హోమ్ 2018 తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో కర్ణాటక ఎన్నికలకి చెందినదని తప్పుగా చెబుతున్నారు

2018 తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో కర్ణాటక ఎన్నికలకి చెందినదని తప్పుగా చెబుతున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2018 తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో కర్ణాటక ఎన్నికలకి చెందినదని తప్పుగా చెబుతున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

2018 తెలంగాణ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోకి వక్ర భాష్యాలు చెప్పారు. ఆ మ్యానిఫెస్టోలో ఒక మతానికే అన్నీ ఇస్తాము అని చెప్పలేదు.

నేపధ్యం

కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 10, 2023 నాడు జరిగాయి. ఎన్నికల నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో అనేక అబద్ధపు వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో ఇదొకటి. 

మే 7 నాడు అనూప్ రావత్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక వార్తా ఛానల్ కి సంబంధించిన వీడియో ఒకటి ట్వీట్ చేసి “కర్ణాటక కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీరు ఇది”  అని జోడించటం జరిగింది. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో “ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ ముస్లిం యువతకే”, “పేద ముస్లిం విద్యార్ధులకి 20 లక్షల రూపాయలు”, “ముస్లిం విద్యార్ధులకి ప్రత్యేక వసతి బడులు”, “మైనారిటీలకి  ప్రత్యేక ఆసుపత్రులు”, “మసీదులకి, చర్చిలకి ఉచిత విద్యుత్తు” హామీలు ఇచ్చింది అని రాసుకొచ్చాడు. ఈ వీడియో టైమ్స్ నౌ ఛానల్ వారి స్పెషల్ బులెటిన్ కార్యక్రమం వీడియో. 

అయితే ఈ ట్వీట్ తప్పుదారి పట్టించే వ్యాఖ్యానంతో నిండి ఉంది. ఈ టైమ్స్ నౌ కార్యక్రమం 2018 నాటిది. అయితే ఈ కార్యక్రమం, మ్యానిఫెస్టో రెండూ కూడా ఇప్పటివి అన్నట్టు ఈ ట్వీట్ ఉంది. అలాగే ఈ టైమ్స్ నౌ కార్యక్రమం కూడా అవాస్తవాలతో నిండి ఉంది. 

వాస్తవం

ఈ స్పెషల్ బులెటిన్ కార్యక్రమం టైమ్స్ నౌ ఛానల్ లో నవంబర్ 26, 2018 నాడు ప్రసారమయ్యిందని లాజికల్లీ ఫ్యాక్ట్స్ గుర్తించింది. ఈ కార్యక్రమం పేరు ‘ఇండియా అప్ ఫ్రంట్  విత్ రాహుల్ శివశంకర్’. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టో మీద ఈ కార్యక్రమం చర్చించింది. 

పైన పేర్కొన్న వైరల్ ట్వీట్ లో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా కర్ణాటక కాంగ్రెస్ మే 2, 2023 నాడు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో లేదు. ఎస్ సి (SC), ఎస్ టి(ST), ఓ బి సి(OBC) వర్గాలకి రిజర్వేషన్ కోటా 75%కి పెంచుతామని, అలాగే ముస్లింల 4% కోటాని తిరిగి తీసుకొస్తామని మాత్రమే ఈ మ్యానిఫెస్టోలో ఉంది. 

ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, ఇతర మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయింపు పెంచుతామని, అలాగే ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, ఇతర మైనారిటీ వర్గాల ప్రార్ధన స్థలాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఏ ఒక్క మతం గురించి ప్రత్యేకంగా ఈ మ్యానిఫెస్టోలో లేదు. 

