ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
మే 17 2024
మరింత నిడివి ఉన్న ఇదే వీడియోలో మోహన్ భగవత్ తమ సంస్థ గురించిన వస్తున్న పుకార్లని ఖండిస్తూ, రిజర్వేషన్లకి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుంది అని తెలిపారు.
క్లైమ్ ఏంటి?
సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, మితవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేతకి చెందిన 8 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో వైరల్ అయ్యింది.
ఈ వీడియోని షేర్ చేసి, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తమ సంస్థ రిజర్వేషన్లని రహస్యంగా వ్యతిరేకిస్తున్నది అని అన్నారని క్లైమ్ చేశారు. ఈ క్లిప్ లో భగవత్ హిందీలో మాట్లాడుతూ, “సంస్థ సభ్యులు బహిరంగంగా ఏమో రిజర్వేషన్లకి అనుకూలంగా, అంతర్గతంగా ఏమో వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ వ్యతిరేకతని బహిరంగంగా తెలపలేరు,” అని అంటున్నట్టు ఉంది.
ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఎక్స్ లో ఈ వీడియో షేర్ చేసి, “ఆర్ఎస్ఎస్ వాళ్ళమైన మేము రిజర్వేషన్లని అంతర్గతంగా వ్యతిరేకస్తాము. కానీ బయటకి చెప్పలేము…!!! ఆర్ఎస్ఎస్ అధినేత (మోహన్ భగవత్),” అనే శీర్షిక హిందీలో పెట్టారు. ఆర్ఎస్ఎస్ కి చెందిన బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రిజర్వేషన్లు ఇస్తాము అని ఎలా చెప్పగలుగుతున్నారు అని కూడా ఈ పోస్ట్స్ లో అడుగుతున్నారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
అయితే ఇది క్లిప్ చేసిన వీడియో. ఒరిజినల్ వీడియోలో, మోహన్ భగవత్ రిజర్వేషన్లకి మద్దతు తెలిపారు, అలాగే రిజర్వేషన్లకి అర్హులైన వారికి అవసరమైనంత కాలం అవి అందేలా చర్యలు తీసుకోవటానికి ఆర్ఎస్ఎస్ మద్దతు అందిస్తుంది అని చెప్పారు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వైరల్ క్లిప్ లో న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ లోగో ఉంది. దీని ద్వారా మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని ఏఎన్ఐ (ఆర్కైవ్ ఇక్కడ) ఏప్రిల్ 28 నాడు ఎక్స్ లో షేర్ చేసిందని తెలుసుకున్నాము. ఇది 43 సెకన్ల వీడియో. వైరల్ క్లిప్ ఇందులో 0:08 నుండి 0:16 టైమ్ స్టాంప్ మధ్య ఉంది.
“హైదరాబాద్, తెలంగాణ: “ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకి వ్యతిరేకం అని, ఆ వ్యతిరేకత గురించి బహిరంగంగా మాట్లాడలేము అంటూ ఒక వీడియో సర్కులేట్ అవుతున్నది. ఇది పూర్తిగా తప్పు. మొదటి నుంచి కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న రిజర్వేషన్లని సంఘ్ సమర్దిస్తూ వస్తున్నది,” అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు,” అనేది ఈ వీడియో శీర్షిక.
ఈ వీడియోలో, “నేను నిన్నే ఇక్కడికి వచ్చాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిజర్వేషన్ల గురించి బయటకి ఏమో మంచిగా, అంతర్గతంగా ఏమో వ్యతిరేకస్తూ మాట్లాడతారని, బహిరంగంగా విమర్శించలేరు అని అంటూ ఒక వీడియో సర్కులేట్ అవుతున్నదని తెలిసింది.”
