హోమ్ కాబూల్ కి చెందిన 2014 నాటి ఫొటో షేర్ చేసి రియాసి బస్సు దాడిలో ‘10 మంది సైనికులు చనిపోయారని’ క్లైమ్ చేశారు

కాబూల్ కి చెందిన 2014 నాటి ఫొటో షేర్ చేసి రియాసి బస్సు దాడిలో ‘10 మంది సైనికులు చనిపోయారని’ క్లైమ్ చేశారు

ద్వారా: ఇషిత గోయల్ జె

జూన్ 13 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కాబూల్ కి చెందిన 2014 నాటి ఫొటో షేర్ చేసి రియాసి బస్సు దాడిలో ‘10 మంది సైనికులు చనిపోయారని’ క్లైమ్ చేశారు జమ్మూ కశ్మీర్ లోని రియాసిలో జరిగిన ఘటనలో 10 మంది భారతీయ సైనికులు చనిపోయారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

రియాసిలో దాడికి గురయ్యిన బస్సులో ఉంది భారత సైనికులు కాదు యాత్రికులు అని వార్తా కథనాలు, పోలీసుల ప్రకటనల ద్వారా స్పష్టం అయ్యింది.

క్లైమ్ ఏంటి?

ఒక పచ్చ రంగు బస్సుని సైనిక అధికారులు పరిశీలిస్తున్న ఫొటోని షేర్ చేసి, జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారత సైనికులని తరలిస్తున్న బస్సు మీద జరిగిన దాడిలో 10 మంది సైనికులు చనిపోయారని క్లైమ్ చేశారు.

జూన్ 9 నాడు దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ నుండి యాత్రికులని తీసుకువెళ్తున్న బస్సు మీద రియాసిలో తీవ్రవాదులు దాడి చేయడంతో బస్సు లోయలో పడిపోయింది. ఆ ఘటన తరువాత ఈ క్లైమ్ సర్కులేట్ అవ్వటం మొదలయ్యింది.

“ఇప్పుడే అందిన వార్త: భారత దేశం ఆక్రమించిన జమ్మూ కశ్మీర్ లోని రియాసిలో కశ్మీరీ స్వాతంత్ర సమరయోధులు తీవ్రవాదులైన భారత సైనికులని తీసుకువెళ్తున్న బస్సు మీద దాడి చేశారు.   స్థానిక పోలీసుల ప్రకారం 10 మంది చనిపోయారు అని నిర్ధారణ అయ్యింది,” అని ఈ ఫొటో షేర్ చేసి, రాసుకొచ్చారు. “జమ్మూ కశ్మీర్ లోని రియాసిలో భారత సైనికులని తీసుకువెళ్తున్న బస్సు మీద భారీ దాడి జరిగిందని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. 10 మంది సైనికులు చనిపోయారు అని స్థానిక పోలీసులు తెలిపారు,” అని ఇంకొక యూజర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ దాడిలో చనిపోయింది సైనికులు కాదని, ఈ ఫొటో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ కి చెందిన 2014 నాటి ఫొటో అని మా పరిశోధనలో తేలింది.

మేము ఏమి తెలుసుకున్నాము?

రియాసి జిల్లా పోలీసు విడుదల చేసిన ప్రకటన (ఆర్కైవ్ ఇక్కడ) ఈ ప్రకటనలో “జూన్ 9, సాయంత్రం 6:10కి రియాసి జిల్లాలో రాజౌరీ జిల్లా సరిహద్దులో ఉన్న పౌని అనే ప్రాంతంలో యాత్రికులని శివ్ ఖోరీ నుండి కట్రాకు తీసుకువెళ్తున్న బస్సు మీద తీవ్రవాదులు మారణాయుధాలతో దాడి చేసినట్టు తెలుస్తుంది” అని ఉంది.

శివ్ ఖోరీ అనేది రియాసిలో ఒక హిందూ దేవాలయం. ప్రసిద్ధి చెందిన మాతో వైష్ణో దేవీ ఆలయానికి వెళ్ళడానికి కట్రా బేస్ క్యాంప్. దాడి జరిగినప్పుడు బస్సు ఇక్కడికే వెళ్తున్నది. 

రియాసి జిల్లా పోలీస్ ప్రకటన (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా యాత్రికులని తీసుకువెళ్తున్న బస్సు మీద దాడి జరిగింది అనే తమ కథానాలలో పేర్కొంది.

అదే రోజు, పోలీసులు మరొక ప్రకటనలో (ఆర్కైవ్ ఇక్కడ ) ఈ ఘటనలో 9 మంది చనిపోయారు అని తెలియచేశారు. 

రియాసి జిల్లా పోలీస్ ప్రకటన (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

ది హిందూ తమ కథనంలో రియాసి డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అయిన విష్ణు పాల్ మహాజన్ ను ఉటంకించింది. తను ఈ 9 మంది బాధితుల వివరాలని వెల్లడించారు. అందులో ఒకరు బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ కాగా, మరొకరు ఆ బస్సు కండక్టర్ అరుణ్ కుమార్.

మిగతా బాధితులు రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన రాజిందర్ ప్రసాద్ పాండే సావ్హ్నే , మమతా సావ్హ్నే, పూజా సావ్హ్న, తన రెండు సంవత్సరాల కొడుకు టిటూ సావ్హ్న, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శివం గుప్తా, రూబీ, 14 సంవత్సరాల అనురాగ్ వర్మా అని ఈ పోలీసు అధికారి చెప్పారని ది హిందూ కథనంలో ఉంది.

ఈ దాడిలో భారతీయ సైనికులు చనిపోయినట్టు ఎక్కడా లేదు. 

వైరల్ ఫొటో

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ ఫొటో 2014 నాటిదని తెలుసుకున్నాము. బీబీసీ లో “ఆఫ్ఘాన్ ప్రాణాహుతి బాంబర్ కాబూల్ లో మిలిటరీ బస్సు మీద దాడి” అనే శీర్షికతో జులై 2, 2014 నాటి కథనం మాకు లభించింది. ఆ ఘటనకి సంబంధించిన వీడియో కూడా ఈ కథనంలో ఉంది. ఈ వీడియోలో 0:06 టైమ్ స్టాంప్ దగ్గర ఉన్న ఫ్రెమే ఈ వైరల్ ఫొటో.

అలాగే, యూరో న్యూస్ కూడా జూలై 2, 2014 నాడు తమ యూట్యూబ్ (ఆర్కైవ్ ఇక్కడ )అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. “ఆఫ్ఘనిస్తాన్: ప్రాణాహుతి బాంబర్ దాడిలో మిలిటరీ బస్సులో 8 మంది మృతి” అనేది ఈ వీడియో శీర్షిక. ఈ వీడియోలో 0:05 టైమ్ స్టాంప్ దగ్గర ఉన్న ఫ్రేమే ఈ వైరల్ ఫొటో.

2014లో ఒక ప్రాణాహుతి బాంబర్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఒక వాయు సేన బస్సు మీద దాడి చేసిన ఘటనలో 8 మంది సైనికాధికారులు చనిపోయారు.

రియాసి ఘటనలో బస్సుకి తెలుపు, నీలం అంచులు ఉండగా, వైరల్ ఫొటోలోని బస్సుకి పచ్చ రంగు అంచు ఉంది. అలాగే, రియాసి ఘటనలో బస్సు లోయలో పడిపోయింది. వైరల్ ఫొటోలో బస్సు రోడ్డు మీద ఉంది.

తీర్పు

నమ్మదగిన వార్తా కథనాలు, పోలీసు అధికారుల ప్రకటనల ద్వారా తెలిసింది ఏమిటంటే, రియాసి ఘటనలో దాడికి గురయ్యిన బస్సులో ఉంది సైనికులు కాదు, యాత్రికులు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది సైనికులు కాదు, సాధారణ పౌరులు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.