ద్వారా: సోహం శా
ఆగస్టు 25 2023
ఈ ఫొటో ఫొటో ఎడిటింగ్ టూల్ వాడి సృష్టించారు. ఈ విషయాన్ని ఈ ఫొటో చేసిన మనిషి కూడా ధృవీకరించారు.
నేపధ్యం
చంద్రయాన్-2 ద్వారా సాధించలేనిది ఇస్రో చంద్రయాన్-3 ద్వారా సాధించడంతో అందరూ ఈ చారిత్రక విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక తెల్లటి బ్యాక్ గ్రౌండ్ మీద ఇస్రో లోగోతో పాటు భారతదేశ అధికారిక చిహ్నమైన అశోక స్థూపం ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఇది చంద్రయాన్-3కి చెందిన ప్రగ్యాన్ రోవర్ ముద్ర అంటూ సామాజిక మాధ్యమాలలో క్లైమ్ చేశారు.
ఎక్స్ (ఇంతకమునుపు ట్విట్టర్) లో పోస్ట్ చేసిన అటువంటి పోస్టులో ఒకరు ఇలా రాసుకొచ్చారు- చంద్రుని ఉపరితలం మీద శాశ్వత ముద్ర. రోవర్ టైర్లు వేసిన ముద్ర ఫొటో ఇది. చంద్రుడి మీద గాలి ఉండదు కాబట్టి ఈ ముద్ర శాశ్వతంగా ఉంటుంది.
ఇదే ఫొటో దాదాపు ఇటువంటి క్లైమ్ తోనే ఫేస్బుక్, వాట్స్ ఆప్ లో కూడా వైరల్ అయ్యింది.
(ఎక్స్ లో షేర్ చేసిన ఫొటో (సౌజన్యం: ఎక్స్/@chikhani_manish, @Pushpendraamu/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్))
అయితే ఇది ఫేక్ ఫొటో. ఫొటో ఎడిటింగ్ టూల్స్ వాడి చేసిన ఫొటో ఇది.
వాస్తవం
ఈ ఫొటో కింద '© Krishanshu Garg’ అనే వాటర్ మార్క్ ఉంది.
(వైరల్ ఫొటోలో Krishanshu Garg వాటర్ మార్క్ (సౌజన్యం: ఎక్స్))
ఈ క్లూ వాడి ఇంకా వెతికితే ఈ ఫొటోని బుధవారం నాడు క్రిషాను గార్గ్ (@ Krishanshu Garg) అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారని కనుగొన్నాము.
(ఎక్స్ లో క్రిషాను గార్గ్ షేర్ చేసిన ఫొటో (సౌజన్యం: ఎక్స్/@ Krishanshu Garg))
లాజికల్లీ ఫ్యాక్ట్స్ గార్గ్ ని సంప్రదించింది. గార్గ్ ఒక వ్యాపారవేత్త, అలాగే అంతరిక్ష విషయాల మీద ఆసక్తి ఉన్న వ్యక్తి. అడోబ్ ఫొటోషాప్ వాడి తానే ఈ ఫొటో చేశానని ఆయన మాకు తెలిపారు. లక్నో నివాసి అయిన గార్గ్ చంద్రయాన్-3 ల్యాండింగ్ కౌంట్ డౌన్ అప్పుడు తాను ఈ ఫొటో తయారుచేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు తెలిపారు.
(గార్గ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్ ))
“ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం నా ఉద్దేశం కాదు. ల్యాండింగ్ కి పది గంటలఊ ముందు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాను. మరి ల్యాండింగ్ అయిన తరువాత ఇది నిజమైన ఫొటో అని జనాలు ఎలా, ఎందుకు షేర్ చేశారో నాకు తెలీదు. నాకు కూడా ఇది ఆశ్చర్యంగానే ఉంది”, అని గార్గ్ అన్నారు.
బుధవారం సాయంత్రం 6:04కి ప్రగ్యాన్ రోవర్ ల్యాండ్ అవ్వటానికి చాలా మునుపే గార్గ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారని ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తే స్పష్టమయ్యింది.
ఈ ముద్ర ఏమిటి?
ప్రగ్యాన్ రోవర్ ఇస్రో లోగో, అశోక స్థూపం ముద్రని చంద్రుడి ఉపరితలం మీద విడవటం అయితే జరుగుతుంది. ఇస్రో తమ వెబ్సైట్ లో చంద్రయాన్-3 మిషన్ గురించి పోస్ట్ చేసిన కర్టైన్ రైజర్ వీడియోలో 4:08 టైమ్ స్టాంప్ దగ్గర ఈ ముద్ర ఎలా ఉండబోతుందో అని తెలిపింది.
(ఇస్రో కర్టైన్ రైజర్ వీడియోలో చంద్రుడి ఉపరితలం మీద ఎడమ వైపు రోవర్ ఇస్రో లోగో, అశోక స్థూపం ముద్ర ఎలా విడుస్తుందో చూపించారు (సౌజన్యం : స్క్రీన్ షాట్/ఇస్రో))
సెప్టెంబర్ 2, 2019 నాడు చంద్రయాన్-2 మిషన్ నాటి రోవర్ యానిమేటెడ్ వీడియోని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. 2:46 టైమ్ స్టాంప్ దగ్గర ఇటువంటి ముద్రనే మనం చూడవచ్చు.
అయితే ఈ రెండు వీడియోలలో ఇస్రో లోగో, అశోక స్థూపం రోవర్ కి ఇరువైపులా ఉన్నాయి. అయితే గార్గ్ చేసిన ఫొటోలో రెండూ ఒకవైపే ఉన్నాయి.
ఇండియా టుడే లాంటి మీడియా సంస్థలు కూడా ఇస్రో లోగో, అశోక స్థూపం ముద్ర చంద్రుడి మీద ఉంటుంది అని రిపోర్ట్ చేశాయి. అలాగే ఆ ముద్ర ఎలా ఉండవచ్చో అనేది కూడా విజువల్ గా తమ రిపోర్ట్ లో ప్రస్తావించారు.
కాబట్టి సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్న ఫొటో ఫేక్. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ ముద్ర ఫొటోలు ఏవీ ఇస్రో విడుదల చెయ్యలేదు.
తీర్పు
ఇది ఫొటోషాప్ ద్వారా చేసిన ఫొటో. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారిస్తున్నాము.