ద్వారా: ప్రభాను దాస్
అక్టోబర్ 14 2024
యు ఎన్ ఎస్ సి అధికారిక వెబ్సైటు ప్రకారం, కేవలం 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది, అవి యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డం, చైనా, రష్యా.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో అనేక మంది యూజర్లు భారతదేశానికి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (లేదా) ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ (UNSC) లో శాశ్వత సభ్యత్వం వచ్చింది అంటూ పోస్టులు షేర్ చేసారు. ఈ పోస్టులకు శీర్షికలలో, ‘భారత్’ కు శాశ్వత సభ్యత్వం వచ్చింది అంటూ అభినందనలను తెలుపుతున్నారు. పైగా, ఇప్పుడు భారతదేశానికి వీటో అధికారం కుడా ఉందని, ఇంతకు మునుపు వరకు, ఇది కేవలం, అయిదు దేశాలకే పరిమితం అని రాసుకొచ్చారు.
ఈ పోస్టులలో, యునైటెడ్ నేషన్స్ మీటింగ్లకు సంభందించిన వీడియోలను పెట్టి, దీనికి అనుగుణంగా, భారతదేశానికి శాశ్వత సభ్యత్వం అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అలాంటి పోస్టుల ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
భారత దేశం తో సహా, యు ఎన్ ఎస్ సి లో శాశ్వత సభ్యుల సంఖ్య ను పెంచాలి అనే అభ్యర్థన ఉన్నప్పటికీ, అలాంటి అధికారిక పరిణామం ఏమి చోటు చేసుకోలేదు.
వాస్తవం ఏమిటి?
యు ఎన్ ఎస్ సి అనేది, యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆరు ముఖ్యమైన విభాగాలలో ఒకటి. యునైటెడ్ నేషన్స్ లోకి మరో దేశాన్ని చేర్చటం లో నిర్ణయం తీసుకునే అధికారం ఈ ఒక్క యు ఎన్ ఎస్ సి విభాగానికి మాత్రమే ఉంటుంది. పైగా, ప్రపంచ శాంతి భద్రతలు తో సహా అనేక ముఖ్య విషయాలలో యు ఎన్ ఎస్ సి కు కీలక పాత్ర ఉంటుంది.
ప్రస్తుతం యు ఎన్ ఎస్ సి లో అయిదు శాశ్వత సభ్య దేశాలు, పది అశాశ్వత సభ్యులు ఉన్నారు. ఈ శాశ్వత సభ్యులను 1945 లో ఎంపిక చేశారు, ఇవి యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డం, చైనా మరియు రష్యా. ఆ తరువాత ఏ దేశం కూడా ఈ జాబితా లో చేరలేదు. మిగిలిన పది అశాశ్వత సభ్యులను ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి సీక్రెట్ బాలట్ పద్ధతి లో జనరల్ అసెంబ్లీ లో ఎంపిక చేస్తారు. ఆలా ప్రస్తుతం ఉన్న సభ్యులు, అల్జీరియా, ఈక్వడార్, గుయానా, జపాన్, మాల్టా, మొజాంబిక్యూ, రిపబ్లిక్ అఫ్ కొరియా, సియర్రా లియోన్, స్లోవేనియా మరియు స్విట్జర్లాండ్.
ఇందులో కేవలం, శాశ్వత సభ్యులకు మాత్రమే వీటో పవర్ ఉంటుంది, దీని ద్వారా, ఎలాంటి నిర్ణయాన్ని అయినా, వీరికి తిరస్కరించే అధికారం ఉంటుంది. ఉదాహరణకు, 14 దేశాలు ఒక అంశం గురించి ఆమోదిస్తే, ఒక్క శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం దానిని తిరస్కరించినా ఆ నిర్ణయం చెల్లదు. గతం లో ఇలాంటి అధికారం వాడి శాశ్వత సభ్యులు తమ దేశం గాని తమ మిత్ర దేశాలకు కానీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఆపటం జరిగింది.
భారత దేశానికీ శాశ్వత సభ్యత్వం లభించిందా?
అధికారికంగా లభించిన తాజా సమాచారం ప్రకారం, భారతదేశానికీ యు ఎన్ ఎస్ సి లో ఇంకా శాశ్వత సభ్యత్వం లభించలేదు. యు ఎన్ ఎస్ సి వెబ్సైటు ప్రకారం, ప్రస్తుతం అయిదు దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. గతం లో భారత దేశం, అశాశ్వత సభ్యత్వంలో ఉన్నది 2021-2022 లో.
శాశ్వత సభ్యులను పెంచాలి అనే అంశం పై చర్చలు సాగుతున్నప్పటికీ, దీని గురించి ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
తీర్పు
ప్రస్తుతం భారత దేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం లేదు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం ప్రచారం అవుతుంది.
(అనువాదం : రాజేశ్వరి పరసా)