హోమ్ ఎంఐఎం శాసనసభ్యుడు పోలీసులతో గొడవపడుతున్న పాత వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు

ఎంఐఎం శాసనసభ్యుడు పోలీసులతో గొడవపడుతున్న పాత వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రాహుల్ అధికారి

ఆగస్టు 31 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎంఐఎం శాసనసభ్యుడు పోలీసులతో గొడవపడుతున్న పాత వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియోలో ఉన్న మనిషి తెలంగాణలోని నాంపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు. ఈ వీడియో కర్ణాటక ఎన్నికలకి సంబంధించినది కాదు.

నేపధ్యం

2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపి మీద భారీ ఆధిక్యంతో  కాంగ్రెస్ గెలుపొందిన దరిమిలా సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖరారు అయ్యింది. మే 18 గురువారం నాడు కొన్ని రోజుల పాటు కొనసాగిన చర్చల తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డి.కె. శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నిర్ణయం జరిగింది.

ఒక పక్క ఇదంతా జరుగుతుండగా కర్ణాటకలో కాంగ్రెస్ కి చెందిన శాసనసభ్యులు ఒకరు పోలీసులతో వాదిస్తూ వారి పనిని ప్రభావితం చేస్తున్నారంటూ చెబుతూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక పోలీసు చుట్టూ ఒక గుంపు గుమిగూడి ఉంది. ఆ గుంపులో ఒకరు ఈ పోలీసుతో మాట్లాడటం మనం చూడవచ్చు. ఈ వ్యక్తి కాంగ్రెస్ శాసనసభ్యుడని, పోలీసులని ఇబ్బంది పెడుతున్నాడని సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానాలు నడిచాయి. “మేమెలా చెబితే అలా చేయాలని కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒకరు పోలీసులని ఇంటికి పిలుపించుకుని చాలా శాంతంగా చెబుతున్నారు” అని మత ఆధారిత శీర్షికలతో కూడా కొంత మంది ఈ వీడియోని షేర్ చేశారు. 

ఇక్కడ ‘శాంతంగా’ అనే పదాన్ని ‘ఇస్లాం మతం శాంత స్వభావ మతం’ అనే ఒక అభిప్రాయం నేపధ్యంలో ఎత్తిపొడుపుగా వాడుతున్నారు. 

వాస్తవం

“జగిత్యాలలో నాంపల్లి శాసనసభ్యుడు జాఫర్ హుస్సేన్ మిరాజ్ సాబ్” అని ఆ వీడియోలో ఉండటం మేము గమనించాము. మిరాజ్ తెలంగాణలోని నాంపల్లి శాసనసభ్యుడు. ఆలాగే ఎంఐఎం సభ్యుడు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ లో జాఫర్ హుస్సేన్ నాంపల్లి శాసనసభ్యుడు అని ఉంది. 

అలాగే డెక్కన్ క్రానికల్ పత్రికలో మే 11, 2023 నాడు ఒక వార్త కథనం వచ్చింది. ఈ వీడియో నుండి ఒక స్క్రీన్ గ్రాబ్ ని ఈ కథనంలో వాడారు. ఈ వార్తా కథనం ప్రకారం జగిత్యాల గ్రామీణ ఎస్. ఐ. ఏ. అనిల్ ఆర్ టి సి బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణీకులని- తల్లి, కూతురు- మీద దాడి చేశాడు. ఈ ఘటన తరువాత ఈ ఎస్. ఐ. ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇందులో ఎంఐఎం పార్టీ కూడా భాగం అయ్యింది. జాఫర్ హుస్సేన్ బాధితుల ఇంటికి వెళ్ళి, వాళ్ళని పరామర్శించి, ఆ తరువాత జిల్లా ఎస్. పి ఏ. భాస్కర్ ని కలవటానికి వెళ్లారు. 

అలాగే, హైదరాబాద్ కి చెందిన ‘బిబిఎన్ ఛానల్’ అనే వార్తా సంస్థ ఈ విషయం గురించి వివరణాత్మక వీడియో కథను చేసింది. ఈ కథనం శీర్షిక ‘జగిత్యాల బాధితుల కుటుంబాన్ని కలిసిన ఎంఐఎం శాసనసభ్యుడు జాఫర్ హుస్సేన్ మిరాజ్’. ఈ వార్తా కథనంలో మిరాజ్ మీడియాకి ఇచ్చిన ప్రకటన కూడా ఉంది. “బాధిత బాలిక, షేక్ ఫరాహ్, బస్సులో ప్రయాణిస్తున్నది. బస్సులో ప్రయాణిస్తున్న మరొక ప్రయాణికురాలు తన భర్త పోలీసు అని చెబుతూ తనతో గొడవ పెట్టుకున్నది. ఈ గొడవ పెరుగుతూ పోయింది. కొంచెం సేపు అయ్యాక ఈ ప్రయాణికురాలి భర్త బస్సు వద్దకు వచ్చి, బస్సుని ఆపి ఈ బాలిక మీద దాడి చేశాడు. అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు నా సోదరి ఫరాహ్ ని కలవటానికి వచ్చాను. ఈ ఎస్. ఐ. అనీల్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఈ ఎస్. ఐ. మీద భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 354 (మహిళల గౌరవాన్ని కించపరచటం) కింద కేసు నమోదు చేయమని జిల్లా ఎస్. పి. ని అడిగాను” అని జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. 

ఈ వైరల్ వీడియోనే ఎంఐఎం అధికార ఫేస్బుక్ పేజిలో మే 11 నాడు షేర్ చేశారు. అప్పుడు పెట్టిన శీర్షిక ‘జగిత్యాలలో ఎంఐఎం శాసనసభ్యుడు, బృందం’. 

జిల్లా ఎస్. పి. భాస్కర్ ని కలిసిన ఫొటోలు మిరాజ్ హుస్సేన్ తన ఫేస్బుక్ పేజిలో పెట్టారు. ఈ వీడియోలో ఏ బట్టలు వేసుకుని ఉన్నారో, అవే బట్టలు ఈ ఫొటోలో కూడా ఉన్నాయి. అలాగే బాధిత కుటుంబాన్ని కలిసిన ఫొటోలు కూడా తన ఫేస్బుక్ పేజిలో పెట్టారు. వైరల్ వీడియోలో ఉన్న మనిషి తానే అని వీటి ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది.

ఈ వైరల్ వీడియో ఎంఐఎం శాసనసభ్యుడు సిరాజ్ హుస్సేన్ మిరాజ్, పోలీసు అధికారి మధ్య సమావేశానికి సంబంధించిన వీడియో  అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ క్లిప్ కి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అలాగే కర్ణాటక ఎన్నికలకి సంబంధించిన వీడియో కూడా కాదు. 

తీర్పు

ఎంఐఎం పార్టీకి చెందిన తెలంగాణ శాసనసభ్యుడు ఒకరు పోలీసు అధికారులతో మాట్లాడతున్న వీడియోని పోలీసు అధికారులతో వాదిస్తున్న కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ్యుడు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు పౌరులని ఒక సబ్-ఇన్స్పెక్టర్ వేధించిన ఘటనకి సంబంధించి పోలీసు అధికారులతో ఎంఐఎం శాసనసభ్యుడు మాట్లాడుతున్న వీడియో ఇది. కాబట్టి ఇది అబద్ధం అని మేము నిర్ధారించాము. 

అనువాదం- గుత్తా రోహిత్

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.