హోమ్ వినుకొండ లో జరిగిన హత్య వీడియోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

వినుకొండ లో జరిగిన హత్య వీడియోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వినుకొండ లో జరిగిన హత్య వీడియోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందు వ్యక్తిని నరికి చంపుతున్న వీడియో అంటూ క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

హత్యకి గురయ్యిన వ్యక్తి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇద్దరూ ముస్లిం మతస్తులే అని పోలీసులు మాకు తెలిపారు.

(గమనిక - ఈ కథనంలో దారుణ హత్యకి సంబంధించిన విజువల్స్, వివరణ ఉంది. పాఠకులు గమనించగలరు)

క్లైమ్ ఏంటి?

ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి నడి రోడ్డు మీద కత్తితో దాడి చేస్తున్న వీడియో ఒక దానిని షేర్ చేసి, జావేద్ అనే ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ వ్యక్తి మీద దాడి చేస్తున్నాడు అని క్లైమ్ చేశారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ), “"ఉగ్రవాది జావేద్” చేసిన హత్య. హిందూ వ్యక్తి చేతులు జోడించి వేడుకుంటున్నా కూడా జిహాదీ జావేద్ తనను నరికేశాడు,” అని హిందీ లో రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ హత్య లో ఎటువంటి మత కోణం లేదు. చనిపోయిన వ్యక్తి, హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇద్దరూ ముస్లిం మతస్తులే.

వాస్తవం ఏమిటి?

వైరల్ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, ఈ ఘటన గురించి ది హిందూ వార్తా పత్రిక లో జూలై 18, 2024 నాడు వచ్చిన కథనం మాకు లభించింది. ఈ కథనం లో ఈ వీడియో స్క్రీన్ షాట్ ఉంది. ఈ కథనం ప్రకారం, పల్నాడు జిల్లా లోని వినుకొండ లో షేక్ జిలానీ అనే వ్యక్తి షేక్ రషీద్ మీద జూలై 17, 2024 రాత్రి 8:30 గంటల సమయంలో దాడి చేసి, హత్య చేశాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. పాత కక్షల నేపధ్యంలో ఈ ఘటన జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపారని ఈ కథనంలో ఉంది. ఇదే స్క్రీన్ షాట్ లో ఉన్న జూలై 18, 2023 నాటి ఎన్డీటీవీ కథనం లో కూడా ఇది పల్నాడు లోని వినుకొండ లో జరిగిన ఘటన అని ఉంది. ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రషీద్ ను అధికార తెలుగు దేశం కి చెందిన జిలానీ హత్య చేశాడు అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపించగా, దీనికి రాజకీయ కోణం లేదని పోలీసులు తెలిపారు. అలాగే,  ఇద్దరూ కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కి చెందినవారేనని తెలుగు దేశం పార్టీ వారు ఆరోపించారు.

ఈ ఘటన గురించి మరింత సమాచారం ఈటీవీ భారత్ లో మాకు లభించింది. రషీద్, జిలానీ గతంలో స్నేహితులు అని, తర్వాత ఇద్దరి మధ్య 2022 లో విబేధాలు వచ్చిన నేపధ్యంలో ఒక రోజు వీరి మధ్య గొడవ అయ్యింది అని, ఆ గొడవలో జిలానీ రషీద్ వర్గీయుల మీద దాడి చేశాడని, అతని మీద కేసు నమోదు చేశారని, ఆ తరువాత రషీద్ వర్గీయులు జిలానీ ఇంటి మీద దాడి చేశారని జూలై 19, 2024 నాటి ఈ కథనంలో ఉంది. ఆ తరువాత గొడవలు పెద్దవయ్యాయని, ఈ నేపధ్యంలో జూలై 17 నాడు జిలానీ రషీద్ మీద దాడి చేసి, హత్య చేశాడు అని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఈ ఘటన గురించి వినుకొండ పోలీసులని మేము సంప్రదించాము. వినుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సాంబశివ రావు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ఇది ఇద్దరి వ్యక్తిగత కక్షల నేపధ్యం లో జరిగిన గొడవ అని, హతుడు రషీద్, హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న జిలానీ ఇద్దరూ ముస్లిం మతస్తులని, ఆ రోజు ఘటన లో జిలానీ తన స్నేహితులని పిలిచాడని, ఆ స్నేహితులలో హిందువులు, ముస్లింలూ ఉన్నారని సాంబశివ రావు తెలిపారు. “ఒక ముస్లిం వ్యక్తి హిందూ వ్యక్తిని చంపిన ఘటన ఇది అనేది పూర్తిగా అవాస్తవం,” అని ఆయన మాకు తెలిపారు.

ఈ కేసుకి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ ప్రతి మాకు లభించింది. ఎఫ్ఐఆర్ సంఖ్య 184/2024. ఇందులో నిందితులుగా జిలానీ, పఠాన్ అబూబాకర్ సిద్ధిఖ్ (సిద్ధూ) , షఫీ, ఇమ్రాన్, ఆంబులెన్స్ రఫీ, జిమ్ జానీ, సయిబా ఉన్నారు. 

ఎఫ్ఐఆర్ ప్రతి స్క్రీన్ షాట్ (సౌజన్యం: appolice.gov.in)

వీరే కాక కె. వెంకట సాయి, కె. ఏడుకొండలు, బి. అనీల్, పి. సుమంత్, షేక్ సొహేల్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరి మీద భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్య, హత్యకి కుట్ర, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూలై 25, 2024 నాటికి ఇందులో ఏడుగురిని అరెస్ట్ చేశారు.  

ఇతర నిందితుల జాబితా స్క్రీన్ షాట్ (సౌజన్యం: వినుకొండ పోలీస్)

దీనిబట్టి ఇది ముస్లిం వ్యక్తి హిందూ వ్యక్తిని చంపిన ఘటన కాదని స్పష్టమవుతున్నది.

తీర్పు

పాత కక్షల నేపధ్యంలో ఒక ముస్లిం వ్యక్తి మరొక ముస్లిం వ్యక్తి మీద దాడి చేసి చంపిన ఘటనకి సంబంధించిన వీడియోని ఒక ముస్లిం వ్యక్తి హిందూ వ్యక్తి మీద దాడి చేసి చంపిన ఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు. 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.