“ఇది పూర్తిగా తప్పు. రిజర్వేషన్లు అమలు చేసినప్పటి నుండి రాజ్యాంగం రిజర్వేషన్లని సమర్దిస్తూ వస్తున్నది. ఎవరి కోసమైతే రిజర్వేషన్లు పెట్టారో, వారికి అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలి అని సంఘ్ చెబుతున్నది,” అని మోహన్ భగవత్ ఈ వీడియోలో చెప్పడం మనం చూడవచ్చు. సర్కులేట్ అవుతున్న వీడియోని భగవత్ ఖండిస్తున్న భాగాన్ని తీసుకుని, తప్పుదోవ పట్టించే క్లైమ్ తో షేర్ చేశారు.
ఏప్రిల్ 28 నాడు డిడి న్యూస్ యూపీ (ఆర్కైవ్ ఇక్కడ) వాళ్ళు ఏప్రిల్ 28 నాడు పోస్ట్ చేసిన వీడియో కథనం ఒకటి మాకు లభించింది. “హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను ఎప్పుడూ వ్యతిరేకించలేదు - భగవత్” అనే శీర్షిక హిందీలో పెట్టారు. ఈ వీడియోలో 29 సెకన్ల దగ్గర ఏఎన్ఐ వీడియోలో చేసిన వ్యాఖ్యలనే ఇక్కడా చేయటం మనం చూడవచ్చు.
ఏప్రిల్ 29 నాడు ది హిందూ పత్రికలో కూడా భగవత్ వ్యాఖ్యల గురించి ఒక కథనం వచ్చింది. తను ఈ వ్యాఖ్యలని హైదరాబాద్ లోని విద్యా భారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో చేశారని ఉంది. కొన్ని వర్గాలకి రిజర్వేషన్లకి ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ మద్దతు తెలియచేసిందని, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకి వ్యతిరేకం అంటూ సర్కులేట్ అవుతున్న క్లైమ్ ఫేక్ అని తను అన్నారని ఈ కథనంలో ఉంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ వీడియోని కృత్రిమ మేధ ద్వారా సృష్టించారు అని తను అన్నారు. ఈ వీడియో అయితే మాకు దొరకలేదు కానీ, భగవత్ చెప్పని మాటలను చెప్పినట్టు ఆ వీడియోలో ఎడిట్ చేశారని మాత్రం అర్థం అవుతున్నది.
రిజర్వేషన్ల మీద ఆర్ఎస్ఎస్ వైఖరి
రిజర్వేషన్ల కొనసాగింపుకి భగవత్ గతంలో కూడా మద్దతు తెలియచేశారు. “నిజమైన సామాజిక సమానత” ఏర్పడే వరకు రిజర్వేషన్ లాంటి చర్యలు కొనసాగాల్సిన అవసరం గురించి తను చెబుతున్న వీడియో ఒక దానిని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ (ఆర్కైవ్ ఇక్కడ) సెప్టెంబర్ 2023లో అప్లోడ్ చేసింది.
అయితే రిజర్వేషన్ల మీద వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ అభిప్రాయం నిలకడగా లేదు.
వివిధ కథనాల ప్రకారం పరస్పర విరుద్ధ వ్యాఖ్యల కారణంగా ఆర్ఎస్ఎస్ నాయకులు తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని తరుచూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. 2019లో స్వయానా మోహన్ భగవత్ యే రిజర్వేషన్ల గురించి చర్చించాలి అని అన్నారు. అలాగే 2017లో ఆర్ఎస్ఎస్ నాటి ప్రచార విభాగం అధ్యక్షుడు మన్మోహన్ వైద్య రిజర్వేషన్ వ్యవస్థని సమీక్షించాలి అని అన్నారు.
తీర్పు
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వీడియోని క్రాప్ చేసి, తమ సంస్థ సభ్యులు రిజర్వేషన్లని వ్యతిరేకం అని తను అన్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో తను తాము రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్న పుకార్లని ఖండిస్తున్నారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పు అని మేము నిర్ధారించాము.
(అనువాదం - గుత్తా రోహిత్)