హోమ్ బెంగళూరు లో బస్ ప్రమాదాన్ని ‘మెగ్నెటిక్ బాంబ్’ పేలిన ఘటనగా క్లైమ్ చేశారు

బెంగళూరు లో బస్ ప్రమాదాన్ని ‘మెగ్నెటిక్ బాంబ్’ పేలిన ఘటనగా క్లైమ్ చేశారు

ద్వారా: అంకిత కులకర్ణి

జూలై 15 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బెంగళూరు లో బస్ ప్రమాదాన్ని ‘మెగ్నెటిక్ బాంబ్’ పేలిన ఘటనగా క్లైమ్ చేశారు మెగ్నెటిక్ బాంబ్ పేలటం కారణంగా బెంగళూరు లో ఒక బస్ మంటల్లో చిక్కుకుంది అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

మధ్య బెంగళూరు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈ క్లైమ్ ని తోసిపుచ్చారు. బస్ ఎక్కువుగా వేడి చెందటం కారణంగా మంటలు చెలరేగాయి అని తెలిపారు.

క్లైమ్ ఏంటి?

రోడ్ మధ్యలో దట్టమైన పొగ అలుముకుని, మంటల్లో చిక్కుకున్న బస్ వీడియో ఒకటి షేర్ చేసి, ఇది బెంగళూరు లో ‘మెగ్నెటిక్ బాంబ్’ పేలిన ఘటన అని క్లైమ్ చేశారు.

“డి ఆర్ డి ఓ కి చెందిన 3 శాస్త్రవేత్తలు ప్రయాణిస్తున్న బస్ మీద బెంగళూరు లో మెగ్నెటిక్ బాంబ్ తో దాడి చేశారు. ఈ 3 చనిపోయారని అంటున్నారు. డి ఆర్ డి ఓ వారి హెచ్ఏల్ తేజస్ విమానాలని పరీక్షించే ప్రదేశానికి పశ్చిమంగా 4 కిలోమీటర్ల దూరంలో ఇది చోటుచేసుకుంది,” అని ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ ఈ వీడియో షేర్ చేసి రాసుకొచ్చారు. ఈ పోస్ట్, ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది బస్ వేడి ఎక్కటం కారణంగా జరిగిన ఘటన అని, బాంబ్ పేలిన ఘటన కాదని మా పరిశోధనలో తేలింది. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఘటన గురించి గూగుల్ లో వెతుకగా, జులై 9, 2024 నాడు ఉదయం 9 గంటలకి బెంగళూరు లోని మహాత్మా గాంధీ రోడ్ దగ్గర లోని అనీల్ కుంబ్లే సర్కిల్ దగ్గర కనీసం 30 మంది ప్రయాణిస్తున్న  బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి చెందిన బస్ మంటల్లో చిక్కుకుంది అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ఎన్డీటీవీ కథనాలు ప్రచురించాయి అని తెలుసుకున్నాము. 

అలాగే, బెంగళూరు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ )లో ఇది బాంబు దాడి కాదు అని వివరణ ఇచ్చిన పోస్ట్ మాకు లభించింది. “ఈ రోజు ఉదయం 8:40 కి ఎం జీ రోడ్ లోని అనీల్ కుంబ్లే సర్కిల్ దగ్గర బిఎంటీసీ బస్ మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక దళాలు మంటలని ఆర్పాయి. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. మెగ్నెటిక్ బాంబ్ గురించి సామాజిక మాధ్యమాలలో వస్తున్న పుకార్లు అబద్ధం,” అని ఈ పోస్ట్ లో తెలిపారు. 

మధ్య బెంగళూరు డీసీపీ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/డీసీపీ సెంట్రల్ డివిజన్)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ మధ్య బెంగళూరు డీసీపీ శేఖర్ హెచ్ టెక్కన్నవర్ ను సంప్రదించింది. “ఈ ఘటన మెగ్నెటిక్ బాంబ్ ఘటన కాదు. బస్ బాగా వేడి ఎక్కడం కారణంగా జరిగిన ఘటన,” అని పునరుద్ఘాటించారు. ఈ ఘటన లో ఎవరూ గాయపడలేదు అని కూడా తెలిపారు.

ఇది మంటలకి సంబంధించిన ఘటనే అని నిర్ధారించుకోవటానికి బెంగళూరు దక్షిణ అగ్నిమాపక కేంద్రం వారిని మేము సంప్రదించాము. “ఇంజిన్ బాగా వేడి ఎక్కటం కారణంగా మంటలు చెలరేగాయి. దీనితో డ్రైవర్ బస్ స్టార్ట్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అయ్యింది,” అని పేరు తెలపటానికి నిరాకరించిన అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు అని కూడా స్పష్టం చేశారు.

డి ఆర్ డీ ఓ కి చెందిన 3 శాస్త్రవేత్తలు ఇటువంటి ఘటనలో బెంగళూరు లో చనిపోయారు అంటూ ఏమైనా కథనాలు ఉన్నాయా అని మేము చూశాము. అయితే, అటువంటి కథనాలు గానీ, సంస్థ నుండి అధికారిక ప్రకటన కానీ ఏమీ లేదు.

వైరల్ క్లిప్ లో ఉన్నది అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటన. బాంబ్ పేలిన ఘటన కాదు. అలాగే, 3 శాస్త్రవేత్తలు చనిపోయిన ఘటన కూడా కాదు. 

తీర్పు

బెంగళూరు లో ప్రభుత్వ రంగా ప్రజా రవాణా బస్ ఇంజిన్ వేడి ఎక్కటం కారణంగా మంటల్లో చిక్కుకున్న ఘటనని బాంబ్ పేలిన ఘటన గా షేర్ చేశారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.