టైమ్స్ నౌ ఛానల్ వారు పేర్కొన్న మ్యానిఫెస్టో గురించి తెలుసుకోవటానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ని మేము సంప్రదించాము. “ఇది 2018 తెలంగాణ ఎన్నికలలో మేము విడుదల చేసిన మ్యానిఫెస్టో. ఇది కర్ణాటక కాంగ్రెస్ మ్యానిఫెస్టో అని చెప్పి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయాన్ని కూడా మేము కర్ణాటక కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ఈ మ్యానిఫెస్టోలో విషయాలు అని చెప్పబడుతున్న హామీలు కూడా ప్రజలని తప్పుదోవ పట్టించేటట్టు ఉన్నాయి. మేము ముస్లింలకి ప్రత్యేక హామీలు ఇచ్చామన్నట్టు చెబుతున్నారు. అది నిజం కాదు. మా మ్యానిఫెస్టోకి వక్ర భాష్యం తప్ప ఏమీ కాదు ఇది”, అని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హరి ప్రసాద్ లాజికల్లీ ఫ్యాక్ట్స్  కి తెలిపారు. 

టైమ్స్ నౌ తమ కార్యక్రమంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీలు అని చెప్పినవి ఆ మ్యానిఫెస్టోలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి 2018 తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో మేము సంపాదించాము. 2018 తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో క్రైస్తవ, దళిత, ఎస్ సి(SC), ఎస్ టి(ST), మైనారిటీ వర్గాలకి హామీలు ఉన్నాయి. ప్రత్యేకంగా ముస్లింలకు మాత్రమే అంటూ ఏమీ లేవు. 

ముస్లిం యువతకి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది అని టైమ్స్ నౌ కార్యక్రమంలో చెప్పటం జరిగింది. అయితే ఆ మ్యానిఫెస్టోలో ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, లింగ్విస్టిక్ (భాషాధారిత)  అండ్ అథర్ మైనరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము అని మాత్రమే ఉంది.

పేద ముస్లిం విద్యార్ధులకి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది కూడా అసత్యం. మ్యానిఫెస్టోలో చెప్పింది ఏమిటంటే ఎస్ సి(SC), ఎస్ టి(ST), ముస్లిం వర్గాల విద్యార్ధుల విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఉంటుంది అని. 

అలాగే ముస్లిం విద్యార్ధులకి వసతి బడులు అనేది కూడా పూర్తి సమాచారం కాదు. ఆ మ్యానిఫెస్టోలో ఆడపిల్లలకి, ఆదివాసీలకి, మైనారిటీ విద్యార్ధులకి, చూపు సరిగ్గా లేని విద్యార్ధులకి, క్రైస్తవ విద్యార్ధులకి వసతి బడులు ఏర్పాటు చేస్తాము అని ఉంది. 

మైనారిటీల కోసమే ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాము అని ఆ మ్యానిఫెస్టోలో ఉంది అని టైమ్స్ నౌ కార్యక్రమంలో పేర్కొన్నారు. అది అవాస్తవం. మైనారిటీలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో ఆసుపత్రులు పెడతాము అన్నారు గానీ ఆ ఆసుపత్రులు కేవలం వారి కోసమే అని అనలేదు. 

అలాగే మసీదులకి, చర్చిలకి ఉచిత విద్యుత్తు హామీ ఆ మ్యానిఫెస్టోలో ఇచ్చారు అని టైమ్స్ నౌ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇది కూడా సత్య దూరం. గుడులకు, మసీదులకు, చర్చిలకు, ఇతర ప్రార్థన మందిరాలకు ఉచిత విద్యుత్తు అందిస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. 

2018 లో కూడా ది క్విన్ట్ వెబ్సైట్ వారు ఈ టైమ్స్ నౌ కార్యక్రమం అంతా అవాస్తవాలతో నిండి ఉంది అని నిర్ధారించారు. 

తీర్పు

తెలంగాణ కాంగ్రెస్ 2018 లో విడుదల చేసిన మ్యానిఫెస్టోకి వక్ర భాష్యాలు చెప్పిన 2018 నాటి టైమ్స్ నౌ కార్యక్రమాన్ని 2023 కర్ణాటక కాంగ్రెస్ మ్యానిఫెస్టోకి సంబంధించిన కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ ట్వీట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అని మేము నిర్ధారించాము. 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.