ద్వారా: అంకిత కులకర్ణి
మే 21 2024
ఇందులో మూడు ఫొటోలు ఇరాన్ లో 2020లో జరిగిన కుప్పకూలినప్పటివి కాగా, మరొకటి మొరాకోకి చెందిన 2019 నాటిది.
క్లైమ్ ఏంటి?
తగలబడుతున్న హెలికాప్టర్ శిథిలాల ఫొటోలని షేర్ చేసి, ఇవి మే 19, 2024 నాడు కూలిపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కి చెందినవని క్లైమ్ చేశారు. ఇరాన్ - అజర్బైజాన్ సరిహద్దులో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రి అమీర్ అబ్దొల్లాహియన్, మరొక ఆరుగురు చనిపోయారు . వారి శవాలని అక్కడ నుండి తరలించారు . ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. తెలుగు వార్తా సంస్థ ఆర్ టీవీ కూడా వీటిని షేర్ చేసింది.
సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇవి పాత ఫొటోలు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఫొటో 1
ఇందులో మొత్తం మూడు ఫొటోలు ఉన్నాయి. వీటిని షేర్ చేస్తున్న పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఒక దాంట్లో రెడ్ క్రెసెంట్ సభ్యులు టార్చు లు వేసుకుని ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు ఉండగా, రెండవ దాంట్లో హెలికాప్టర్ తోక భాగం మీద ‘1136’ అనే సంఖ్య ఉంది. మూడవ దాంట్లో హెలికాప్టర్ తోక భాగం ముందు ఎరుపు మరియు తెలుపు రంగు కోట్ వేసుకున్న వ్యక్తి ఒకరు నుంచుని ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో తరుచుగా తప్పుడు సమాచారం షేర్ చేసే మాట్ వాలెస్ (@MattWallace), సులేమాన్ అహ్మద్ (@ShaykhSulaiman) కూడా వీటిని షేర్ చేశారు.
వీటిని షేర్ చేస్తూ ఒక పోస్ట్ లో (ఆర్కైవ్ ఇక్కడ) “హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం ఫొటోలు. అషురా కోర్ప్స్ కమాండర్: ‘దురదృష్టవశాత్తు కొంతమంది అమరుల శరీరాలు తగలబడిపోయి గుర్తించడానికి వీలు లేకుండా అయిపోయింది.’” అని రాసుకొచ్చారు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఫొటోల స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇవి ఏప్రిల్ 2020 నాటివని మా పరిశోధనలో తేలింది. ఇరాన్ లోని మజన్దరాన్ రాష్ట్రంలో ఒక పోలీస్ శిక్షణా హెలికాప్టర్ కూలిపోయినప్పటి ఫొటోలు ఇవీ. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ రోక్నా ప్రెస్ ఈ ఫొటోలని ఏప్రిల్ 2020లో ప్రచురించింది. బిశేష్ కోలాహ్ నుండి టెహ్రాన్ నుండి వెళ్తున్న ఒక శిక్షణా హెలికాప్టర్ ముతాలక్ ప్రాంతంలో కూలిపోయింది అని ఈ కథనంలో ఉంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయారని, శిథిలాలని అటవీ ప్రాంతంలో కనుగొన్నారని ఈ కథనంలో ఉంది.
అమోల్ న్యూస్ అనే మరొక స్థానిక వార్తా సంస్థ ‘1136’ సంఖ్య ఉన్న హెలికాప్టర్ ఫొటోని ప్రచురించింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారు మేజర్ పైలట్ అలీ ఎయిదీ, కెప్టన్ పైలట్ అలీ ఇస్లామీ అని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఈ మూడు ఫొటోలు రెడ్ క్రెసెంట్ సొసైటీ ఆఫ్ ఇరాన్ వారు ఏప్రిల్ 22, 2020 నాడు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ)లో కూడా ఉన్నాయి. ఈ దుర్ఘటన మజన్దరాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. రెడ్ క్రెసెంట్ అనేది ఒక స్వచ్చంద సంస్థ. దుర్ఘటనలు జరిగినప్పుడు సహాయ చర్యలు చేపట్టే సంస్థ ఇది.
ఫొటో 2
ఇందులో (ఆర్కైవ్ ఇక్కడ) ఒక హెలికాప్టర్ తల భాగాన్ని మనం చూడవచ్చు. ఈ ఫొటోతో పాటు “సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ శిథిలాలు దొరికాయి” అని పర్షియన్ లో రాశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజయనం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇది మొరాకోకి చెందిన 2019 నాటి ఫొటో. స్థానిక మొరాకో వల్డ్ న్యూస్ వార్తా సంస్థ ప్రకారం మొరాకోలోని ఆసిలాహ్ దగ్గర ఉన్న సబ్త్ అల్ జీనత్ అనే ప్రాంతంలో కొకైన్ ని తరలిస్తున్న ఒక విమానం సెప్టెంబర్ 6, 2019 నాడు కూలిపోయింది. ఇది ఆ విమానం ఫొటో. baldi.net లోని సమాచారం ప్రకారం, ఈ విమానం పైలట్ కి చిన్న గాయాలు అయ్యాయి. తనని సెప్టెంబర్ 8, 2019 నాడు అరెస్ట్ చేశారు.
ఈ bladi.net కథనంలో కూడా ఈ ఫొటో ఉంది. దుర్ఘటనకి కారణాలు తెలియవని, విచారణ జరుగుతున్నదని సెప్టెంబర్ 8, 2019 నాడు ప్రచురించిన కథనంలో ఉంది.
అలాగే ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటన ఫొటోలని రాయిటర్స్, ఎన్ బీ సీ న్యూస్ వార్తా సంస్థలు ఫొటోలు తీశాయి. వాటిల్లో ఈ వైరల్ ఫొటోలు లేవు.
దీనిబట్టి, ఈ వైరల్ ఫొటోలు పాతవని, ఈ దుర్ఘటనకి సంబంధించినవి కాదని మనకి స్పష్టంగా అర్థంఅవుతున్నది.
తీర్పు
2019, 2020 నాటి ఫొటోలు షేర్ చేసి, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ శిథిలాలు అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం - గుత్తా రోహిత్)