హోమ్ బీహార్ లో తన భార్యని చంపాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న భర్త వీడియోకి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు

బీహార్ లో తన భార్యని చంపాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న భర్త వీడియోకి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బీహార్ లో తన భార్యని చంపాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న భర్త వీడియోకి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

బాధిత మహిళ కుటుంబ సభ్యులు, అధికారిక పత్రాలు, పోలీసులు అందరూ చెప్పింది ఏమిటంటే భార్య, భర్త ఒకే మతానికి చెందినవారని.

నేపధ్యం

తను తన భార్యని హత్య చేశాను అని భర్త చెబుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమలలో వైరల్ అయ్యింది. అయితే భర్త ముస్లిం అని, తన భార్య హిందూ అయిన కారణంగానే చంపేశాడు అని ఆ హత్యకి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు. “తన భార్య హిందూ అయిన కారణంగానే చంపానని ఎంత గర్వంగా చెబుతున్నాడో చూడండి” అన్న వ్యాఖ్యతో ఒకరు ఈ వీడియోని మే 2, 2023 నాడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ కి 98,000 కి పైగా వ్యూస్, 2,700 రీట్వీట్స్ ఉన్నాయి. ఇదే వీడియోలో భర్త ఆ మహిళని తనతో ప్రేమలో పడేలా చేసి, పెళ్ళయిన సంవత్సరం లోపలే చంపేశాడు, భార్య హిందువు అయిన కారణంగానే చంపేశాడు అనే టెక్స్ట్ కూడా ఎంబెడ్ చేశారు. ఇది ‘లవ్ జిహాద్’ కేసు అని చెప్పకుండానే చెప్పినట్టు. 

వాస్తవం

వీడియోలో రిపోర్టర్ మైక్ మీద ‘ఇన్సాఫ్ 24’ లోగో మేము గమనించాము. ఇన్సాఫ్ 24 బీహార్ కి చెందిన ఒక ప్రాంతీయ వార్తా వెబ్సైట్. వాళ్ళు తమ యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 28, 2023 నాడు అప్లోడ్ చేసిన మొత్తం వీడియో మేము గుర్తించాము. ఆ వీడియోలో భర్త తన భార్యని తానే చంపాను అని ఒప్పుకున్నాడు కానీ, ఆ మహిళ మతానికి సంబంధించి ఏ వివరమూ తను ఇవ్వలేదు.  మేము ఈ విషయం నిర్ధారించుకోవటానికి ఇన్సాఫ్ 24 వాళ్ళని సంప్రదించాము. ఈ హత్యకి ఎటువంటి మత కోణము లేదని, భార్య, భర్త ఒకే మతానికి చెందినవారని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాల్లోని బాంగ్రాలో చోటు చేసుకుంది. 

మే 4, 2023 నాడు ఇన్సాఫ్ 24 వాళ్ళు తమ వెబ్సైట్లో ఈ ఘటనకి సంబంధించి ఒక వార్తా కథనం ప్రచురించారు. తాము బాధిత మహిళ కుటుంబసభ్యులతో మాట్లాడామని, ఇద్దరూ ఒకే మతానికి చెందినవారని వారు కూడా నిర్ధారించారని ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తా కథనం ప్రకారం బాధిత మహిళ పేరు యాస్మీన్ కాగా భర్త పేరు మహమ్మద్ మెహబూబ్ ఆలం. వీరిద్దరికీ ఎనిమిది నెలల క్రితం పెళ్లి అయ్యింది. వీరు ఫోటోలు కూడా ఇందులో జతపరిచారు. 

ఈ విషయం గురించి లాజికల్లీ ఫ్యాక్ట్స్ బాంగ్రాలో స్ట్రింగర్ గా పనిచేసే ఇర్ఫాన్ అహ్మద్ ని సంప్రదించింది. తను మాకు బాధిత మహిళ ఆధార్ నకలు, నిఖానామా (ఇస్లాం పెళ్లి ధృవపత్రము) నకలు అందచేశారు. దీనిబట్టి కూడా భార్య, భర్త ఒకే మతానికి చెందినవారని అనుమానం లేకుండా చెప్పవచ్చు. 

ఈ ఘటనకి మత కోణం ఉన్నదన్న ఆరోపణలని పోలీసులు ఖండించారు. “బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు కట్టడం జరిగింది . ఈ కేసు ఇంకా విచారణ స్థాయిలోనే ఉంది. అయితే బాధిత మహిళ మరొక మతానికి చెందిన మహిళ అన్న విషయం ఏ మాత్రం వాస్తవం కాదు,” అని బాంగ్రా పోలీస స్టేషన్ ఎస్ హెచ్ ఓ అభినవ్ కుమార్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు. 

“కట్నం” కోసమే తమ కూతురుని హతమార్చాడు అని బాధిత మహిళ కుటుంబసభ్యులు చెబుతుండగా, ఈ కేసుని ఇంకా విచారిస్తున్నామని, శవ పరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. 

తీర్పు

“లవ్ జిహాద్” అనే మతతత్వ ప్రచారానికి ఊతం ఇవ్వడానికి ఒక హత్యా ఘటనకి మతం రంగు పులిమి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానిక విలేఖరులు  అందరూ కూడా ఇద్దరూ ఒకటే మతానికి చెందినవారని నిర్ధారించారు. కాబట్టి ఈ వైరల్ వార్త ఆబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.