ద్వారా: చందన్ బొర్గోహాయ్
జూలై 3 2024
వీడియోలో కనపడే ట్రైన్ నెంబర్ చెక్ చేయగా అది గరీబ్ రథ్ అని, వందే భారత్ కాదని అర్ధమయింది.
క్లెయిమ్ ఏమిటి ?
ఒక ఏసీ భోగిలో వర్షపు నీరు కారుతున్నట్టున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేస్తూ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన వందే భారత్ రైలులో ఈ విధంగా వర్షపు నీరు కారుతుంది అంటూ క్లైమ్ చేశారు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో మహువా మొయిత్రా ఫ్యాన్స్ అనే ఒక అకౌంట్ ఈ వీడియోని షేర్ చేసి, హిందీ లో ఈ విధంగా రాసుకొచ్చారు. “ఈ సారి లీకేజీ సర్కార్. దేవాలయాలు, వంతెనలు మరియు విమానాశ్రయాలు అయిపోయాక, ఇప్పుడు వందే భరత్ రైలు వీడియో మనం చూడవచ్చు. ప్రతిష్ఠ గాంచిన వందే భారత్ రైలులో లీక్ అవుతుంది. ప్రయాణికులు ఉచితంగా స్నానం కుడా చేయవచ్చు,” అంటూ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ మరియు నరేంద్ర మోదీ లకు వ్యంగ్యంగా ధన్యవాదాలు కుడా తెలిపారు.
ఈ వీడియోని అస్సామీస్ మీడియా సంస్థ అయిన ది క్రాస్ కరెంట్ కుడా షేర్ చేసింది. దీనికి శీర్షికగా “ ఈసారి వందే భారత్ రైలులో నీరు కారుతున్నాయి,” అని అస్సామీస్ లో రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ని ఇక్కడ చూడవచ్చు.
వైరల్ వీడియోని షేర్ చేస్తున్న పోస్ట్ ల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
భారత దేశంలోనే డిజైన్ చేసి మరియు తయారు చేయబడిన మొట్ట మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనిని ప్రయాణీకులను వేగంగా మరియు సౌకర్యంగా తీసుకు వెళ్ళడానికి తయారు చేశారు. దీనిని మొదటిగా ఫిబ్రవరి 2019 నాడు ప్రారంభించారు.
కానీ, వైరల్ వీడియో లో ఉన్నది వందే భారత్ కాదు, అది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్.
మేము ఏమి కనుగొన్నాము?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఒక ఎక్స్ యూజర్ జూన్ 28, 2024 నాడు పోస్ట్ చేసిన వీడియో లభించింది, దీనిలో ఆ యూజర్ ఇది గరీబ్ రథ్ రైలులో ఘటనగా పేర్కొంటూ, ఆ రైలులో 3వ ఏసీ కోచ్ లో ఉచితంగా జల ధారని సిద్ధం చేసినందుకు వ్యంగ్యంగా మోదీ కి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. (ఆర్కైవ్ ఇక్కడ).
పైగా ఆ వైరల్ వీడియోలో 0:17 మార్క్ వద్ద మేము ఆ ట్రైన్ నెంబర్ 12215/12216 గా గమనించాము. ఈ నెంబర్ ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరియు రైల్ యాత్రి వెబ్సైట్ లలో వెతుకగా అది బాంద్రా టెర్మినస్ నుండి ఢిల్లీ సరాయ్ రోహిల్లా వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అని తేలింది. అంతే గానీ వైరల్ వీడియోలో చెప్పినట్టుగా వందే భారత్ కాదు.
ట్రైన్ నెంబర్ స్క్రీన్ షాట్ మరియు ఐ ఆర్ సీ టీ సీ సమాచారం (సౌజన్యం : ఎక్స్ /ఐ ఆర్ సీ టీ సీ/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఈ విషయం గురించి పశ్చిమ రైల్వే తమ ఎక్స్ అకౌంట్ నుంచి ఇచ్చిన జవాబును కుడా చూసాము. అందులో ఆ లీకేజీ గరీబ్ రథ్ లో జూన్ 27, 2024 నాడు జరిగింది అని పేర్కొంది. (ఆర్కైవ్ ఇక్కడ).
పశ్చిమ రైల్వే ఇచ్చిన జవాబు (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)
పైగా జీ బిజినెస్ న్యూస్ ఛానల్ కుడా తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని జూన్ 29 నాడు పోస్ట్ చేస్తూ గరీబ్ రథ్ రైలు లో లీకేజీ గా పేర్కొంది. (ఆర్కైవ్ ఇక్కడ).
తీర్పు
బాంద్రా టెర్మినస్ నుండి ఢిల్లీ సరాయ్ రోహిల్లా వెళ్ళే గరీబ్ రధ్ లో జరిగిన నీటి లీకేజీ వీడియోని వందే భారత్ వీడియో గా షేర్ చేశారు.
(అనువాదం - రాజేశ్వరి పరసా)