ద్వారా: రాహుల్ అధికారి
అక్టోబర్ 1 2024
ఈ వీడియోని సెప్టెంబర్ 10, 2024 నాడు టీమోర్ లెస్టే రాజధాని దిలీ లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన సందర్భం లో తీసినది.
క్లెయిమ్ ఏమిటి?
జన సంద్రం ఉన్న ఫొటోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి కొంత మంది యూజర్లు వీరందరూ ముస్లింలు, అసదుద్దీన్ ఒవైసి పిలుపు మేరకు ముంబైకి ర్యాలీ లా తరలి వెళ్లారు అని రాసుకొచ్చారు. అసదుద్దీన్ ఒవైసి హైదరాబాద్ నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు. ఒక ఎక్స్ యూసర్ ఈ వీడియోని షేర్ చేసి, “అసదుద్దీన్ ఓవైసి పిలుపుతో మహారాష్ట్రలో ముస్లిమ్స్ ర్యాలీ ఇది.. భారతదేశ భవిష్యత్ ఉహించుకోండి,” ఈ విధంగా శీర్షిక పెట్టి షేర్ చేసారు. అలాంటి పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇదే పోస్టు ఇతర బాషలలో కుడా షేర్ అయింది, వాటి ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఈ పోస్టు ఈ సమయం లో షేర్ అవ్వడానికి కారణం, సెప్టెంబర్ 23, 2024 నాడు ముంబైలో 12,000 మంది ముస్లింలు ఏకమై భారతీయ జనతా పార్టీ ఎం ఎల్ ఏ నితీష్ రాణే మరియు ప్రవచకుడు రాంగిరి మహారాజ్ ను వారు చేసిన ద్వేషపూరితమైన ప్రసంగానికి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.
కానీ వైరల్ అవుతున్న వీడియోకి ముస్లింలు ముంబైలో జరిపిన ర్యాలీకి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వీడియో టీమోర్ లెస్టే దేశంలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన సమయం లో తీసినది.
మేము ఏమి కనుగొన్నాము?
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు ఈ వీడియో మాకు వైరల్ అవుతున్న వీడియో టిక్ టాక్ మరియు ఫేస్బుక్ లలో లభించింది. ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి ఇది టీమోర్ లెస్టే లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన సమయంలో తీసినదిగా రాసుకొచ్చారు (ఆర్కైవ్ ఇక్కడ).
మరొక యూజర్, రేయ్ మార్క్స్ ఈ వీడియోని టిక్ టాక్ లో షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ) #timor హ్యాష్ట్యాగ్ లు వాడారు. ఆ వీడియోలో ఉన్న ఒక కామెంట్ లో 600000 మంది టీమోర్ లెస్టే లో పోప్ ను ఆహ్వానించడానికి వచ్చారు అన్నట్టుగా ఉంది. ఈ పోస్టుకు యూజర్ స్పందిస్తూ, ‘750,000 మంది’ అని ‘సవరణ’ రాసారు. దీని ద్వారా, ఈ వీడియో టీమోర్ లెస్టే కి చెందినది అని మనకి అర్థమైంది.
మరింత స్పష్టంగా ఉన్న మరో టిక్ టాక్ వీడియో మాకు లభించింది (ఆర్కైవ్ ఇక్కడ), దీనిని NyongTimor92 అనే యూజర్ షేర్ చేసారు. ఈ పోస్టులో ఇండోనేషియా భాషలో ఉన్న సుశీర్షిక లో ఈ వీడియోను పోప్ ఫ్రాన్సిస్ పర్యటన సమయంలో టీమోర్ లెస్టేలో సెప్టెంబర్ 10 నాడు తీసినట్టు ఉంది.
రాయిటర్స్ కథనం ప్రకారం, తూర్పు టీమోర్ లో దాదాపుగా 600,000 మంది పోప్ ఫ్రాన్సిస్ ప్రవచనానికి విచ్చేసారు, ఇది సెప్టెంబర్ 10 నాడు దిలీ లోని ఎస్ప్లానెడ్ వద్ద జరిగింది అని పేర్కొంది. ఈ కథనం లో దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు ఈ కార్యక్రమానికి వచ్చిన జనాలు ఉన్నట్టుగా పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంభందించిన ఫొటో రాయిటర్స్ ప్రచురించింది, ఇందులో పోప్ ఒక ఓపెన్ టాప్ పోప్ మొబైల్ వాన్ లో తిరుగుతూ అందరికి చెయ్యి ఊపుతూ, ఆశీర్వాదాలు ఇస్తూ పర్యటించారు. ఈ ఫొటోకి శీర్షికగా ఇది సెప్టెంబర్ 10, 2024 లో తూర్పు టీమోర్ లోని దిలీ లో చోటు చేసుకున్నట్టుగా షేర్ చేసారు.
పైగా, గూగుల్ స్ట్రీట్ వ్యూ లో ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే, వైరల్ వీడియోని కనపడిన భవంతి మరియు ఒక చెట్టు మనం చూడవచ్చు. ఆ కార్యక్రమం జరిగిన చోటును గూగుల్ మ్యాప్స్ లో లభించిన ఫొటోల ద్వారా పరిశీలించాము, దీని ద్వారా ఇది దిలీ అనే ఒక సముద్ర తీర ప్రాంతం లో జరిగినట్టుగా తెలుస్తుంది.
వైరల్ వీడియోలో కనపడే పెట్రోల్ బంక్ ని కుడా మేము గూగుల్ స్ట్రీట్ వ్యూ లో గుర్తించాము. ఈ భవంతి పైకప్పు కాస్త కాస్త ఒరిగినట్టుగా ఉంది, ఇదే విధంగా రెండు వీడియోల లోను కనపడుతుంది. దీని ద్వారా ఇది దిలీ కి సంభందించిన వీడియోనే అని ముంబై కి సంబంధం లేదు అని తెలుస్తుంది.
పైగా, వైరల్ వీడియోలో అనేక ఎరుపు జెండాలు మరియు వీధి దీపాలు ఉన్నాయి. రాయిటర్స్ లైవ్ స్ట్రీమ్ వీడియో (ఆర్కైవ్) చుసిన తరువాత ఈ ఎరుపు జెండాలు టీమోర్ లెస్టే జాతీయ జెండా అని అర్థమైంది.
వైరల్ వీడియో మరియు రాయిటర్స్ లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ పోలిక (సౌజన్యం : ఎక్స్/యూట్యూబ్)
తీర్పు :
తిమోర్ లెస్తే అనే దేశానికీ పోప్ ఫ్రాన్సిస్ పర్యటన సమయంలో తీసిన వీడియోని భారతదేశంలో ముస్లింల ర్యాలీ లాగా షేర్ చేసారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)