హోమ్ ప్రధానమంత్రి మోదీ డెన్మార్క్ రాణిని కలిసినప్పటి వీడియోని తప్పుడు క్లైమ్ తో షేర్ చేశారు

ప్రధానమంత్రి మోదీ డెన్మార్క్ రాణిని కలిసినప్పటి వీడియోని తప్పుడు క్లైమ్ తో షేర్ చేశారు

సెప్టెంబర్ 4 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్రధానమంత్రి మోదీ డెన్మార్క్ రాణిని కలిసినప్పటి వీడియోని తప్పుడు క్లైమ్ తో షేర్ చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

బ్రిటష్ రాజ కుటుంబాన్ని కలిసిన తొలి భారత ప్రధాని మోదీ అనేది అబద్ధం. 1969లో రెండవ ఎలిజబెత్ రాణి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కలిశారు.

క్లైమ్ ఏంటి?

ఒక రాజ కుటుంబాన్ని మోదీ కలిసినప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ చేసి చరిత్రలో మొదటిసారిగా బ్రిటిష్ రాజ కుటుంబం ఒక భారత ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం తెలిపింది అని క్లైమ్ చేశారు. మోదీని భోజనానికి ఆహ్వానించి ఆయనతో వాళ్ళు ఫొటోలు కూడా దిగారు అని రాసుకొచ్చారు. 

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), ఫేస్బుక్ లో ఈ క్లైమ్ వైరల్ అయ్యింది. ప్రీతి యాదవ్ అనే ఎక్స్ యూజర్ ఒకరు ఈ వీడియో షేర్ చేసి, “తమ ఇంట్లో భోజనానికి ఒక భారత ప్రధానమంత్రిని యునైటెడ్ కింగ్డం ప్రభుత్వం పిలవటం ఇదే మొదటిసారి. మోదీ ఉత్తమ లక్షణాల కారణంగా ఆయనికి వారి గౌరవం కూడా లభించింది. దానికి సాక్ష్యం రాజ కుటుంబం మోదీతో ఫొటోలు దిగటం. ఇది కేవలం మోదీజీకే కాక దేశం మొత్తానికి గర్వకారణం అయిన విషయం.”, అని హిందీలో రాసుకొచ్చారు. ఈ వీడియోకి 3000కి పైగా వ్యూస్ ఉన్నాయి. 

వైరల్ వీడియో స్క్రీన్ గ్రాబ్ (సౌజన్యం: ఎక్స్/@mahi008yadav, ఫేస్బుక్/0041124500840)

అయితే ఈ వీడియో మోదీ బ్రిటిష్ రాజ కుటుంబాన్ని కలిసిన వీడియో కాదు. 2022లో డెన్మార్క్ రాణి రెండవ మార్గ్రేట్ ని కలిసినప్పటి వీడియో. అదే కాక బ్రిటిష్ రాజ కుటుంబం కలిసిన మొదటి భారత ప్రధాని ఇందిరా గాంధీ. 

మేము ఏమి తెలుసుకున్నాము?

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ వీడియో చూసినప్పుడు 45 సెకండ్ల దగ్గర ‘www.kongehuset.dk’ అనేది కనిపించింది. ఇది డెన్మార్క్ రాజ కుటుంబం అధికారిక వెబ్సైట్ అని తెలుసుకున్నాము. 

డెన్మార్క్ రాజ కుటుంబం అధికారిక సామాజిక మాధ్యమ అకౌంట్లు చూసినప్పుడు ఈ వైరల్ వీడియోని డానీష్ రాయల్ హౌస్ అనే రాజ కుటుంబ అధికారిక ఇన్స్టాగ్రామ్ లో మే 4, 2022 నాడు పోస్ట్ చేశారని తెలిసింది. “ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ పర్యటనని పురస్కరించుకుని అమాలియన్బోర్ లో నైట్స్ హాల్ లో క్రిస్టియన్ VII గదిలో ఈ రోజు అధికారిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహారాణి ఈ భోజనాన్ని ఏర్పాటు చేశారు. యువరాజు కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది”, అని డానిష్ భాషలో ఈ వీడియోకి శీర్షికగా పెట్టారు. 

(డెన్మార్క్ కి చెందిన రెండవ మార్గ్రేట్ రాణి ప్రధాన మంత్రి మోదీని భోజనానికి ఆహ్వానించారు(సౌజన్యం:ఇన్స్టాగ్రామ్/detdanskekongehus)

భారత దేశానికి చెందిన వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియోని దాదాపుగా ఇదే శీర్షికతో మే 4, 2022 నాడు పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి చెందిన ఫొటోలని ప్రధానమంత్రి మోదీ తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. “డెన్మార్క్ మహారాణి రెండవ మార్గ్రేట్ ని కోపెన్హాగన్ లో కలిశాను”, అనే శీర్షిక పెట్టారు. 

వైరల్ వీడియోలో స్క్రీన్ గ్రాబ్, మోదీ 2022లో షేర్ చేసిన ఫొటోల మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/@mahi008yadav, ఎక్స్/@narendramodi)

దీనిబట్టి మోదీకి ఆతిధ్యం ఇచ్చిన రాజ కుటుంబం బ్రిటిష్ రాజ కుటుంబం కాదు, డెన్మార్క్ రాజ కుటుంబం అని దీని ద్వారా మనకి తెలుస్తున్నది. 

యుకె, డెన్మార్క్ రాజ కుటుంబాలని కలిసిన మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీనా?

భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ డెన్మార్క్ రాజ కుటుంబాన్ని జూన్ 1957లో కలిశారని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొంది. నెహ్రూ డెన్మార్క్ పర్యటనలో ఉన్నప్పుడు ఫ్రెడెన్స్బోర్ రాజ భవనంలో ఆయన వాళ్ళని కలిశారు.

డెన్మార్క్ రాజ కుటుంబాన్ని నెహ్రూ 1957 లో కలిశారు (సౌజన్యం: కీస్టోన్ ప్రెస్/అలమీ స్టాక్ ఫొటో)

యుకె రాజకుటుంబాన్ని కలిసిన తొలి భారత ప్రధాని మోదీ అనే క్లైమ్ కూడా అబద్ధం.  రెండవ ఎలిజబెత్ రాణి ఇందిరా గాంధీకి 1969లో బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఆతిధ్యం ఇచ్చారు. మోదీని బకింగ్ హామ్ ప్యాలెస్ కి ఆహ్వానించింది 2015లో.

బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఇందిరా గాంధీతో రెండవ ఎలిజబెత్ రాణి (సౌజన్యం: ఎవరెట్ కలెక్షన్ హిస్టారికల్/అలమీ స్టాక్ ఫొటో)

తీర్పు

బ్రిటిష్ రాజ కుటుంబాన్ని మోదీ కలిసినప్పటి వీడియో కాదు ఇది. డెన్మార్క్ రాజ కుటుంబాన్ని 2022లో కలిసినప్పటి వీడియో ఇది. అలాగే బ్రిటిష్ రాజ కుటుంబాన్ని కలిసిన తొలి భారత ప్రధాన మంత్రి మోదీ అనే క్లైమ్ కూడా అబద్ధం. రెండవ ఎలిజబెత్ రాణి 1969 లో ఇందిరా గాంధీకి ఆతిధ్యం ఇచ్చారు. కాబట్టి, ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము.  

 

అనువాదం- గుత్తా రోహిత్ 

 

 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.