ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
ఆగస్టు 8 2024
ఈ వీడియోలో ఉన్న భవనం బంగ్లాదేశ్ లోని సత్ఖిర జిల్లాలోని ఒక రెస్టారెంట్.
క్లైమ్ ఏంటి?
మంటల్లో చిక్కుకున్న ఒక భవనం వీడియోని బంగ్లాదేశ్ లోని ఒక గుడికి నిప్పు పెట్టారనే క్లైమ్ తో షేర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా మొదలేయిన నిరసన ఉద్యమం ఈ మధ్య కాలంలో తీవ్రతరం అయ్యింది.
ఈ 12-సెకన్ల వీడియోలో ఒక భవనం మంటల్లో చిక్కుకుని ఉండటం మనం చూడవచ్చు. ఈ భవనం వైవిధ్యమైన శిల్ప రీతులతో ఉంది. గుమ్మటాలు, కమానులు, స్థంబాలతో నిండి ఉన్న ఈ భవనం పై కప్పు నుండి, కిటికీల నుండి పొగలు రావటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ భవనం చుట్టుపక్కల తాటి చెట్లు, కంచె ఉన్నాయి.
“బంగ్లాదేశ్ లో మరొక హిందు గుడికి నిప్పు పెట్టిన ఉన్మాద ఇస్లామిక్ మితవాదులు. బంగ్లాదేశ్ లో గుడులని కాపాడుతున్న జుబేర్ సోదరులు ఎక్కడా? ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేసి, ఇస్లామిక్ ఉన్మాదాన్ని ప్రపంచం మొత్తం చూపించండి. #AllEyesOnBangladeshiHindus,” అనే శీర్షికతో ఒక యూజర్ ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ ఎక్స్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవలలో హిందువులకి చెందిన గుడులు, ఇళ్ళు, వ్యాపారాల మీద దాడి చేశారని వివిధ వార్తా కథనాల ద్వారా తెలుస్తున్నది. అయితే, ఈ వీడియోలో ఉన్నది గుడి కాదు. బంగ్లాదేశ్ లోని సత్ఖిర లో ఉన్న ఒక కాఫీ షాప్.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియో లో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సర్చ్ లో వెతికితే, ఇటువంటి ఫొటోలే ఉన్న కథనం ఒకటి మాకు లభించింది. కల్బేలా అనే ఒక ఢాకా వార్తా పత్రికలో ఆగస్ట్ 5, 2024 నాడు ఈ కథనం ప్రచురితం అయ్యింది. షేక్ హసీనా రాజీనామా చేసింది అనే వార్త తెలియగానే సత్ఖిర జిల్లా కారాగారంతో సహా అనేక భవనాల మీద దాడి చేసి, నిరసనకారులు నిప్పు పెట్టారు అని ఈ కథనంలో ఉంది. షేక్ హసీనా కి చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుల ఇళ్ళు, ప్రజా భవనాల మీద దాడి చేశారని ఇందులో ఉంది. అయితే, గుడి మీద దాడి చేశారని మాత్రం ఇందులో ఎక్కడా లేదు.
మరింత పరిశోధించగా, ఈ వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ తో ఉన్న ఒక ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ) మాకు లభించింది. ఇదే భవంతి యూట్యూబ్ వీడియో కూడా ఇందులో ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఈ భవనం ముందు నుంచుని ఉన్నారు. ఇది సత్ఖిర ఒక రెస్టారెంట్ అని ఈ పోస్ట్ లో ఉంది.
దీని ద్వారా మాకు జనవరి 3, 2024 నాడు అప్లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) లభించింది. “రాజ్ ప్రసాద్ కాఫీ షాప్ అండ్ రెస్టారెంట్ కళారావ్ సత్ఖిర ❤” అనేది ఈ వీడియో శీర్షిక. ఈ వీడియోలో ఈ రెస్టారెంట్ బయట లోపల కూడా చూడవచ్చు. 2 నిమిషాల నిడివి దగ్గర ఈ రెస్టారెంట్ సీటింగ్ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఏ రెస్టారెంట్ లోనైనా ఉండేటట్టు కుర్చీలు, బల్లలు ఉన్నాయి. ఈ వీడియో ద్వారా ఇది గుడి కాదు రెస్టారెంట్ అనేది స్పష్టం అవుతున్నది. అలాగే, ఈ రెస్టారెంట్ బయట ఉన్న బోర్డ్ మీద రెస్టారెంట్ మరియు రిసార్ట్ అని ఉంది.
రెస్టారెంట్ బయట ఉన్న బోర్డ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్)
వ్లాగర్లు ఈ మధ్య కాలంలో అప్లోడ్ చేసిన ఈ రెస్టారెంట్ వీడియోలు కూడా మాకు లభించాయి. అటువంటి ఒక వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) శీర్షిక “రాజ్ ప్రసాద్ రెస్టారెంట్ కళారావ్ సత్ఖిర ” అని ఉంది.
వైరల్ వీడియో, యూట్యూబ్ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్)
గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ రెస్టారెంట్ ని మేము గుర్తించాము. అందులో ఫిబ్రవరి 2023 నాడు నిర్మాణం లో ఉన్నప్పటి ఫొటోలు ఉన్నాయి. అలాగే అప్పటి స్ట్రీట్ వ్యూ కూడా ఉంది.
రెస్టారెంట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ (సౌజన్యం: గూగుల్ మ్యాప్స్)
బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితి
జూన్ చివర్లో విద్యార్ధుల నిరసనలు మొదలయ్యినప్పటి నుండి బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతానే ఉన్నాయి. కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ కూడా జరిగింది, కొంత మంది నిరసనకారులు చనిపోయారు కూడా.
జూలై 21 నాడు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ విధానాన్ని పాక్షికంగా కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 93 శాతం మెరిట్ ఆధారంగానే నియమించాలి అని తీర్పునిచ్చింది. అయితే, నిరసనలు కొనసాగాయి. షేక్ హసీనా కి వ్యతిరేకంగా, పాలక పార్టీ అవామీ లీగ్ కి వ్యతిరేకంగా కొనసాగాయి.
ఆగస్ట్ 5 నాడు షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం వదిలి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ ముఖ్య సలహాదారునిగా బంగ్లాదేశ్ సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తీర్పు
బంగ్లాదేశ్ లోని సత్ఖిర జిల్లాలో మంటల్లో చిక్కుకున్న ఒక రెస్టారెంట్ వీడియోని షేర్ చేసి, అక్కడ హిందు గుడికి నిప్పు పెట్టారు అని తప్పుగా క్లైమ్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)