ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 6 2023
పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతున్న వీడియోలో ఈ నినాదాలని డిజిటల్ గా జొప్పించారు.
క్లైమ్ ఏంటి?
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 30 నాడు జరగనున్నాయి. భారత్ రాష్ట్ర సమితి అధికార పక్షం కాగా, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. ఎన్నికల ప్రచారం ఊపందుకునే కొద్దీ సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం కూడా అలాగే సర్కులేట్ అవుతున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకి అనుకూలంగా నినాదాలు చేశారు అంటూ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక యూజర్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ 32 సెకన్ల వీడీయోలో పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రజలని ఉద్దేశించి ప్రసంగం మొదలుపెడుతునప్పుడు ‘జై కేసిఆర్’, ‘జై తెలంగాణ’ అనే నినాదాలు వినవచ్చు. ఈ పోస్ట్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో లో “కేసిఆర్ నినాదాలతో దద్దరిల్లిన పాలమూరు కాంగ్రెస్ సభ” అనే టెక్స్ట్ ఉంది. పాలమూరు లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ తెలంగాణలో ఒక జిల్లా/ప్రాంతం.
సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఇదే వీడియోని ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా షేర్ చేశారు. ఆ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అయితే ఇది ఎడిటెడ్ వీడియో. ఈ సభలో కేసిఆర్ అనుకూల నినాదాలు ఏవీ చేయలేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
వీడియోలో ఉన్న టెక్స్ట్ ని బట్టి ఈ మధ్య కాలంలో పాలమూరులో కాంగ్రెస్ ఏదైనా సభ నిర్వహించిందా అనే విషయం చూశాము. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ లో అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ ఒక సభ నిర్వహించింది అని తెలుసుకున్నాము. ఈ సభలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
టీవీ 9, ఈటీవీ తెలంగాణ ఛానళ్ళు ఈ సభని లైవ్ స్ట్రీమ్ చేశాయి.
ఈ వైరల్ వీడియో టీవీ 9 లైవ్ స్ట్రీమ్ లో 30:40-31:03 టైమ్ స్టాంప్ మధ్య ఉన్న క్లిప్ అని అర్థమయ్యింది. అలాగే ఈటీవీ తెలంగాణ లైవ్ స్ట్రీమ్ లో 15:00-15:33 టైమ్ స్టాంప్ మధ్య ఈ క్లిప్ ఉంది. ఈ రెండు లైవ్ స్ట్రీమ్ వీడియోలలోనూ ఎక్కడా కేసీఆర్ అనుకూల నినాదాలు చేయలేదు. ప్రజల హర్షధ్వానాలు మాత్రమే ఇందులో ఉన్నాయి.
ఈ సభకి సంబంధించిన వీడియోలలో ఎక్కడా కేసీఆర్ అనుకూల నినాదాలు చేసినట్టు లేదు కాబట్టి అటువంటి నినాదాలని జొప్పించి ఆ వీడియోని తప్పుడు క్లైమ్ తో వైరల్ చేశారు అని స్పష్టం అవుతున్నది.
తీర్పు
తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభకి సంబంధించిన వీడియోలో కేసీఆర్ అనుకూల నినాదాలని డిజిటల్ గా జొప్పించారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)