ద్వారా: అనురాగ్ బారువా
నవంబర్ 21 2024
వైరల్ అవుతున్న గ్రాఫిక్ తప్పు, సకాల్ మీడియా, వక్ఫ్ బోర్డు, దేవాలయం అధికారులు కూడా ఇది తప్పుడు వార్త అని నిర్ధారించారు.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో అనేక మంది యూజర్లు ముంబై లోని సిద్ధివినాయక దేవాలయం మరియు వినాయకుడి మూర్తి ఉన్న ఫొటోని షేర్ చేసి, వక్ఫ్ బోర్డు, ఈ దేవాలయంలో వాటా ఉంది అని తెలిపింది అంటూ రాసుకొస్తున్నారు. మరి కొన్ని పోస్టులు సకాల్ మీడియా సంస్థ పేరుతో కూడా వైరల్ అయ్యాయి.
ఒక ఎక్స్ యూజర్ ఈ ఫొటోని షేర్ చేసి తన పోస్టులో, “ముంబాయిలోని సప్రసిద్ధ సిద్ధి వినాయక టెంపుల్ మాదే- వక్ఫ్ బోర్డు. ఇక ఉపేక్షించరాదు. వక్ఫ్ బోర్డు రద్దు చెయ్యాల్సిందే!”
ఇది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వైరల్ అవుతుంది. ఇంకొంత మంది యూసర్లు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలతో పోస్టులు చేసారు, వాటి ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వక్ఫ్ బోర్డు అనేది, ముస్లిం మతస్థులు తమ మతం కోసం, మతస్థుల చదువు కోసం మరియు ఇతర పనుల కోసం దానం చేసిన ఆస్తులను, చూసుకునే ఒక అధికారిక సంస్థ.
కానీ మా పరిశోధన ప్రకారం, వైరల్ అవుతున్న క్లెయిమ్ అవాస్తవం.
మేము ఏ విధంగా కనుగొన్నాము?
సకాల్ లోగో ఉన్న వైరల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, నమ్మదగిన ఫలితాలు ఏమి మాకు లభించలేదు. సకాల్ కి సంబంధించిన అధికారిక సామాజిక మధ్యమ అకౌంట్లను మరియు వార్తా పత్రికలో కూడా మేము పరిశీలించాము, ఈ విధమైన ఫొటో ఏమి మాకు లభించలేదు.
తరుచుగా సకాల్ అధికారికంగా వాడే గ్రాఫిక్స్ కు ఈ వైరల్ అయిన ఫొటోను పోల్చి చూస్తే, అనేక లోటు పాట్లు మనకు కనిపిస్తాయి. వైరల్ ఫొటోలో ఉన్నట్టుగా సకాల్ వాడే గ్రాఫిక్స్ కు ఎటువంటి బార్డర్ గీతలు ఉండవు, పైగా, అక్షరాలు ఎప్పుడూ, ఎడుమ వైపు నుండే ఉంటాయి, కానీ వైరల్ పోస్ట్ లో అక్షరాలు మధ్యలో ఉన్నాయి.
వైరల్ గ్రాఫిక్ కి మరియు సకాల్ గ్రాఫిక్ కి మధ్య పోలిక (సౌజన్యం : స్క్రీన్ షాట్స్/ఎక్స్/సకాల్ మీడియా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ సవరణ)
పైగా, సకాల్ సంస్థ కూడా ఈ వైరల్ అవుతున్న ఫొటో ‘ఫేక్’ అని స్పష్టం చేసారు (ఆర్కైవ్ ఇక్కడ). తమ ఎక్స్ అకౌంట్ లో “ప్రస్తుతం సకాల్ పేరు మీద ఒక తప్పుదారి పట్టించే కథనం వైరల్ అవుతుంది. అందులో ‘ముంబై లోని సిద్ధివినాయక దేవాలయం లో వక్ఫ్ బోర్డు వాటా’ అంటూ రాసి ఉంది. కానీ అలాంటి పోస్ట్ ఏమి సకాల్ తాయారు చేయలేదు, ఎవరో కావాలని మా సకాల్ పేరు ను ఈ విధంగా వాడి షేర్ చేస్తున్నారు” అంటూ రాసుకొచ్చారు. (మరాఠి నుండి అనువాదం).
సకాల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శీతల్ పవార్ కూడా తమ ఎక్స్ అకౌంట్ లో ఈ వైరల్ అవుతున్న ఫొటో ఫేక్ అని తెలియజేసారు (ఆర్కైవ్ ఇక్కడ).
సకాల్ మీడియా పోస్ట్ (సౌజన్యం : ఎక్స్)
శివ సేన (యుబిటి) నాయకులు ఆదిత్య థాకరే కూడా తమ ఎక్స్ అకౌంట్ లో ఈ పోస్ట్ గురించి ప్రస్తావించారు (ఆర్కైవ్ ఇక్కడ). తమ పోస్టులో, వైరల్ పోస్టుకు సంబంధించి బీజేపీని నిందించారు. ‘విభజించి పాలించటం, అబద్దాలు ఆడి గెలవడానికి ప్రయత్నించడం బీజేపీ తత్వం’ అంటూ రాసుకొచ్చారు. పైగా ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాను మరియు ముంబై పోలీసులను జత చేస్తూ, ఈ విధంగా మహారాష్ట్ర లో ద్వేష పూరితమైన పోస్టులను పెట్టే వారిని అరెస్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు మరియు సిద్ధివినాయక దేవాలయ స్పందన ఏమిటి?
లాజికల్లీ ఫ్యాక్ట్స్ మహారాష్ట్ర వక్ఫ్ బోర్డును తమ స్పందన కోసం సంప్రదించింది. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఈఓ మాట్లాడుతూ, ఇది ‘ఫేక్ న్యూస్’ అని నిర్ధారించారు. అలాంటి ప్రకటన ఏమి తాము చేయలేదని స్పష్టం చేసారు.
పైగా, సిద్ధివినాయక మందిర్ ట్రస్ట్ కోశాధికారి, పవన్ కుమార్ త్రిపాఠి మాట్లాడిన వీడియో కూడా సామజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఇందులో ఆయన శ్రీ సిద్ధివినాయక మందిరం ముంబై ప్రజల గుర్తింపు అంటూ, ఏ బోర్డు కూడా వాటాకి రాలేదు అని పేర్కొన్నారు. ఆ దేవాలయం భక్తులందరికీ చెందుతుంది అని పేర్కొన్నారు. ఈ వీడియో యొక్క వాస్తవికతను తెలుసోవడానికి మేము ఆయనను నేరుగా సంప్రదించాము. అయన మాతో మాట్లాడుతూ ఆ వీడియోలో మాట్లాడింది తానే అని, వక్ఫ్ బోర్డు నుండి ఏ విధమైన సమాచారం తమకు రాలేదని, వైరల్ ఫొటో తప్పని పేర్కొన్నారు.
తీర్పు
వక్ఫ్ బోర్డు, సిద్ధివినాయక దేవాలయం అధికారులు వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు అని నిర్ధారించారు. సకాల్ మీడియా కూడా తమ లోగో వాడి ఒక ఫేక్ క్లెయిమ్ వైరల్ అవుతుంది అని పేర్కొన్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)
Read the fact check here.