ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 14 2024
బంగ్లాదేశ్ లోని బొగురా లో జూలై 7 నాడు విద్యుద్ఘాతం కారణంగా ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన వీడియో ఇది.
(గమనిక: ఈ కథనంలో ఆందోళన కలిగించే ఫొటోలు, వివరణ ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)
క్లైమ్ ఏంటి?
వ్యక్తుల శవాల చుట్టూ చేరి ఏడుస్తున్నవారి ఒక నిమిషం 23 సెకన్ల నిడివి ఉన్న వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి పరిస్థితులలో హిందువుల మీద జరిగిన దాడి తాలూకా వీడియో అని క్లైమ్ చేస్తున్నారు. ఈ వీడియోలో, వ్యక్తుల శవాల చుట్టూ చేరి కొంత మంది ఏడవటం, వారిని ఇతరులు ఓదార్చటం మనం చూడవచ్చు.
ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) షేర్ చేసి, బంగ్లాదేశ్ లో హిందువులని “నరికేస్తూ, రేపులు చేస్తుండగా”, ఇండియా లో హిందువులు “మొద్దు నిద్ర”లో ఉన్నారని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఈ వీడియోలో ఉంది హిందువులే కానీ, బంగ్లాదేశ్ లో జరిగిన ఒక రథయాత్ర లో చోటుచేసుకున్న విద్యుద్ఘాతం కారణంగా చనిపోయినవారు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియో ఎడమ పైభాగాన Sirajganj Express అనే లోగో ఉంది. మేము వారి ఫేస్బుక్ అకౌంట్ కనుగొన్నాము. ఆ అకౌంట్ బయో లో బంగ్లాదేశ్ లోని సిరాజ్ గంజ్ కి చెందిన “మీడియా/న్యూస్ కంపెనీ” అని ఉంది. ఈ అకౌంట్ లో ఈ వైరల్ వీడియో ని (ఆర్కైవ్ ఇక్కడ) జూలై 7, 2024 నాడు పోస్ట్ చేశారు. “బొగురా లో జరిగిన రథయాత్ర లో ఐదుగురు చనిపోగా, కనీసం 30 మంది గాయపడ్డారు,” అనేది ఈ వీడియో బెంగాలీ శీర్షిక. బొగురా అనేది ఉత్తర బంగ్లాదేశ్ లో ఒక నగరం.
ఆ తరువాత ఈ వీడియో లోని కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఇది వాస్తవం అని తెలిసింది.
ఢాకా బీడీ న్యూస్ 24 అనే బంగ్లాదేశ్ వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, జూలై 7 నాడు మధ్యాహ్నం పూట బొగురా లో జరుగిన జగన్నాథ రథయాత్ర లో చోటుచేసుకున్న విద్యుద్ఘాతం కారణంగా ఐదుగురు చనిపోగా, యాభై మంది గాయపడ్డారు. చనిపోయిన వారు అలోక్, అతషీ, రజింత, నరేష్, సబితా అని ఈ కథనంలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ అయిన బంగ్లాదేశ్ సంగబద్ సంస్థ లో వచ్చిన ఒక కథనం ప్రకారం, గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి తరలించగా, వైద్యం పొందుతూ ఐదుగురు చనిపోయారు. ఈ కథనంలో ఈ వైరల్ వీడియో లోని విజువల్స్ ఉన్నాయి.
ఢాకా ట్రిబ్యూన్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం, రథం యొక్క లోహ గుమ్మటం పైనున్న హై వోల్టేజ్ విద్యుత్తు తీగలని తాకడంతో మంటలు చెలరేగాయి.
బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని కథనాలు అయితే ఉన్నాయి కానీ, ఈ ఘటన లో చనిపోయిన వారు విద్యుద్ఘాతం కారణంగా చనిపోయారు.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి
తీర్పు
రథయాత్ర లో విద్యుద్ఘాతం కారణంగా చనిపోయిన హిందూ భక్తుల శవాల దగ్గర ఏడుస్తున్న వ్యక్తుల వీడియోని బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి వీడియో అని తప్పుగా క్లైమ్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)