ద్వారా: ఇషిత గోయల్ జె
సెప్టెంబర్ 6 2024
వైరల్ అవుతున్న వీడియో ఖమ్మం కి చెందినది కాదు, సౌదీ అరేబియాకి చెందినది.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఇది ఖమ్మం లో కొద్ది రోజుల క్రితం వరదలలో చిక్కుకుపోయిన వ్యక్తులను బుల్ డోజర్ సహాయం తో కాపాడిన వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోని షేర్ చేస్తూ, 9 మంది మున్నేరు వరదలో ఇరుక్కుపోతే, అందరు వద్దంటున్న తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జె సి బి ద్వారా వాళ్ళను కాపాడారు అని అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి శీర్షికలతోనే మరిన్ని పోస్టులు కుడా షేర్ చేయబడ్డాయి, వాటి ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సెప్టెంబర్ 1, 2024 నాడు, తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా లో 30 సంవత్సరాల తరువాత మున్నేరు వాగు పొంగి వరదలు సంభవించాయి. బొక్కలగడ్డ, మోతీ నగర్, ధంసలపురం, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్ మరియు ఇతర ప్రాంతాలు వరదలకు గురి అయ్యాయి. ఒక సంఘటనలో సుభాన్ ఖాన్ అనే హర్యానా కి చెందిన వ్యక్తి తన బుల్ డోజర్ ని వాడి ప్రకాష్ నగర్ లో మున్నేరు బ్రిడ్జి పై ఇరుక్కుపోయిన 9 మంది ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనకు సంభందించిన వీడియోలను వార్త సంస్థల ద్వారా విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.
వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వీడియో తెలంగాణలో జరిగిన సంఘటనకు సంబంధిచిన ఘటన కాదు.
వాస్తవం ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, సౌదీ అరేబియా లో ఏప్రిల్ 2024 లో ప్రచురితమైన ఒక కథనం లభించింది. గల్ఫ్ న్యూస్ అనే సంస్థ ఈ వీడియోని పోస్ట్ చేసి, దానికి సంబంధించి రాస్తూ, అధిక వర్షాల వలన వచ్చిన వరదలలో కొంత మంది ఇరుక్కుపోగా, ఆయేద్ బిన్ డాగ్హ్యాష్ అల్ అక్లాబి అనే వ్యక్తి ఇద్దరు సివిల్ డిఫెన్సె ఉద్యోగులతో కలిసి ఇరుక్కుపోయిన వారిన బుల్డోజర్ ద్వారా కాపాడినట్టు కథనం పేర్కొంది. ఈ సంఘటనలో ఒక సౌదీ అరేబియా కి చెందిన వ్యక్తి జూవాబా వ్యాలీ లో బిషా వరదల సమయంలో వారిని కాపాడారు.
ఇతర వార్త సంస్థలు కుడా ఈ విషయం గురించి ఇవే వివరాలతో ప్రచురించాయి. మిడిల్ ఈస్ట్ బిజినెస్ ప్రకారం, వాడి అల్ జుబా లో వచ్చిన వరదల సమయం లో నలుగురు వ్యక్తులు చిక్కుకుపోగా, వారిని అల్ అక్లాబీ అనే వ్యక్తి ట్రాక్టర్ నడిపి వారిని కాపాడారు.
తీర్పు
వైరల్ వీడియోలో ఉన్న ఘటన 2024 సౌదీ అరేబియా లోని బిషా వరదల సమయంలో తీసినది. ఖమ్మం వరదలకి సంభందించిన ఘటన కాదు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)