ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
అక్టోబర్ 24 2024
వైరల్ అవుతున్న వీడియో ఆగష్టు 2024 నాటిది, గతం లో తన షో లో కొంకణి వర్గానికి సంభందించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పటం జరిగింది.
క్లెయిమ్ ఏమిటి?
భారతదేశ ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు క్షమాపణ చెప్పినట్టుగా సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది.
అక్టోబర్ 12, 2024 నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత బాబా సిద్ధిక్ ను ముంబై లోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ ఆఫీస్ వద్ద కాల్చి చంపటం జరిగింది. ముంబై కి చెందిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు కారణం అని ప్రకటించింది, ఈ గ్యాంగ్ పై 2015 నుండి వివిధ క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి.
ఈ సంఘటన తరువాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఫారూఖీని మరియు భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ ని కూడా గురి పెట్టింది అంటూ కథనాలు వచ్చాయి. ఫారూఖీ గతం లో హిందూ దేవుళ్లపై తాను చేసిన వ్యాఖ్యలు వలన బిష్ణోయ్ కోపానికి గురైనట్టు వార్తలు వచ్చాయి, దీని అనంతరం, ఫారూఖీ కి తన కుటుంబానికి భద్రతను పెంచటం జరిగింది.
ఈ నేపధ్యం లో, ఫారూఖీ క్షమాపణ చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఫారూఖీ హిందీలో మాట్లాడుతూ, ఈ విధంగా చెప్పుకొచ్చారు, “హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం పై నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. కొంతమందితో ఈ మధ్య కాలం లో నేను ఒక షో చేశాను, అందులో కొంకణి గురించి మాట్లాడటం జరిగింది. నాకు కొంకణి వర్గం నుండి అనేక మంది స్నేహితులు ఉన్నారు, నా మాటలను అసంధర్బంగా తీసుకుని షేర్ చేస్తున్నారు, నేను ఎవరిని హేళన చెయ్యాలి అనే ఉద్దేశం తో ఆ విధంగా మాట్లాడలేదు. ఒక స్టాండ్ అప్ కమెడియన్ గా, నవ్వించటం నా బాధ్యత, ఎవరిని భాధ పెట్టటం కాదు. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటునున్నను. ప్రేక్షకులలో అనేక వర్గాలకు సంభందించినవారు ఉన్నారు, ఏదైనా అపార్థం అయి ఉంటె నన్ను క్షమించండి. జై హింద్, జై మహారాష్ట్ర” అని తెలిపారు.
ఈ వీడియోలో ఫారూఖీ బిష్ణోయ్ గ్యాంగ్ అనే పదాన్ని కుడా ఎక్కడా వాడటం మనం చూడలేదు, అయినప్పటికీ ఈ వీడియోని షేర్ చేస్తూ, “సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పనప్పటికీ, ఫారూఖీ క్షమాపణ చెప్పటం జరిగింది. అది కూడా చేతులు జోడించి.” అంటూ షేర్ చేసారు, వీటితో పాటు #BishnoiGang అనే హ్యాష్ ట్యాగ్ లను కుడా వాడారు. అలాంటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇదే విధమైన వ్యాఖ్యలు ఫేస్బుక్ లో కుడా షేర్ చేయబడ్డాయి, వాటి ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ మా పరిశోధన ప్రకారం, ఈ వీడియో ఆగష్టు 2024 నాటికి సంభందించినది, ఆ సమయం లో ఫారూఖీ కొంకణి వర్గానికి సంభందించిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి క్షమాపణ కోరిన వీడియో.
మేము ఏమి కనుగొన్నాము?
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని ఫారూఖీ తన ఎక్స్ అకౌంట్ లో ఆగష్టు 12, 2024 నాడు షేర్ చేసినట్టు తెలుస్తుంది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ పోస్టుకు శీర్షికగా, కొంకణ్ వర్గానికి క్షమాపణ అంటూ రాసుకొచ్చాడు.
ఈ వీడియోలో తన పదాలను అసంధర్బంగా తీసుకోబడ్డాయి అని, తన మాటల వలన, కొంత మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి, వారిని క్షమించమనటం జరిగింది. ఈ వీడియోలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీని ద్వారా, ఇది ఫారూఖీ బిష్ణోయ్ గ్యాంగ్ కు క్షమాపణ తెలిపిన వీడియో కాదని తెలుస్తుంది.
మునావర్ ఫారూఖీ ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్ (సౌజన్యం : ఎక్స్)
ఆగష్టు 2024 లో వచ్చిన వార్తా కథనాలు కుడా, ఫారూఖీ కొంకణి వర్గం పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ప్రస్తావించాయి. న్యూస్ 18 కథనం ప్రకారం, ఫారూఖీ ‘కొంకణీలు ఇతరులను మూర్కులను (ఫూల్స్)’ చేస్తుంటారు అని వ్యాఖ్యానించారు, అనంతరం సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ అవ్వటం తో ఇది వివాదాస్పదంగా మారింది, ఫారూఖీ పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఫారూఖీ బిష్ణోయ్ గ్యాంగ్ కి టార్గెట్ గా ఉన్నారు అనే కథనాలు వచ్చినప్పటికీ, తాను క్షమాపణలు చెప్పినట్టుగా ఎక్కడ వార్తలు రాలేదు.
తీర్పు
మునావర్ ఫారూఖీ ఆగష్టు 2024 లో కొంకణి వర్గానికి సంభందించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన వీడియోను, తప్పుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు క్షమాపణ చెప్పినట్టుగా షేర్ చేస్తున్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)