ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
మే 20 2024
2018 నాటి ఒరిజినల్ ఫొటోలో ఒవైసీ సామాజిక సంస్కర్త బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు.
క్లైమ్ ఏంటి?
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఎంఐఎం అధినేత మరియు పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.
ఈ వైరల్ ఫొటోలో, ఒవైసీ ఇతరుల మధ్య రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టు ఉంది. ఎన్నికలలో ఓటమి భయంతో ఒవైసీ కూడా రామ భక్తునిగా చెప్పుకుంటున్నారనే శీర్షిక ఈ ఫొటోకి పెట్టారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఒవైసీ హైదరాబాద్ నుండి లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు మే 13 నాడు జరిగాయి. ఫలితాలు జూన్ 4 నాడు ప్రకటించనున్నారు.
ఇదే ఫొటోని ఫేస్బుక్ లో కూడా షేర్ చేస్తున్నారు. ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ క్లైమ్ అబద్ధం. ఇది ఎడిటెడ్ ఫొటో.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఒవైసీ అధికారిక ఫేస్బుక్ లో ఏప్రిల్ 7, 2018 నాడు షేర్ చేసిన ఫొటో ఒకటి మాకు లభించింది. ఈ పోస్ట్ లో ఉన్న ఫొటోలో (ఆర్కైవ్ ఇక్కడ)ఒవైసీ సామాజిక సంస్కర్త, భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు.
“మోచీ కాలనీ నుండి దళితులు ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీని పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కలిసి, తమ ప్రాంతాన్ని (బహదూర్ పుర నియోజకవర్గంలో రాంనస్ పుర) అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు,” అని ఈ పోస్ట్ శీర్షికగా పెట్టారు.
2018 నాటి ఫొటో, వైరల్ ఫొటో మధ్య పోలిక కింద ఇచ్చాము. మిగతా అన్నీ ఒకటే కాగా, ఒరిజినల్ ఫొటోలో ఒవైసీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు.
వైరల్ ఫొటో, 2018 నాటి ఫొటో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్స్)
అలాగే, ఈ వైరల్ ఫొటోని జాగ్రత్తగా గమనిస్తే, రాముని చిత్రపటం కుడి వైపు మూల దెబ్బతిన్నట్టు ఉంది. అలాగే ఈ మూలని పట్టుకుని ఉన్న చేయి కూడా సరిగ్గా కనపడటం లేదు. అలాగే వైరల్ ఇమేజ్ లో చిత్రం మూలలు సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా ఇది ఎడిటెడ్ ఫొటో అని సూచిస్తున్నాయి.
అలాగే, ఇదే జనం మధ్య, ఇదే తారీఖున రాముని చిత్రపటం పట్టుకుని ఉన్న ఒవైసీ ఫొటో ఏదీ మాకు లభించలేదు.
ఒవైసీ హిందూ ప్రార్ధన చేస్తున్నాడు అని, గుడికి వెళ్ళాడు అని ఒవైసీకి సంబంధించిన తప్పుడు క్లైమ్స్ ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ గతంలో డీబంక్ చేసింది.
తీర్పు
ఎడిట్ చేసిన ఫొటో షేర్ చేసి, ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నారు అని క్లైమ్ చేశారు. ఒరిజినల్ ఫొటోలో తను పట్టుకుని బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.
(అనువాదం - గుత్తా రోహిత్)