ద్వారా: ఇషిత గోయల్ జె
డిసెంబర్ 12 2023
2021 లో కన్యాకుమారిలోని స్థానికులు అక్కడ వర్షపు నీటితో ఆడుకుంటున్న వీడియోని మిజ్ గాం తుఫాన్ తరువాత చెన్నైలోని సన్నివేశంగా షేర్ చేశారు.
డిసెంబర్ 2023లో మిజ్ గాం తుఫాను బంగాళాఖాతం లో తీరం దాటుతున్నప్పుడు, దక్షిణ భారత దేశంలోని పలు పట్టణాలలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను వలన చెన్నై లో తీవ్ర స్థాయి లో వర్షాలు, దాని వలన వరద సంభవించాయి. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, చెన్నై లోని మధురవాయల్, పోరూర్, సాలిగ్రామం మరియు వలసరావక్కం లాంటి పలు చోట్ల నీరు నిలిచిపోయింది. ఎడతెరిపి లేని వాన వలన చెట్లు కూలిపోయి, రోడ్ల పై రాకపోకలు నిలిచిపోగా, విద్యుత్ సరఫరాకి కుడా అటంకం కలిగింది.
క్లెయిమ్ ఏమిటి?
చెన్నై లో తుఫాను భీభత్సం తరువాత అక్కడి స్థితిగతులను సూచిస్తూ సామాజిక మాధ్యమాలలో అనేక మంది పోస్ట్లు పెట్టడం ప్రారంభం అయింది. అలాంటి వాటిల్లో ఒక వీడియోలో వరద నీటిలో కొంతమంది ఆడుకుంటున్నట్టు కనిపిస్తుంది, ఇది చెన్నైలోది అన్నట్టుగా ఒకరు షేర్ చేసారు. ఎక్స్ మరియు ఫేస్బుక్ లాంటి మాధ్యమాలలో ఆ వీడియోతో పాటు ఇలా షేర్ చేస్తున్నారు- సామాజిక మాధ్యమాలలో ప్రజలు చెన్నై ఇబ్బందిలో ఉంది అంటూ వేడుకుంటుంటే చెన్నై లో ఉన్న ప్రజలు ఈ విధంగా ఉన్నారు. ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్స్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
మేము ఏమి కనుగొన్నాము?
వైరల్ అవుతున్న వీడియోని పరిశీలించగా ఇందులో రెండు వీడియోలు కలిపి ఉన్నాయని అర్ధమయింది.
మొదటి భాగంలో (0:00 నుండి 0:04 వరకు) కొంతమంది వ్యక్తులు ఒక భవంతి ముందు ఈత కొడుతున్నట్టుగా ఉంటుంది. రెండో భాగం 0:05 నుండి మొదలవుతుంది. ఇందులో వ్యక్తులు మురికి నీటిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. దీనిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ రెండు వీడియోలు కుడా 2021లో తీసినవి అని అర్దమవుతుంది.
మొదటి వీడియో
మొదటి క్లిప్ లో భవంతి పైన తమిళ్ లో రాసి ఉన్న దాని ఆధారంగా వెతికితే ఇది తమిళనాడు లోని కన్యాకుమారిలో ఉన్న సెయింట్ మైఖేల్ చర్చి అని అర్ధమయింది. ఇక్కడ ఉన్న చర్చి ద్వారం, ఇటుక రాళ్ళ మాదిరిగా ఉన్న గోడ డిజైన్, నల్లటి మెట్లు, పక్కనే ఉన్న చెట్టు, ఇవన్నీ చూస్తే వైరల్ వీడియో కన్యాకుమారి వీడియో అని, చెన్నైది కాదు అని అర్దమవుతుంది.
వైరల్ క్లిప్ మరియు సెయింట్ మైఖేల్ చర్చి మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ వెబ్సైట్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)
పైగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా అదే సన్నివేశం ఉన్న మరో 29 సెకండ్ల వీడియో మాకు ఒక ఫేస్బుక్ గ్రూప్ లో దొరికింది, దీనిని నవంబర్ 14, 2021 నాడు పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ శీర్షికలో కుడా కన్యాకుమారి అని రాసి ఉంది. కనుక మిజ్ గాం తుఫానుకి ముందునుండే ఈ వీడియో సర్కులేషన్ లో ఉంది అని అర్ధమయింది.
రెండో వీడియో
మరింత నిడివి గల ఇదే వీడియోని నవంబర్ 13, 2021 నాడు ఫేస్బుక్ లో అంజూగ్రామం, కన్యాకుమారి లోది అంటూ షేర్ చేయబడింది.
ఈ రెండు వీడియోలను జత చేసి వర్షంలో ఆడుకుంటున్న స్థానికులు అని కౌముది గ్లోబల్ అనే ఒక కేరళ మీడియా సంస్థ యూట్యూబ్ లో నవంబర్ 15, 2021 నాడు షేర్ చేసింది. ఈ వీడియోకి శీర్షిక గా, “చూడండి: వరద నీటిని బయటకి పంపే క్రమం లో స్థానికులు ఫుట్ బాల్ ఆడుతూ పుష్ అప్స్ చేస్తూ ఉన్నారు| కన్యాకుమారి వర్షాలు.” అని ఉంది. న్యూస్ 18 కుడా ఈ వీడియో గురించి రిపోర్ట్ చేస్తూ ఇది కన్యాకుమారిలోది అని పేర్కొంది.
టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, నవంబర్ 13, 2021 నాడు కన్యాకుమారిలో తీవ్ర వర్షాల వలన అక్కడి జనాలు ఇబ్బంది పడ్డారు. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం చాలా ప్రదేశాలు నీట మునిగాయి.
మేము ప్రత్యేకంగా ఈ వీడియో ఎక్కడిది అని కనుక్కోలేకపోయినా వివిధ సోర్సెస్ నుంచి వచ్చిన ఆధారాలతో చూస్తే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిజ్ గాం తుఫాన్ కి మునుపు తీసింది అని అర్ధమవుతుంది.
మిజ్ గాం తుఫాను సమయంలో ప్రచారం అవుతున్న ఇతర వీడియోలను కుడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ కుడా ఫాక్ట్ చెక్ చేసింది.
తీర్పు:
కన్యాకుమారిలో వరద సమయంలో తీసిన వీడియోలను చెన్నైలో మిజ్ గాం తుఫాన్ సమయంలో తీసిన వీడియోలలా ప్రచారం చేశారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరస)