ద్వారా: సోహం శా
ఆగస్టు 25 2023
ఈ వీడియోని మొదటగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తి ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియో అని, చంద్రయాన్-3 తీసినది కాదని ధృవీకరించారు.
నేపధ్యం
ఆగస్ట్ 21 నాడు ఒక యూజర్ ఎక్స్ (ఇంతమునుపు ట్విట్టర్) లో ఒక వీడియో పోస్ట్ చేసి “చంద్రయాన్-3 మిషన్: చంద్రమండలం మీద నుండి భూమి ఎలా ఉంటుందో చూడండి”, అని రాసుకొచ్చారు. ఇంకొక యూజర్ ఆగస్ట్ 20 నాడు ఇదే వీడియో షేర్ చేసి “చంద్రమండలం మీద నుండి చంద్రయాన్-3 పంపించిన అందమైన ఫొటో ఇది!”, అని హిందీలో రాసుకొచ్చారు. ఈ వీడియోలో చంద్రుడి మీద నుండి చూస్తే భూమి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఉంది.
(చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అంటూ ఎక్స్ లో షేర్ చేసిన ఫొటోలు (సౌజన్యం: ఎక్స్/@jkssb_aspirants, @wasimkhan0730/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ వీడియోని మొదటగా షేర్ చేసింది మిథిలేష్ కేసరి (@mkeshari) అనే యూజర్ అని తెలుసుకున్నాము. ఈ వీడియో తరువాత వైరల్ అయ్యి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 2,60,000కి పైగా వ్యూస్, 3800 లైక్స్ సంపాదించుకుంది.
(మిథిలేష్ కేసరి పెట్టిన అసలైన పోస్ట్ (సౌజన్యం: ఎక్స్/@mkeshari)/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్))
చంద్రయాన్-1, చంద్రయాన్-2 తరువాత ఇస్రో నిర్వహించిన తాజా మిషన్ చంద్రయాన్-3. ఆగస్ట్ 14, 2023 నాడు విక్రమ్ అనే లాండర్ ని, ప్రగ్యాన్ అనే రోవర్ ని ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధృవం మీద ఆగస్ట్ 23 సాయంత్రానికి ఇది ల్యాండ్ అవ్వాలి. చంద్రుడికి సంబంధించిన కొన్ని ఫొటోలని ఇస్రో తన అధికారిక వెబ్సైట్ లో పెట్టింది.
అయితే ఈ వైరల్ వీడియో చంద్రయాన్-3 తీసినది కాదు. కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియో ఇది.
వాస్తవం
ఈ వీడియో కోసం ఇస్రో సామాజిక మాధ్యమాల అకౌంట్లలో, అధికారిక వెబ్సైట్ లో వెతికితే మాకు ఎక్కడా కనిపించలేదు.
కేసరి ట్వీట్ కింద కొంతమంది యూజర్లు ఇది ఫెక్ అని, ఎడిటెడ్ వీడియో అని కామెంట్లు పెట్టగా, ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియో అని కేసరి ఒప్పుకున్నారు.
(ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియో అని ఒప్పుకున్న కేసరి (సౌజన్యం: స్క్రీన్ షాట్/ఎక్స్)
ఈ వీడియో ఆయనే సృష్టించారో లేదో తెలుసుకోవటానికి కేసరిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. “అవును. కృత్రిమ మేధ ద్వారా సృష్టించి, ఎడిట్ చేసి పోస్ట్ చేశాను 🚀🌖🇮🇳”, అని ఆయన తెలిపారు.
అదే త్రెడ్ లో చంద్రుడికి సంబంధించి మరింత నిడివి ఉన్న వీడియోని ఆయన షేర్ చేశారు. ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ టూలైన ‘ఇన్ వీడియో’ వాటర్ మార్క్ మనకి కుడి వైపు కింద భాగాన స్పష్టంగా కనిపిస్తుంది. స్టాక్ ఫొటోల వెబ్సైట్ ‘స్టోరీ బ్లాక్స్’ వాటర్ మార్క్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది.
(‘ఇన్ వీడియో’ వాటర్ మార్క్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది (సౌజన్యం: ఎక్స్/@mkeshari/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్))
ఈ యూజర్ బయోలో “బ్లాక్ చైన్ డెవలపర్. ఏఐ బిజినెస్ ఇంటలిజెన్స్ డెవలపర్. మీ నుంచి వినటానికి సిద్ధంగా ఉన్నాను. mk@web3c.com”, అని ఉంది.
తీర్పు
ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియో. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారిస్తున్నాము.