ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 22 2024
ఈ ఫొటో కనీసం ఏప్రిల్, 2019 నుండి ఆన్లైన్ లో ఉంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో చేసిన రోడ్ షోలకి జనాలు బాగా వచ్చారు.
క్లైమ్ ఏంటి?
రాత్రి పూట ఒక ఖాళీ వీధిలో, పూలదండలతో అలంకరించి ఉన్న ఒక వాన్ ఫొటోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, తెలుగుదేశం పార్టీ అధినేత నెల్లూరులో జరిపిన రోడ్ షోలో జనమే లేరు అని యూజర్లు వ్యంగ్యంగా రాసుకొచ్చారు. “నెల్లూరులో రాత్రి 10 గంటలకి భారీ జనసందోహం” అని ఒక యూజర్ ఇన్స్టాగ్రామ్ లో రాశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.
ఇదే ఫొటోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేసి, “ఇప్పుడే అందిన తాజా వార్త! విజనరీ బాబ్ గారి రోడ్ షో కి భారీ ఎత్తున హాజరైన జనం! తన 40 ఏళ్ల కేరీర్ లో ఎప్పుడూ ఇంత జనసందోహాన్ని చూడలేదు అని సంబ్రమాశ్చర్యానికి గురైన @ncbn బాబ్ గారు! #EndofTDP,” అని శీర్షిక పెట్టారు. ఈ పోస్ట్, ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ క్లైమ్ మే 13, 2024 నాడు ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో సర్కులేట్ అయ్యింది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం - జనసేన- భారతీయ జనతా పార్టీ విపక్ష కూటమిగా ఏర్పడ్డాయి.
ఆన్లైన్ లో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఇది ఈ మధ్య కాలంలో ఫొటో కాదు. ఈ ఫొటో కనీసం 2019 నుండి ఆన్లైన్ లో ఉంది.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఇది ఆన్లైన్ లో 2019 నుండి ఉన్నట్టు తెలుసుకున్నాము. ఈ ఫొటోని భారతీయ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 3, 2019 నాడు షేర్ చేసి, “#LakshmisNTR సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు గానూ ప్రజలు బాధపడి చంద్రబాబు రోడ్ షోని బహిష్కరించారు,” అని రాసుకొచ్చారు. ఏప్రిల్ 11 నాడు జరిగిన 2019 నాటి ఎన్నికలప్పుడు వర్మ ఈ పోస్ట్ షేర్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనేది ప్రముఖ నటులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం. ఈ ఫొటో 2019 నుండి ఆన్లైన్ లో ఉందనేది మనకి దీని ద్వారా స్పష్టం అవుతున్నది.
అలాగే, చంద్రబాబు గత కొన్ని రోజులలో నెల్లూరు వెళ్ళింది కూడా లేదు. దీని బట్టి ఇది “తాజా వార్త” అనే క్లైమ్ కూడా నిరర్ధకమైనది.
చంద్రబాబు ఈ మధ్య కాలంలో నెల్లూరులో ప్రచారంలో పాల్గొన్నది మార్చ్ 29 నాడు. భారతీ టీవీ అనే చానల్ ఈ ప్రచారాన్ని లైవ్ స్ట్రీమ్ చేసింది. అందులో జనాల భాగస్వామ్యం భారీగానే ఉండటం మనం చూడవచ్చు.
మార్చ్ 29 నాడు నెల్లూరులో చంద్రబాబు పాల్గొన్న ర్యాలీ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: భారతీ టీవీ తెలుగు)
దీనికి ముందు చంద్రబాబు మార్చ్ 2 నాడు నెల్లూరులో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారాన్ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుండి వార్తలు అందించే మాంగో న్యూస్ అనే యూట్యూబ్ చానల్ లైవ్ స్ట్రీమ్ చేసింది. 38:14 టైమ్ కోడ్ దగ్గర వేదిక మీద నుండి చంద్రబాబు ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ జనాలా భాగస్వామ్యం భారీగానే ఉండటం మనం చూడవచ్చు.
మార్చ్ 2 నాడు చంద్రబాబు నెల్లూరులో పాల్గొన్న ప్రచారానికి సంబంధించిన ఫొటో (సౌజన్యం: మాంగో న్యూస్/స్క్రీన్ షాట్)
తీర్పు
కనీసం 2019 నుండి ఆన్లైన్ లో ఉన్న ఫొటో షేర్ చేసి, 2024 ఎన్నికల నేపధ్యంలో నెల్లూరులో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనమే లేరని క్లైమ్ చేశారు. నెల్లూరులో మార్చ్ 2024లో చంద్రబాబు నిర్వహించిన రెండు రోడ్ షోలలో జనాలు బాగా వచ్చారు కూడా. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)