ద్వారా: రజిని కె జి
ఆగస్టు 28 2024
ఈ వీడియో మే 2024 లో కొలంబియా లోని మొన్టేబెల్లో మున్సిపాలిటీ లో అధిక వర్షాల కారణంగా వరదలు వచ్చినప్పటి వీడియో.
క్లెయిమ్ ఏమిటి?
వరద నీటిలో ఇల్లులు కొట్టుకుపోతున్న వీడియో ఒకటి ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ని షేర్ చేస్తూ, ఇది బద్రీనాథ్ లోని వరద ఉద్రిక్తత అని షేర్ చేస్తున్నారు. బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని ఛమోలీ జిల్లా లోని ఉన్న ప్రదేశం, అక్కడ అధిక వర్షాల మూలంగా వరదలు వచ్చాయి. వీడియో లో ఉన్నది ఇదే ప్రదేశం అన్నట్టుగా హిందీ లో శీర్షిక పెట్టి షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఆగష్టు 24, 2024 నాడు భారీ వర్షాల మూలాన ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటన చోటు చేసుకుంది. దీని వలన కొన్ని ఇల్లులు ధ్వంసం కాగా, అనేక రహదారులు మూతపడ్డాయి. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, ఛమోలీ జిల్లా లో ఈ సందర్భం లో ఒక బండరాయి పడటం వలన ఒక మహిళ ప్రాణాలు కోల్పయింది.
కానీ, బద్రీనాథ్ లోనే ఈ వరద వీడియో అనే వాదన తప్పు. ఈ వీడియో కొలంబియా లోనిది.
వాస్తవాలు ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, కొలంబియన్ వార్త సంస్థ అయినా నోటిషియస్ కారకోల్ మే 5 నాడు పబ్లిష్ చేసిన వీడియో ఒకటి లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఆ కథనం లో ఇది కొలంబియా లోని మొన్టేబెల్లో మున్సిపాలిటీ హిమపాతం చరియలు విరిగిపడిన సందర్భం లోనుండి అని పేర్కొంది. ఈ సంఘటన లో అయిదు ఇల్లులు కొట్టుకుపోయాయి, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు అని ఉంది. దీని ద్వారా, బద్రీనాథ్ లో వరదలకు ముందు గానే, ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ఉన్నట్టుగా మనకు అర్ధమవుతుంది.
వైరల్ వీడియో మరియు యూట్యూబ్ వీడియో పోలిక (సౌజన్యం : యూట్యూబ్/ ఫేస్బుక్)
ఎల్ కొలంబియానో అనే ఒక లోకల్ వార్త సంస్థ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కి సంభందించిన ఫొటోలతో ఒక కథనాన్ని ప్రచురించింది, ఇందులో మే 4, 2024 నాడు అధిక వర్షాల మూలంగా, దాదాపుగా మొన్టేబెల్లో లో 30 ఇల్లులు దాకా ధ్వంసం అయినట్టుగా పేర్కొంది.
మొన్టేబెల్లో మేయర్ ఆస్కార్ ఎర్నెస్టో ఈ సంఘటనలో ఇల్లులు ధ్వంసం అయినట్టుగా పేర్కొంటూ, నగర వాసులను సురక్షితంగా తప్పించినట్టుగా పేర్కొన్నారు. కొలంబియా కి సంభందించిన బ్లు రేడియో స్టేషన్ కుడా ఇదే సమాచారాన్ని పేర్కొంది.
తీర్పు
వైరల్ వీడియోలో ఉన్నది కొలంబియా లోని మొన్టేబెల్లో అనే ప్రదేశం లో వచ్చిన వరద. భారత దేశంలోని ఉత్తరాఖండ్ కి సంభందించిన వీడియో కాదు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)