హోమ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలోని గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిని అమ్మేసింది అనే క్లైమ్ తప్పుదోవపట్టించేది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలోని గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిని అమ్మేసింది అనే క్లైమ్ తప్పుదోవపట్టించేది

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 1 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలోని గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిని అమ్మేసింది అనే క్లైమ్ తప్పుదోవపట్టించేది విశాఖపట్టణంలోని గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్ సీ జీ సంస్థకి అమ్మేసింది అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రైవేటు సంస్థ. ఈ ఆసుపత్రిలో వాటా అమ్మడం అనేది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన లావాదేవీ. ప్రభుత్వానికి సంబంధం లేదు.

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో 54 శాతం వాటాని హెచ్ సీ జీ సంస్థకి 414 కోట్లకి అమ్మేసింది అనే క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.

అంతే కాక, ఈ ఆసుపత్రిలో ఇంకొక 30 శాతం వాటాన్ని 300 కోట్లకి రానున్న 18 నెలలలో అమ్మేయనున్నారు అని కూడా ఈ క్లైమ్ లో (ఆర్కైవ్ ఇక్కడ) రాసుకొచ్చారు. గత ప్రభుత్వంరాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలని అభివృద్ధి చేయాగా, ఈ ప్రభుత్వం అమ్ముకుంటూ వస్తున్నదని ఇందులో రాసుకొచ్చారు. ఇటువంటి క్లైమ్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధన సంస్థ దేశవ్యాప్తంగా శాఖలు ఉన్న విశాఖపట్నానికి చెందిన సంస్థ. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ సంస్థ (హెచ్ సీ జీ) అనేది దేశవ్యాప్తంగా క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్న సంస్థ

అయితే, ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో  మెజారిటీ వాటాని హెచ్ సీ జీ సంస్థ కొనుగోలు అయితే చేసింది. ఇది రెండు ప్రైవేటు సంస్థల మధ్య లావాదేవీ. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాత్రా లేదు, ఈ ఆసుపత్రి ప్రభుత్వానిదీ కాదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

జూన్ 28, 2024 నాడు ది ఎకనామిక్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, 414 బెడ్లు కలిగిన గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో కంట్రోలింగ్ వాటాని హెచ్ సీ జీ సంస్థ 414 కోట్లకి కొనుగోలు చేసింది. ప్రస్తుతం, హెచ్ సీ జీ కి 51 శాతం వాటా ఉంటుంది. రానున్న 18 నెలలలో మరొక 34 శాతం వాటా కొనుగోలు చేయనున్నారు అని ఈ కథనంలో ఉంది.     

ఈ ఆసుపత్రి పేరు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధన సంస్థ కాగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర వైజాగ్ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ ఆసుపత్రి వెబ్సైట్  లోని వివరాల ప్రకారం, ఈ ఆసుపత్రిని 2005లో తొమ్మిది మంది ప్రవాస భారతీయులు, స్థానికులు కలిసి ఏర్పాటు చేశారు. మంత్రిత్వ శాఖ పత్రాలలో కూడా ఇది ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థ అని ఉంది. 

మంత్రిత్వ శాఖ పత్రాలలో ఆసుపత్రి వివరాల స్క్రీన్ షాట్ (సౌజన్యం: mca.gov.in)

అలాగే, జూన్ 28, 2024 నాడు హెచ్ సీ జీ బాంబే స్టాక్ ఎక్చేంజ్ (బిఎస్ఈ) కి సమర్పించిన వివరాలలో ఈ లావాదేవీ కి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అని ఉంది. ఇది ప్రైవేటు ఆసుపత్రి అని చెప్పడానికి ఇది మరొక సాక్ష్యం.  

బీఎస్ఈ కి హెచ్ సీ జీ సంస్థ సమర్పించిన వివరాల స్క్రీన్ షాట్ (సౌజన్యం: bseindia.com)

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ విభాగాలు లేదా సెంటర్లు ఉన్నాయి కానీ, ప్రభుత్వమే ఒక పూర్తి స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నడుపుతున్న దాఖలా లేదు. విశాఖపట్నంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కి నిధులు భారత ప్రభుత్వం, టాటా మెమోరియల్ సెంటర్ అందిస్తున్నాయి.

జూన్ 29, 2024 నాడు ఆంధ్ర ప్రదేశ్ అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వార్త అబద్ధం అని ఎక్స్  లో (పూర్వపు ట్విట్టర్) పోస్ట్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ). “ఈ క్రింది కథనం పూర్తిగా అవాస్తవం. దీనికీ, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు,” అని ఈ పోస్ట్ లో ఉంది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇచ్చిన వివరణ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/FactCheck.AP.Gov.in)

తీర్పు

రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన లావాదేవీ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు సంస్థలకి “అమ్మేసినట్టు” తప్పుగా క్లైమ్ చేశారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.