ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023
2021లో తీసిన ఒక లఘు చిత్రం (షార్ట్ ఫిలిం) వీడియో ని పట్టుకుని పెళ్లికొడుకు కట్నంగా మోటార్ సైకిల్ డిమాండ్ చేశాడు అని పిల్ల తండ్రి కొడుతున్న వీడియోగా ప
నేపధ్యం
మే 9, 2023 నాడు కొన్ని వార్తా ఛానళ్ళు ఒక పెళ్ళిలో పెళ్లికొడుకు తన్నులు తింటున్నట్టు ఉన్న ఒక వీడియోని పెళ్లికొడుకు మోటార్ సైకిల్ కట్నంగా డిమాండ్ చేసినందుకు పిల్ల తండ్రి ఆ పెళ్ళికొడుకుని కొడుతున్న వీడియో అని చెప్పి ప్రసారం చేశాయి. న్యూస్ 18 వైరల్స్ ఈ క్లిప్ ని తమ యూట్యూబ్ ఛానల్ లో మే 8, 2023 నాడు “మోటార్ సైకిల్ కట్నంగా అడిగిన అల్లుడు, అందరి ముందు చెప్పు దెబ్బలు ఇచ్చిన మామ” అన్న శీర్షికతో ప్రసారం చేసింది. ఈ వీడియోకి 22,000 వ్యూస్ ఉన్నాయి.
ఎన్ డి టి వి హిందీ, జీ న్యూస్, న్యూస్ 24 లాంటి ఛానళ్ళు కూడా ఈ క్లిప్ ని పైన పేర్కొన్న శీర్షికతోనే తమ తమ వెబ్సైట్స్లో ప్రసారం చేశాయి. అందులో కొంతమంది తరువాత ఈ వీడియోని తొలగించారు. ఈ వీడియో ట్విట్టర్ లో కూడా వైరల్ అయ్యింది. అక్కడ ఒకరు ఈ వీడియోని ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కి 7,92,400 వ్యూస్, 200కి పైగా రీట్వీట్స్ ఉన్నాయి.
ఈ వీడియో నిడివి ఒక నిమిషం. అందులో పెళ్ళికి వచ్చిన అతిధులు చూస్తుండగా పిల్ల తండ్రి పెళ్ళికొడుకుని చెప్పుతో కొడుతున్నాడు. ఆ తరువాత పెళ్లి కొడుకు కన్నీళ్ళు తుడుచుకుంటూ పెళ్ళికూతురితో కలిసి వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. 2021లో వచ్చిన ఒక లఘుచిత్రం నుండి కట్ చేసిన క్లిప్ ఇది.
వాస్తవం
ఈ వీడియోలో ఉన్న కొన్ని దృశ్య అసంబద్ధతలు, పెళ్లికొడుకు హావభావాలు గమనిస్తే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, ఇది నటీనటులతో షూట్ చేసిన వీడియో అని అర్థమవుతున్నది. పెళ్లి కొడుకు దెబ్బలు తింటునప్పుడు కూడా నవ్వటం లాంటివి చూస్తే ఇది నిజంగా జరిగిన సంఘటన వీడియో కాకపోవచ్చు అనిపించింది.
అలాగే, ఆ ట్వీట్ క్రింద ఉన్న కామెంట్స్ పరిశీలిస్తే ఈ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ వారు తీసిన పాత వీడియో అని అర్థమయ్యింది. ఈ కీ వర్డ్స్ ఆధారంగా యూట్యూబ్ లో వెతికితే 78,000 సబ్ స్క్రైబర్స్ ఉన్న ‘మైథిలీ బజార్’ అనే ఛానల్ కనిపించింది. మే 8, 2021 నాడు ‘సాగనంపుల సమయంలో పెళ్లికొడుకు పెళ్ళికూతురుని, పెళ్లి కూతురు తండ్రి పెళ్ళికొడుకుని ఎందుకు కొట్టారు?’ అనే శీర్షికతో ఒక వీడియో అప్లోడ్ చేశారు.
ఈ అసలైన వీడియో నిడివి నాలుగు నిమిషాలు. ఇందులో ముగ్గురు నటులు ఉన్నారు. పెళ్ళికూతురుగా పూజా మిశ్రా, పెళ్లికొడుకుగా సునీల్ సుమన్, పెళ్ళికూతురి తండ్రిగా మోహన్ మండల్ నటించారు.
ట్విట్టర్ లో వైరల్ అయిన క్లిప్, ఈ వీడియో నుండి కట్ చేశారు. ఈ వీడియోలో 2:40 నుండి 3:40 వరకు ఉన్న క్లిప్ ని కట్ చేసి వైరల్ చేశారు.
ఈ ‘మైథిలీ బజార్’ ఛానల్ వారు తరుచుగా యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. వైరల్ క్లిప్ లో ఉన్న ఘటన రెండు సంవత్సరాల క్రితం నాటి కాల్పనిక లఘు చిత్రంలోనిది.
తీర్పు
కట్నం డిమాండ్ చేశాడు అని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు తండ్రి చెప్పుతో కొడుతున్న వీడియో అని వైరల్ అయిన వీడియో నిజంగా జరిగిన సంఘటన కాదు. ఈ క్లిప్ రెండు సంవత్సరాలు నాటి ఒక లఘు చిత్రం నుండి కట్ చేయబడింది. కాబట్టి ఈ వార్త అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము.