ద్వారా: రోహిత్ గుత్తా
జూలై 24 2024
ఈ సంఘటన గుజరాత్ లోని శ్రీ నారాయణ్ విద్యాలయలో జులై 19, 2024 నాడు చోటుచేసుకుంది.
క్లెయిమ్ ఏమిటి ?
సామాజిక మాధ్యమాలలో విద్యార్థులు ఉన్న గదిలో గోడ కూలి నట్టుగా ఒక 1:23 నిమిషాల వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో, విద్యార్థులు ఉండగా హఠాత్తుగా గోడ కూలటం, విద్యార్థులు కంగారు పడటం మనం చూడవచ్చు. ఆ వీడియో ని తమ ఎక్స్ లో షేర్ చేస్తూ, “ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలలో గోడ కూలింది. జగన్ రెడ్డి ఇదేనా నువ్వు ‘నాడు-నేడు’ ద్వారా సాధించింది,” అని రాసుకొచ్చారు.
నాడు నేడు అంటే, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ఉన్న సమయంలో అమలు చేసిన కార్యక్రమం. ఈ పోస్టుకు కథనం రాసే సమయానికి 210,000 వ్యూస్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఎక్స్ లో షేర్ చేసిన మరో పోస్టు, “జగన్ అన్న మీద కోపంతో అయన కట్టించిన అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పకుండా, సిద్ధిలావస్థలో ఉన్న పాడుబడిన బడిలో పాఠాలు చెప్పి పిల్లల ప్రాణాలు తీశారు ఈ ప్రభుత్వం.”
ఈ రెండు పోస్టులలోను ధ్వంసం అయింది ప్రభుత్వ పాఠశాల అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ - జన సేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉంది, వైఎసార్సీపి ప్రతిపక్షం లో ఉంది.
ఆన్లైన్ లో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ, ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు.
మేము ఏమి కనుగొన్నము?
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రభుత్వ పాఠశాలైనా కూలిన సందర్భాలు ఉన్నాయా అని వెతుకగా అటువంటివి ఏమి మాకు లభించలేదు.
వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది అంటూ అనేక కథనాలు మాకు లభించాయి. దివ్య భాస్కర్ అనే గుజరాత్ కి చెందిన పత్రిక ప్రకారం, ఈ సంఘటన గుజరాత్ లోని వడోదర లో రఘోది రోడ్ లో గురుకుల్ చార్ రాస్త వద్ద ఉన్న శ్రీ నారాయణ్ విద్యాలయ లో జులై 19, 2024 నాడు చోటుచేసుకుంది అని పేర్కొంది. పైగా ఆ రిపోర్ట్ ప్రకారం, ఏడవ తరగతి చదువుతున్న విద్యార్ధి కి తలపై గాయం కూడ అయ్యింది అని ఉంది. పైగా టైమ్స్ అఫ్ ఇండియా లో జులై 21, 2024 నాడు ప్రచురించిన కథనం ప్రకారం గాయపడిన విద్యార్ధి పేరు ధైర్య సుతార్ అని అతనికి మూడు కుట్లు పడినట్టుగా, ప్రస్తుతం బానే ఉన్నట్టుగా ఉంది.
ఈ టి వి భారత్ గుజరాత్ కథనం ప్రకారం, ఆ పాఠశాల లోని మొదటి అంతస్థులో గోడ కూలింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి కి గాయాలు కాగా, మూడు బైస్కిల్స్ దెబ్బతిన్నాయి. ఇండియా టుడే కథనం కథనం లో కుడా ఇవే ఫొటోలు ఉన్నాయి.
ఇండియా టుడే కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇండియా టుడే)
ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనం ప్రకారం, వడోదర జిల్లా విధ్యా అధికారి ఆ పాఠశాలకు ఒక షో కాజ్ నోటీసు జారీ చేయటం జరిగింది. కొంతమంది పిల్లల తల్లి దండ్రులుకుడా పోలీస్ కేసు నమోదు చెయ్యటం తో విచారణ చేపడుతున్నారు.
తీర్పు :
గుజరాత్ లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో గోడ కూలిన విషయాన్నీ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాల లో జరిగినట్టు గా షేర్ చేస్తున్నారు.