ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 22 2024
జనవరి 12 నాడు రామాలయం కమిటీ, ఆర్ ఎస్ ఎస్, వి హెచ్ పి సభ్యుల బృందం రాష్ట్రపతిని అధికారికంగా ఆహ్వానించింది.
క్లైమ్ ఏమిటి?
జనవరి 22, 2024 నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించలేదు అని ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. కంగనా రనౌత్ లాంటి చిత్ర పరిశ్రమ వారిని ఆహ్వానించి, రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ఈ క్లైమ్ లలో రాసుకొచ్చారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అయిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు అనే క్లైమ్ అబద్ధం.
మేము ఏమి తెలుసుకున్నాము?
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ), ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, సిఎన్ఎన్-న్యూస్ 18 లాంటి వార్తా సంస్థలు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించారని కథనాలు ప్రచురించాయి.
జనవరి 12, 2024 నాడు ది హిందూలో వచ్చిన ఒక కథనం ప్రకారం, రామాలయం నిర్మాణం కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా, విశ్వ హిందూ పరిషద్ (వి హెచ్ పి) అధ్యక్షులు అలోక్ కుమార్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్ ఎస్ ఎస్) సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ జనవరి 12 నాడు రాష్ట్రపతిని కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆహ్వాన పత్రిక అందచేస్తున్న ఫొటో కూడా ఒకటి ఈ కథనంలో జతపరిచారు. ఇవే వివరాలని ఇతర వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి.
జనవరి 12, 2024 నాడే ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో వి హెచ్ పి వాళ్ళు తాము రాష్ట్రపతిని కలిసి ఆహ్వాన పత్రిక అందచేసిన ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోతో పాటు,”జనవరి 22 నాడు జరిగే రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవ్వాలని భారత రాష్ట్రపతి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించటం జరిగింది. దీనికి గాను రాష్ట్రపతి గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యని సందర్శించే సమయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు,” అని రాశారు.
తీర్పు
అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భారత రాష్ట్రపతిని ఆహ్వానించలేదు అనే క్లైమ్ అబద్ధం. జనవరి 12 నాడు రామాలయం, ఆర్ ఎస్ ఎస్, వి హెచ్ పి సంస్థలకి చెందిన బృందం తనని ఆహ్వానించటం జరిగింది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)