ద్వారా: ప్రభాను దాస్
అక్టోబర్ 22 2024
ఈ కేసు లో నమోదైన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, నిందుతురాలి పేరు రీనా, తాను ఒక హిందూ యువతి, ముస్లిం మతస్థురాలు కాదు.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో కొంత మంది యూజర్లు ఈ మధ్య ఘజియాబాద్ లో జరిగిన సంఘటనకు సంభందించిన ఒక 37 సెకెన్ల వీడియోను షేర్ చేసి ఈ సంఘటనలో నిందితురాలు ముస్లిం మతస్థురాలు అన్నట్టుగా చేస్తున్నారు. ఒక ఎక్స్ యూజర్, ఈ వీడియో ని షేర్ చేసి, “ఘజియాబాద్‌లో ఒక హిందూ కుటుంబంలో పనిచేసే ముస్లిం మహిళ 3 నెలలుగా ఆహారంలో తన మూత్రాన్ని కలుపుతోంది. మొత్తం కుటుంబం ఇప్పుడు కాలేయ వైఫల్యంతో బాధపడుతోంది వారి ద్వేషం శిఖరాలకు చేరాయి!”
ఇదే పోస్టును ఇతర భాషలలో కుడా షేర్ చెయ్యటం జరిగింది. వాటి ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోకు మతరంగు పులిమి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ నేత, కాయిమ్ మెహదీ కుడా షేర్ చేసారు. తన పోస్టులో నిందుతురాలి అసలు పేరు రుబీనా ఖాతూన్ అని రీనా కాదు అంటూ రాసుకొచ్చారు. తాను షేర్ చేసిన పోస్టుకు ఈ కథనం రాసే సమయానికి 385,000 వ్యూస్ మరియు 7,500 లైక్స్, 4,000 రిషేర్స్ ఉన్నాయి.
కానీ మా పరిశోధన ప్రకారం, ఈ సంఘటన లో నిందుతురాలు రీనా కుమార్, ఈమె హిందూ మతానికి చెందిన వ్యక్తి.
మేము ఏ విధంగా కనుగొన్నాము?
వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ సంఘటన గురించిన అనేక వార్తా కథనాలు మాకు లభించాయి. ది ఎకనామిక్ టైమ్స్, ది టైమ్స్ అఫ్ ఇండియా కథనాల ప్రకారం ఈ సంఘటన లోని మహిళ శాంతి నగర్ కి చెందిన 32 సంవత్సరాల రీనా కుమార్.
ఈ కథనాల ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని క్రొస్సింగ్స్ రిపబ్లిక్ అనే ఒక టౌన్ షిప్ లో ఉంటున్న ఒక కుటుంభం లో రీనా కుమారి వంట మనిషిగా పని చేసేది. వారు తరచుగా అస్వస్థత కు గురి కావడంతో తినే ఆహరం లో ఏమైనా కలుస్తుందా అనే అనుమానం వచ్చి, వంట గదిలో రహస్య కెమెరాను అమర్చారు. దీని ద్వారా, వంట మనిషి రీనా ఆహరం లో మూత్రాన్ని కలుపుతుంది అని తెలుసుకున్నారు.
ఏ ఎన్ ఐ న్యూస్ ఏజెన్సీ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, ఈ కేసులోని నిందితురాలిని అరెస్ట్ చేయటం జరిగింది, ఆమె పేరు రీనా కుమార్ అని ఉంది, ఆర్కైవ్ ఇక్కడ.
వైరల్ వీడియోకి సంభందించిన స్క్రీన్ షాట్లు ఉన్న వార్తా కథనాలు కుడా మేము గమనించాము. పైగా, ఎక్స్ లో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక పాత్రికేయుడు సచిన్ గుప్తా కూడా అక్టోబర్ 16 నాడు ఈ వీడియోని షేర్ చేసి నిందురాలిని గుర్తించారు (ఆర్కైవ్ ఇక్కడ). అక్టోబర్ 21, 2024 నాడు, సచిన్ గుప్తా, ఈ సంఘటన గురించి తప్పుడు సమాచారం ప్రచారం అవుతుంది అని, ఈ కేసులో నిందితురాలు రీనా కుమార్ అని తన పేరు ఎఫ్ ఐ ఆర్ లో నమోదు అయింది అని ఆ కాపీ ని షేర్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ).
లాజికల్లీ ఫ్యాక్ట్స్ కుడా ఎఫ్ ఐ ఆర్ కాపీ ని సంపాదించింది, ఈ ఘటనలో నిందుతురాలి పేరు, రీనా కుమార్, తన భర్త పేరు ప్రమోద్ కుమార్. రుబీనా ఖాతూన్ అనే పేరు ఎక్కడా మనకు కనపడదు.
ఎఫ్ ఐ ఆర్ కాపీ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఘజియాబాద్ పోలీస్)
పైగా, లాజికల్లీ ఫ్యాక్ట్స్ క్రాసింగ్స్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రీతి గార్గ్ ను కూడా సంప్రదించింది. ఈ విషయం లో ఏ విధమైన మత కోణం లేదని ఆవిడ నిర్ధారించారు. పైగా నిందుతురాలి పేరు రీనా అని తాను హిందూ మతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు.
తీర్పు
మా పరిశోధన ప్రకారం, ఘజియాబాద్ సంఘటనలో నిందితురాలు, రీనా కుమార్, ఈవిడ ఒక హిందూ మహిళ. వైరల్ అవుతున్న పోస్టులు తప్పుగా, ఆమె ముస్లిం మతస్థురాలు అన్నట్టుగా షేర్ చేసారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)