ద్వారా: అజ్రా అలీ
ఫిబ్రవరి 5 2024
2022 నాటి ఈ రెండు వీడియోలు హైదరాబాద్, ఉత్తర్ ప్రదేశ్ లకి సంబంధించినవి.
నేపధ్యం
అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్టకి ఒక రోజు ముందు అనగా జనవరి 21, 2024 నాడు ముంబైలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన నయా నగర్ లో మతపరమైన హింస చెలరేగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక కథనం ప్రకారం అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకి సంబంధించిన ఒక ర్యాలీ ఈ ప్రాంతంలో ముస్లింలు అధికంగా నివసించే వీధుల నుండి వెళ్ళినప్పుడు ఈ హింస చెలరేగింది.
అనేక మంది స్థానికులు వివిధ వాహనాలలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అందులో ఒక మోటార్ సైకిల్ కి తుపాకీ కాల్పుల శబ్ధం వచ్చేటువంటి సైలెన్సర్ పెట్టడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకి గురయ్యారు. అలాగే ఇది అనేక పుకార్లకి తావిచ్చింది. దీని కారణంగా ఇరు మతాలకి చెందిన వారి మధ్య గొడవ మొదలయ్యింది. అది హింసకి దారితీసింది. ఆ మరుసటి రోజు రాళ్ళు రువ్వటం, ఆస్తులని ధ్వంసం చేయటం లాంటివి జరిగాయి. దీనితో పోలీసులు తీవ్రంగా స్పందించారు. కొంత మంది వ్యక్తులు వాహనాలని, ఆస్తులని ధ్వంసం చేయడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
ఈ మత హింసకి సంబంధించి ముంబై పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారని హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. అలాగే, ఆక్రమలని తొలగించడం పేరు మీద అధికారులు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలలో కొన్ని భవనాలని కూల్చేశారు.
క్లైమ్ ఏంటి?
ఈ నేపధ్యంలో మీరా రోడ్ గొడవలకి సంబంధించి పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారంటూ క్లైమ్ చేస్తూ రెండు వీడియోలని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. మొదటి వీడియోలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాంటివి వేసుకుని పోలీసులు కొంతమంది మీద లాఠీ ఛార్జ్ చేస్తూ వారిని పోలీసు వాహనం వైపు లాక్కెళ్లటం మనం చూడవచ్చు. రెండవ వీడియో వివిధ వీడియోల సమాహారం. ఇందులో మొదట కొంత మంది జైలు లాంటి గదిలో ఉండటం చూడవచ్చు. ఆ తరువాత, వారిని పోలీసులు కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియోలని షేర్ చేసి ర్యాలీ మీద “దాడి” చేసినందుకు పోలీసులు దాడి చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న వీడియో అని క్లైమ్ చేశారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
అయితే ఈ క్లైమ్ అబద్ధం.
ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
మేము ఏమి తెలుసుకున్నాము?
మొదటి వీడియో
ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఇందులో పోలీసులు తెలుగులో మాట్లాడటం మనం గమనించవచ్చు. ముంబైలో ప్రధానంగా మాట్లాడేది మరాఠీ, హిందీ. ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే యూ ట్యూబ్ లో ది న్యూస్ మినిట్ వారు “హైదరాబాద్ లో బిజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ అరెస్ట్ డిమాండ్ చేస్తున్న నిరసనకారులు” అనే శీర్షికతో ఆగస్ట్ 25, 2022 నాడు అప్లోడ్ చేసిన వీడియో మాకు దొరికింది.
వైరల్ వీడియోలోని విజువల్స్ ఇందులో కూడా ఉన్నాయి. ప్రాఫెట్ మహమ్మద్ మీద రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు గాను తనను అరెస్ట్ చేసిన తరువాత ఆగస్ట్ 22, 2022 నాడు జామీను మీద విడుదల చేయటం జరిగినది. ఈ విడుదలని వ్యతిరేకిస్తూ నిరసనకారులు నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో ఇది. రాళ్ళు విసిరిన ఘటన తరువాత ఆగస్ట్ 24, 2022 నాడు పోలీసులు పోలీసులు ఇళ్లలలో సోదాలు వారిని అరెస్ట్ చేస్తున్న వీడియో ఇది.
రెండవ వీడియో
ఈ వీడియో రెండు వీడియోల సమాహారం. మొదటి దాంట్లో జైలు లోపల కొంత మంది ఉన్న వీడియో. రెండవది వారిని పోలీసులు కొడుతున్న వీడియో. ఈ వీడీయోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇవే విజువల్స్ ఉన్న జాగరణ్ పత్రిక వారి జూన్ 11, 2022 నాదటి కథనం ఒకటి మాకు లభించింది.
ప్రాఫెట్ మహమ్మద్ మీద వివాదాస్పద వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లో జూన్ 10, 2022 నాడు చెలరేగిన నిరసనల నేపధ్యంలో పోలీసులు 140 మందిని అరెస్ట్ చేశారని టైమ్స్ ఇండియా కథనంలో ఉంది.
వైరల్ వీడియో, 2022 నాటి జాగరణ్ కథనం మధ్య పోలికలు (సౌజన్యం: జాగరణ్/ఎక్స్)
వీడియోలోని రెండవ భాగంలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే బిజేపీ శాసనసభ్యుడు శలభ్ మనీ త్రిపాఠీ ఈ వీడియోని తన ఎక్స్ అకౌంట్ లో జూన్ 11, 2022 నాడు షేర్ చేశారని తెలుసుకున్నాము. “నిరసనకార్లకి పోలీసుల బహుమతి” అనేది ఈ పోస్ట్ శీర్షిక.
ఈ ఘటన తరువాత ఎన్ డి టీ వీ వారు చేసిన పరిశోధనాత్మక కథనం ప్రకారం ఈ వీడియోలో దెబ్బలు తింటున్న వారిని వారి కుటుంబసభ్యులు గుర్తుపట్టారు. ఇది సహరన్పూర్ లో జరిగిందని వారు నిర్ధారించారు.
ది వీక్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం వీడియోలో ఉన్న వారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జూన్ 10, 2022 నిరసనల తరువాత అరెస్ట్ చేసిన 300 పైగా వ్యక్తులలో కొందరు.
నాటి బిజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రాఫెట్ మహమ్మద్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లో జూన్ 10, 2022 నాడు నిరసనలు చోటుచేసుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో పేర్కొంది.
వైరల్ వీడియో, 2022 నాటి ఎన్ డి టీ వీ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/ ఎన్ డి టీ వీ)
తీర్పు
హైదరాబాద్, ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్పూర్ కి చెందిన 2022 నాటి వీడియోలని ముంబైలోని మీరా రోడ్ అల్లర్ల తరువాత పోలీసుల చర్యల వీడియోలుగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)