హోమ్ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి 2013 లో ‘భారీ లాభాలు’ నుండి 2024 లో ‘భారీ నష్టాలు' కి మారలేదు

బిఎస్ఎన్ఎల్ పరిస్థితి 2013 లో ‘భారీ లాభాలు’ నుండి 2024 లో ‘భారీ నష్టాలు' కి మారలేదు

ద్వారా: ప్రభాను దాస్

జూలై 22 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బిఎస్ఎన్ఎల్ పరిస్థితి 2013 లో ‘భారీ లాభాలు’ నుండి 2024 లో ‘భారీ నష్టాలు' కి మారలేదు 2013 లో లాభాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ 2024 నాటికి నష్టాల పాలయ్యింది అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

బిఎస్ఎన్ఎల్ 2013 లో లాభాలు ఆర్జించి, 2024 లో నష్టాల పాలవ్వలేదు. రెండు సంవత్సరాలు నికర నష్టాలే.

క్లైమ్ ఏంటి?

 ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ సహ కార్యదర్శి రోష్నీ జైస్వాల్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సంస్థ 2013 లో 10, 183 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించగా, 2023 లో 13, 356 కోట్ల నష్టాల్లో ఉందని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో రాసుకొచ్చారు.

జూలై 10 నాటి ఈ వైరల్ పోస్ట్ లో ఒక వీడియో కూడా ఉంది. అందులో ఇవే సంఖ్యలు చెబుతూ, 2013 నుండి జరిగిన మార్పులని గమనించమని ప్రేక్షకులకి చెబుతునట్టు ఉంది. అంటే దీనర్ధం 2013 లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పరిస్థితి అలా ఉందని, 2014 లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా మారింది అని అయ్యుండొచ్చు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు.  

సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ అంకెలు తప్పని మా పరిశోధన లో తేలింది. బిఎస్ఎన్ఎల్ 2013-14, 2023-24 లలో నికర నష్టాల్లోనే ఉంది. భారతదేశం లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి తదుపరి సంవత్సరం మార్చ్ 31 వరకు నడుస్తుంది.

2013 నాటి డేటా ఏమి చెబుతుంది?

రోష్నీ చెప్పిన “2013” సంవత్సరం అంటే 2013-14 అని మేము భావించాము. ఈ సంవత్సరపు వార్షిక ఆర్థిక నివేదిక ని బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లో సంపాదించాము. ఆ సంవత్సరం 7019.76 కోట్ల నికర నష్టం వచ్చిందని ఈ నివేదిక లో ఉంది. ఇంతక ముందుపు సంవత్సరాలలో కూడా ఈ సంస్థ నష్టాలలోనే ఉందని ఈ నివేదిక లో ఉంది.

బిఎస్ఎన్ఎల్ 2012-13, 2013-14 నాటి లాభ నష్టాల పట్టిక (సౌజన్యం: బిఎస్ఎన్ఎల్)

2024 డేటా సంగతి ఏంటి?

అలాగే, సంస్థ 2024 నాటి అంకెలు కూడా క్లైమ్ తప్పు అని తెలియచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఆర్థిక నివేదిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ 2023-24 లో 5367.45 కోట్ల నష్టం చవిచూసింది. ఈ నివేదిక లో పేజీ సంఖ్య 46 లో ఈ వివరాలు ఉన్నాయి. 

బిఎస్ఎన్ఎల్ 2023 -24 నాటి లాభ నష్టాల పట్టిక (సౌజన్యం: బిఎస్ఎన్ఎల్)

2022-23 లో 8161.41 కోట్ల నష్టం వచ్చింది అని ఈ నివేదిక లో ఉంది. అంటే, 2023-24 నాటికి నికర నష్టం తగ్గింది అంతే. 

ఇవే వివరాలు వార్తా కథానాలలో కూడా ఉన్నాయి. ఈ కథనాల ప్రకారం, 2013-14లో సంస్థకి 7020 కోట్ల నష్టం, 2023-24లో 5367 కోట్ల నష్టం వచ్చింది. 

తీర్పు

సామాజిక మాధ్యమ పోస్ట్ లో చెప్పిన అంకెలు బిఎస్ఎన్ఎల్ వార్షిక ఆర్థిక నివేదిక లోని అంకెలతో సరితూగలేదు. ఈ రెండు సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ నష్టాలే చవిచూసింది. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.