తాజా ఎన్నికల ఫలితాల తరువాత పొత్తు గురించి చర్చించుకుంటున్న చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ ల ఫొటోలు అంటూ పాత ఫోటోలనూ షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
జూన్ 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తాజా ఎన్నికల ఫలితాల తరువాత పొత్తు గురించి చర్చించుకుంటున్న చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ ల ఫొటోలు అంటూ పాత ఫోటోలనూ షేర్ చేశారు

తాజా ఎన్నికల ఫలితాల తరువాత పొత్తు గురించి చర్చించటానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఇవి 2019 నాటి ఫొటోలు. నాటి ఎన్నికలకి ముందు బీజేపీ వ్యతిరేక వేదిక స్థాపించే ప్రయత్నాలలో భాగంగా చంద్రబాబు అఖిలేష్ ను కలిశారు.

క్లైమ్ ఐడి 3419e645

క్లైమ్ ఏంటి?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి షేర్ చేసి, జూన్ 4, 2024 నాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించాక కలిసిన ఫొటో అని క్లైమ్ చేశారు. 

భారత ఎన్నికల సంఘం ప్రకారం, ఈ ఎన్నికలలో పాలక భారతీయ జనతా పార్టీ 240 సీట్లు గెలుచుకోగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 232 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి కానీ ఇండియా కూటమికి కానీ సొంతంగా మెజారిటీ మార్క్ అయిన 272 సీట్లు రాకపోవడంతో, ఇండియా కూటమి ఎన్డీఏ పార్టీలైన అయిన తెలుగు దేశం, జనతా దళ్ (యునైటెడ్) లని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నదని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. తెలుగు దేశం ఆంధ్ర ప్రదేశ్ లో 16 సీట్లు గెలుచుకోగా, జనతా దళ్ (యునైటెడ్) బీహార్ లో 12 సీట్లు గెలుచుకుంది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు, అఖిలేష్ కలిసి ఉన్న ఫొటోలని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, “చంద్రబాబు నాయుడిని కలిసిన అఖిలేష్ యాదవ్. రాబోయే కొన్ని గంటలలో పెద్ద ఆటే జరగబోతున్నది,” అని శీర్షిక పెట్టారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇవి 2019 నాటి ఫొటోలు.

మేము ఏమి తెలుసుకున్నాము?

మొదటి ఫొటో

అఖిలేష్ యాదవ్ చంద్రబాబుని శాలువాతో సత్కరిస్తున్న ఫొటో 2019 నాటిదని మేము తెలుసుకున్నాము. ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఇదే ఫొటోని ప్రచురించిన మే 18, 2019 నాటి రెడిఫ్ వార్తా సంస్థ కథనం మాకు లభించింది. చంద్రబాబు కాంగ్రెస్ కి చెందిన రాహుల్ గాంధీ, సీపీఐకి చెందిన జి. సుధాకర్ రెడ్డి, డి. రాజా, నాటి ఎన్సీపీ పార్టీకి చెందిన శరద్ పవార్, లోక్తాంత్రిక్ జనతా దళ్ కి చెందిన కీర్తిశేషులు శరద్ యాదవ్ లతో కలిసి అఖిలేష్ యాదవ్ ను లక్నోలో కలిశారని ఈ కథనంలో ఉంది. 2019 ఎన్నికలకి సంబంధించి ఒక బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం గురించి ఈ సమావేశం అని ఈ కథనంలో తెలిపారు.

ఇదే ఫొటోని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ఆర్కైవ్ ఇక్కడ ) కూడా తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో మే 18, 2019 నాడు పోస్ట్ చేసింది. “ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగు దేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను లక్నోలో కలిశారు,” అని ఈ పోస్ట్ కి శీర్షికగా పెట్టారు. ది క్వింట్ లో వచ్చిన కథనంలో కూడా ఇదే ఫొటో, ఇవే వివరాలు ఉన్నాయి. 

ఏఎన్ఐ సంస్థ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

రెండవ ఫొటో

చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ పక్కపక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టున్న ఈ ఫొటో కూడా 2019 నాటిదే. ఈ ఫొటోని అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ )లో మే 18, 2019 నాడు షేర్ చేసి, “గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారిని లక్నోకి ఆహ్వానించటం ఆనందంగా ఉంది,” అనే శీర్షిక పెట్టారు. 

అఖిలేష్ యాదవ్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

ఈ సమావేశం గురించి ఎన్ డీ టీ వీ మే 18, 2019 నాడు ఒక కథనం ప్రచురించింది. అప్పుడు జరగనున్న ఎన్నికలకి ముందు జాతీయ స్థాయిలో ఒక బీజేపీ వ్యతిరేక వేదిక ఏర్పాటు చేయటం గురించిన సమావేశం ఇదని ఇందులో ఉంది. ఆ సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుండి బయటకి వచ్చేసి, బీజేపీ వ్యతిరేక వేదిక ఏర్పాటు చేయడానికి వివిధ ప్రతిపక్ష నాయకులని కలుస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ఆంధ్ర ప్రదేశ్ లో జన సేన పార్టీ, బీజేపీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. 

ది హిందూ లో కథనం ప్రకారం, తమ పార్టీ ఎన్డీఏ తోనే ఉంటది అని చంద్రబాబు జూన్ 5 నాడు తెలిపారు. అలాగే అదే రోజు సాయంత్రం జరగనున్న ఎన్డీఏ సమావేశంలో తాము పాల్గొంటనట్టుగా కూడా తెలిపారని ఈ కథనంలో ఉంది. అలాగే, కూటమి గురించి చర్చించడానికి చంద్రబాబు అఖిలేష్ యాదవ్ ను ఈ రోజు కానీ, నిన్న కానీ కలిసినట్టు ఎటువంటి కథనాలు లేవు.

తీర్పు

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను 2019లో కలిసినప్పటి ఫొటోలు షేర్ చేసి, తాజా ఎన్నికల ఫలితాల తరువాత కలిసిన ఫొటోలు అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.