హోమ్ తెలంగాణ వీడియోని చూపి ఆంధ్ర వరదల నేపధ్యంలో చంద్రబాబును విమర్శిస్తున్నట్టుగా షేర్

తెలంగాణ వీడియోని చూపి ఆంధ్ర వరదల నేపధ్యంలో చంద్రబాబును విమర్శిస్తున్నట్టుగా షేర్

ద్వారా: రాజేశ్వరి పరస

సెప్టెంబర్ 12 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో విజయవాడ వరద బాధితులు ముఖ్యమంత్రి నాయుడును విమర్శిస్తున్నారు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో విజయవాడ వరద బాధితులు ముఖ్యమంత్రి నాయుడును విమర్శిస్తున్నారు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

మిర్రర్ టీవీ రిపోర్టర్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, వైరల్ అవుతున్న వీడియో ఆయన ఖమ్మం వరదల నేపధ్యంలో తెలంగాణలో తీసినది అని తెలిపారు.

క్లెయిమ్ ఏమిటి?

ఒక ఇంటి బయట వరద భాదితులు మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. భాదితులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు వారిని పట్టించుకోలేదు అని వాపోతూ విమర్శిస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఈ వైరల్ వీడియోలో ఎవరిని ప్రత్యేకించి పేర్లతో విమర్శించినట్టు వినపడదు.

ఈ క్లెయిమ్ ను వివిధ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ, ఈ విధంగా రాసుకొచ్చారు, “జగనన్న ఇచ్చిన సొమ్ము తిని విశ్వాసం లేకుండా చంద్రబాబుకు ఓటు వేసి పెద్ద తప్పు చేసాము - విజయవాడ ప్రజలు."

ఈ వీడియోలో, ఒక నీలం రంగు చీర ధరించిన మహిళ మాట్లాడుతూ, “అందరు ఓట్లేస్తే నువ్వు గెలిచి గద్దె మీద కూసున్నవ్. . . మా పరిస్థితి ఏంటి?” అనే విధంగా అనటం మనం వినవచ్చు. ఆర్కైవ్ చేసిన పోస్టుల లింకులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలలో వరదలు సంభవించిన అనంతరం, ఈ క్లెయిమ్ షేర్ అవ్వటం మొదలయ్యింది. రెండు ప్రభుత్వాలు, సహాయక చర్యలు చేపట్టాయి. బంగాళా ఖాతంలో అల్పపీడనం అనంతరం, ఈ ప్రాంతాలో వరదలు వచ్చాయి. తెలంగాణ లోని ఖమ్మం, మహబూబాబాద్, ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అధికంగా ప్రభావితమయ్యాయి.

ఒక వైపు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఉంటే, తెలుగు దేశం పార్టీ నేషనల్ డెమోక్రాటిక్ కూటమి నేతృత్వంలో ఉంది.

కానీ ఈ క్లెయిమ్ అబద్ధం. ఎందుకంటే, వైరల్ అవుతున్న వీడియో, తెలంగాణలోని ఖమ్మంకి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధం లేదు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోలో కుడి పక్క పైన ఉన్న ఒక లోగోను మేము గమనించాము, ఇది మిర్రర్ టివి అనే ఒక ప్రాంతీయ యూట్యూబ్ ఛానల్ వీడియో. దీని ఆధారంగా, మిర్రర్ టివి అప్లోడ్ చేసిన వీడియో కథనం ఒకటి కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియో ని సెప్టెంబర్ 4 నాడు “ఖమ్మం అల్లకల్లోలం.. Khammam Floods Effects | Mirror TV Ground Report” అనే శీర్షిక తో అప్లోడ్ చెయ్యటం జరిగింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కుడా ఇందులో నుండి తీసుకున్నదే అని తెలుస్తుంది.
 
వైరల్ వీడియోలో నీలం రంగు చీరలో కనపడిన మహిళను, ఈ వీడియోలో 34:27 టైం స్టాంప్ వద్ద కుడా మనం చూడవచ్చు. ఈ గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా వరద భాదితుల ఇబ్బందుల గురించి ఉంది, ఇందులో 34:27 నుండి 35:24 వరకు ప్రస్తుత వైరల్ క్లిప్ సన్నివేశాన్ని మనం చూడవచ్చు. 35:30 వద్ద, ఆ మహిళ, తమ లోకల్ కార్పొరేటర్ తన ఇద్దరు కుమారులు గత సంవత్సరం వచ్చిన వరదలలో ఏ విధంగా సహాయం చేశారో తెలియజేయటం కుడా మనం చూడవచ్చు.

వైరల్ వీడియోకి మరియు ఒరిజినల్ వీడియోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ యూట్యూబ్)

ఇదే వీడియోలో 33:00 టైం స్టాంప్ వద్ద, మరొక వ్యక్తి ఖమ్మం నుండి ఎన్నికైన చేనేత కార్మిక మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని ప్రశ్నించటం చూడవచ్చు. వరదల వలన కొంత మంది తమ నివాసాల పై అంతస్థులలో ఇరుక్కుపోయిన వీడియోలు వైరల్ అయినప్పటికీ కుడా మంత్రి ఎందుకు స్పందించలేదు అనే అడగటం మనం చూడవచ్చు. 33:34 టైం స్టాంప్ వద్ద, ఆ వ్యక్తి, ఎప్పుడూ ఖమ్మం గురించి మాట్లాడే మరో మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్, ఇప్పుడు నిద్రపోతున్నారా? అని అడగటం కుడా చూడవచ్చు. శ్రీనివాస్, తెలంగాణలో సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ వీడియోలో కనపడిన మిర్రర్ టీవీ పాత్రికేయుడు పండరి గౌడ్ ను కుడా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ, ఈ వీడియోని ఆయన ఖమ్మం లోనే తీశారు అని నిర్ధారించారు. పైగా, వారి ఛానల్ లో ఈ విషయాన్నీ సెప్టెంబర్ 4, 2024 నాడు ప్రత్యక్ష ప్రసారం చేసినట్టుగా కుడా తెలిపారు. “ఈ కథనాన్ని వెంకటేశ్వరా నగర్ లో తీయటం జరిగింది, ఇక్కడ ప్రజలు వరదకు ఎక్కువగా గురయ్యారు, దాదాపుగా వసతి గృహాలలో మొదటి అంతస్థు వరకు వరద నీరు కమ్మేసింది. అందుకనే వరదల అనంతరం, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే అంశం పై, వీడియో కథనం చేయటం జరిగింది,” అని తెలిపారు.

ఖమ్మం వరదల రాజకీయం

ప్రతిపక్ష పార్టీలు, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సరైన సమయానికి ప్రజలను వరదల గురించి అప్రమత్తం చేయని కారణంగానే, వరద ఉద్రిక్తత పెరిగింది అంటూ విమర్శించటంతో, వరదల విషయం రాజకీయ చర్చగా మారింది. కొన్ని వార్త కథనాల ప్రకారం, ఖమ్మం వరద బాధితులు కుడా ప్రభుత్వంలో ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, వరద ముంపు నుండి తమను కాపాడలేదు అని కుడా బహిర్గతంగా విమర్శించారు. గత సంవత్సరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయటం వలన, నష్టం తగ్గింది అని ప్రజలు పోల్చారు.

తీర్పు 

ఖమ్మం వరద బాధితులు తెలంగాణ అధికారులను విమర్శిస్తున్న వీడియోను, విజయవాడ వాస్తవ్యులు వరద నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారులను తిడుతున్నట్టుగా షేర్ చేశారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.