ద్వారా: అంకిత కులకర్ణి
ఆగస్టు 26 2024
వీడియోలో ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం డ్యామ్, త్రిపుర లోని డుంబుర్ డ్యామ్ కాదు.
క్లెయిమ్ ఏమిటి?
అధికంగా నీరు ప్రవహిస్తున్న డ్యామ్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలోషేర్ చేసి, ఇది త్రిపుర లోని డుంబుర్ డ్యామ్ అని పేర్కొన్నారు. దీనిని షేర్ చేస్తూ, బంగ్లాదేశ్ లో వరదలు రావడానికి ఇదే కారణం అని అర్థం వచ్చేటట్టు షేర్ చేస్తున్నారు.
ఎక్స్ లో ఈ వీడియోని షేర్ చేస్తూ, డంబుర్ డ్యామ్ తెరిచి బంగ్లాదేశ్ లో వరదలు రావడానికి భారత దేశం కారణం అయింది అని పేర్కొన్నారు. “ప్రతీది గుర్తుంటుంది” అని రాస్తూ, బంగ్లాదేశ్ లో వరదలకు సంబంధించిన హాష్ట్యాగ్ లను వాడారు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇదే వీడియోని ఇలాంటి వాదనలతోన ఫేస్బుక్ లో కుడా షేర్ చేశారు, ఆ పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
సందర్భం :
బంగ్లాదేశ్ లో వరదలకు భారతదేశమే కారణం అనే ఆరోపణల నేపధ్యం లో ఒక వీడియో షేర్ అవుతుంది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ నాహిద్ ఇస్లాం భారతదేశం త్రిపుర లో ఉన్న డుంబుర్ డ్యామ్ ని ముందస్తు సూచన చెయ్యకుండా తెరిచింది అని ఆరోపణ చేసారు.
భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ ఈ వాదనను తిప్పి కొడుతూ, డుంబుర్ డ్యామ్ 120 కిలోమీటర్ల దూరం లో ఉంది అని, బంగ్లాదేశ్ లో వచ్చిన వరదలకు కారణం అక్కడ పడ్డ అధిక వర్షాలు అని, డ్యామ్ గేటులు ఎత్తడం కాదు అని తెలియజేసింది.
అయితే, ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా నది పై ఉన్న శ్రీ శైలం డ్యామ్. దీనికి త్రిపుర కి కానీ బంగ్లాదేశ్ లోని వరదలకి కానీ సంబంధం లేదు.
వాస్తవం ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆగష్టు 6 నాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియోకి శీర్షిక గా ఇది శ్రీశైలం లో నిండా నీరు ఉన్న దృశ్యం అని పేర్కొన్నారు.
వైరల్ క్లిప్ మరియు యూట్యూబ్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ యూట్యూబ్/ స్క్రీన్ షాట్)
గూగుల్ సెర్చ్ చేయగా, ది హిందూ లో ఆగష్టు 3, 2024 నాడు ప్రచురించిన కథనం లభించింది,శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం తో అనేక మంది యాత్రికులు సందర్శనకు వచ్చినట్టుగా ఇందులో ఉంది. కృష్ణ, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతుండడంతో శ్రీశైలం డ్యామ్ నుండి దిగువున ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ కి నీరు వదిలారు అని ఈ కథనం లో ఉంది. వైరల్ వీడియో లో మాదిరి ఫొటోనే ఇందులో కూడా ఉంది..
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, ఆగష్టు 12 నాడు డ్యామ్ గేట్లనుతెరిచారు.
పైగా, గూగుల్ మ్యాప్స్ లో శ్రీశైలం డ్యామ్ ని మేము గుర్తించాము. డ్యామ్ చుట్టుపక్కన ఉన్న ప్రదేశం మరియు వైరల్ క్లిప్ లో ఉన్న సన్నివేశాలు ఒకేలాగా ఉన్నాయి. దాంతో ఇది త్రిపుర లోని డుంబుర్ డ్యామ్ కాదని నిర్ధారించాము.
వైరల్ క్లిప్ లోని విజువల్ మరియు గూగుల్ మ్యాప్ విజువల్ మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ గూగుల్ మ్యాప్స్/ స్క్రీన్ షాట్)
తీర్పు
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం డ్యామ్ వీడియోని త్రిపుర లోని డుంబుర్ డ్యామ్ గా తప్పుగా షేర్ చేస్తున్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)