ద్వారా: అంకిత కులకర్ణి
జూన్ 7 2024
తాజా లోక్ సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన అత్యల్ప ఆధిక్యత 1587.
క్లైమ్ ఏంటి?
తాజా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే, సామాజిక మాధ్యమాలలో భారతీయ జనతా పార్టీ ‘30 చోట్ల 500 కన్నా తక్కువ ఆధిక్యతతో’, 100కి పైగా చోట్ల ‘1000 కన్నా తక్కువ ఆధిక్యతతో’ గెలిచింది అనే క్లైమ్ సర్కులేట్ అయ్యింది. ఈ క్లైమ్ (ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ)షేర్ చేసి, ఈవీఏం రిగ్గింగ్ జరిగింది అని, దీని మీద విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. జూన్ 4, 2024 నాడు ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలలో 543 సీట్లలో బీజేపీ 240 చోట్ల గెలుపొందింది.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం; ఎక్స్/వాట్స్ ఆప్ /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ క్లైమ్ తప్పు.
వాస్తవం ఏమిటి?
ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉన్న డేటాని మేము విశ్లేషించాము. అందులో “500 కన్నా తక్కువ ఆధిక్యతతో” కానీ “1000 కన్నా తక్కువ ఆధిక్యతతో” కానీ గెలిచిన బీజేపీ అభ్యర్ధి లేరని తేలింది.
బీజేపీకి వచ్చిన అత్యంత తక్కువ ఆధిక్యత 1587. ఒడిశాలోని జాజ్ పూర్ బీజేపీ అభ్యర్ధి రబీంద్ర నారాయణ్ బెహరా తన సమీప అభ్యర్ధి బీజూ జనతా దళ్ కి చెందిన శర్మిష్ట సేథీ మీద గెలిచారు. బెహరాకి 5, 34, 239 ఓట్లు రాగా, సేథీకి 5, 32, 652 ఓట్లు వచ్చాయి.
దీని తరువాత తక్కువ ఆధిక్యత రాజస్థాన్ లోని జైపూర్ గ్రామీణ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రావ్ రాజేంద్ర సింగ్ కి వచ్చింది. తను 1615 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. తనకి 6, 17, 877 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన అశోక్ చోప్రాకి 6, 16, 262 ఓట్లు వచ్చాయి.
ఛత్తీస్ఘడ్ లోని కాంకేర్ నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భోజ్ రాజ్ నాగ్1884 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. తనకి 5, 97, 524 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన బీరేష్ ఠాకూర్ కి 5, 95, 750 ఓట్లు వచ్చాయి.
వీరు తప్ప, మిగతా బీజేపీ అభ్యర్ధులు అందరూ 2000కి పైగా ఆధిక్యతతో గెలిచారు.
5000 కన్నా తక్కువ ఆధిక్యత వచ్చిన బీజేపీ అభ్యర్ధులు (సౌజన్యం: results.eci.gov.in/స్క్రీన్ షాట్)
అదే కాకుండా, ఈ ఎన్నికలలో అతి తక్కువ ఆధిక్యతతో గెలిచిన అభ్యర్ధి శివ సేనకి చెందిన రవీంద్ర దత్తారాం వైకర్. ముంబై వాయువ్య నియోజకవర్గం నుండి పోటీ చేసిన తను తన సమీప అభ్యర్ధి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కి చెందిన అమోల్ గంజన్ కిర్తీకర్ మీద గెలిచారు. రవీంద్రకి 4, 52, 644 ఓట్లు వచ్చాయి.
తీర్పు
ఎన్నికల సంఘం డేటా ప్రకారం బీజేపీ అభ్యర్ధికి వచ్చిన అత్యల్ప ఆధిక్యత 1587. 500 లేదా 1000 కన్నా తక్కువ ఆధిక్యత వచ్చిన బీజేపీ అభ్యర్ధులు ఎవరూ లేరు. కాబట్టి, ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం - గుత్తా రోహిత్)