం తో అసభ్యకరమైన పదజాలం తో ఒక నోటు రాయడం జరిగింది. సిసిటివి ఆధారంగా అతనిని తరువాత రోజు గుర్తించి ప్రశ్నించగా, అతను ‘పొగరుగా’ సమాధానం చెప్పినట్టు తెలియజేసారు. దాని తరువాత, అక్కడ ఉన్న ప్రాంతీయులు తనపై దాడి చేసారు. పూజారి మాట్లాడుతూ, దిలీప్ తానే ఆ నోటును రాసి నట్టుగా ఒప్పుకున్నట్టు తెలిపారు. ఆ తరువాత తన సోదరుడి ద్వారా అతను మతి స్థిమితం లేని వ్యక్తి అని తెలుసుకుని పోలీసులు విశాఖపట్నం లోని మానసికరోగుల ఆసుపత్రి లో చేర్చటం జరిగింది.
పైగా, ఈ విషయమై భీమవరం 2 టౌన్ పోలీసులను సంప్రదించగా, దిలీప్ ముస్లిం అనే విషయాన్నీ వారు తోసిపుచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇజ్రాయెల్ మాట్లాడుతూ, దిలీప్ హిందువు అని, రావులపాలెంకు చెందిన వ్యక్తి అని తెలియజేసారు. అతను భీమవరం వీధుల్లో చెత్త కాగితాలు ఎత్తుకుంటూ తిరుగుతుంటాడు అని తెలిపారు.
పైగా, దిలీప్ పై కేసు నమోదు చేసినప్పటికీ, అతనిని వైద్యుల పరీక్షించగా, తన మానసిక పరిస్థితి మెరుగ్గా లేదని అతనిని మాజిస్ట్రేట్ సూచన అనుసారం, విశాఖపట్నం లోని మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చటం జరిగింది అని తెలిపారు.
తీర్పు :
వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి పోలుమతి దిలీప్, ఇతను షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి, ముస్లిం కాదు.
(వనితా గణేష్ సహకారం తో)
(అనువాదం : రాజేశ్వరి పరసా)