ద్వారా: సోహం శా
జూలై 10 2024
ఫెయిత్ హీలర్ల గురించి ఒక బంగ్లాదేశీ ఫేస్బుక్ పేజీ అవగాహన కోసం షేర్ చేసిన స్క్రిప్టెడ్ వీడియో ఇది.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, ఇందులో టోపీ పెట్టుకున్న ఒక వ్యక్తి మహిళలను వైద్యం పేరుతో అసభ్యంగా ముట్టుకుంటున్నట్టు ఉంది. ఈ వీడియోలో తమ వ్యాధులను నయం చేసుకోడానికి అతని దగ్గరకు ఆ మహిళలు వచ్చినట్టుగా ఉంది.
ఎక్స్ లో ఈ వీడియోని షేర్ చేసి, “మార్కెట్ లోకి ఒక కొత్త ముల్లా వచ్చాడు. మహిళల కడుపు, వెనుక భాగాన్ని నయం చేస్తారు, రోజుకి వేలమంది ఈయన వద్దకి వెళ్తుంటారు,” అని శీర్షికగా పెట్టారు.
తరచూగా తప్పుడు సమాచారం షేర్ చేసే ఒక ఎక్స్ అకౌంట్, ‘Mr Sinha’ కుడా ఈ వీడియోని షేర్ చేసి, “ఈ పిచ్చితనం ఏంటి, అసలు ఇలాంటి మోసగాళ్ల వద్దకు వెళ్తున్నందుకు ఈ మహిళలను అనాలి, ఏదైనా తప్పు జరిగితే అందరు ప్రభుత్వాన్ని నిందిస్తారు,” అంటూ షేర్ చేసారు. ఈ పోస్టులకు మొత్తంగా 4.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ముల్లా ‘వైద్యుడు’ మహిళలను వేధిస్తున్నాడు అనే క్లెయిమ్ తో ఎక్స్ పోస్ట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ మా పరిశోధన ప్రకారం, వీడియోకి మతం రంగు పులిమి, అబద్ధపు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మరింత నిడివి గల వీడియో ఒకటి లభించింది. దీనిని పీస్ టీవీ బీడీ అనే ఫేస్బుక్ పేజీ లో జనవరి 30, 2024 నాడు అప్లోడ్ చేసారు. ఈ వీడియోతో పాటు షేర్ చేసిన క్లిప్ లో, “మవ రగి పీర్ వైద్యం వైరల్ వీడియో” అని ఉంది (బెంగాలీ అనువాదం).
ఇక్కడ లభించిన 13 నిమిషాల నిడివి వీడియో చూసిన తరువాత చివరలో, “ఇలాంటి బాబాల నుండి మనల్ని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. పీస్ టివి దర్శకత్వం,” బెంగాలీ లో ఒక సూచన ఉంది. దీని ద్వారా ఇది స్క్రిప్టెడ్ వీడియో అని, నిజమైన సంఘటన కాదని అర్ధమవుతుంది.
వీడియో చివరన బెంగాలీ లో వచ్చిన సూచన (సౌజన్యం: పీస్ టీవీ బీడీ ఫేస్బుక్)
పీస్ టీవీ బీడీ ఫేస్బుక్ పేజీ ని (ఆర్కైవ్ ఇక్కడ) పరిశీలిస్తే ఇలా మతసంబంధమైన విషయాల గురించి అనేక వీడియోలు చేశారని తెలుస్తుంది. ఇందులో కనపడే నటులు, ‘వైద్యుడు’ మరియు ఎరుపు రంగు దుస్తులు ధరించిన సహాయకురాలు ఇతర వీడియోలలో (ఆర్కైవ్ ఇక్కడ) కుడా కనిపించారు.
ఫేస్బుక్ పేజీ లో అదే నటులు వేరే వీడియోలలో కుడా ఉన్నారు(సౌజన్యం : పీస్ టీవీ బీడీ ఫేస్బుక్)
పీస్ టీవీ బీడీ ఫేస్బుక్ పేజీలో రెండు యూట్యూబ్ ఛానల్ లింకులు కుడా ఉన్నాయి. Mahc Drama TV, Al Aksa TV ఈ రెండు ఛానళ్ళు. ఈ రెండు ఒకేరకమైన వీడియోలను పబ్లిష్ చేస్తున్నాయి. ఈ ఛానల్లో వారి గురించి. “బాంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఇస్లామిక్ కంటెంట్ మరియు ప్రొడ్యూసర్” గా పేర్కొని ఉంది. వీరు ఇస్లాం మత విషయాలపైన ఇంటర్వ్యూలు, విద్యా సంబంధమైన కార్యక్రమాలు, వార్తలు, షార్ట్ ఫిలిమ్స్ మరియు డ్రామాలు పొందుపరిచారు.
ఈ ఆధారాలతో వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్ అని, అందులో ఉన్నది ఒక ముస్లిం ఫెయిత్ హీలర్ కాదని అర్ధమవుతుంది.
తీర్పు
వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్ వీడియో, దీనిని బాంగ్లాదేశ్ కి చెందిన ఒక విద్యాసంబంధమైన యూట్యూబ్ ఛానల్ తయారు చేసింది. ఇది సామాజిక మాధ్యమాలలో మతపరమైన అబద్దపు క్లెయిమ్ తో వైరల్ అయ్యింది.
(అనువాదం - రాజేశ్వరి పరసా)