హోమ్ పాత వీడియోని షేర్ చేసి తాజా బతుకమ్మ సంబరాలలో తెలంగాణ పోలీసులు మహిళలని అరెస్ట్ చేసినట్టు చూపారు

పాత వీడియోని షేర్ చేసి తాజా బతుకమ్మ సంబరాలలో తెలంగాణ పోలీసులు మహిళలని అరెస్ట్ చేసినట్టు చూపారు

ద్వారా: రాజేశ్వరి పరస

నవంబర్ 7 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియోని షేర్ చేసి తాజా బతుకమ్మ సంబరాలలో తెలంగాణ పోలీసులు మహిళలని అరెస్ట్ చేసినట్టు చూపారు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ )

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న వీడియో 2018లో బిజెపి నేతలు అనుమతి లేకుండా చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడుతున్నందుకు ఆపినప్పటిది.

క్లెయిమ్ ఏమిటి?

బతుకమ్మ అనేది తెలంగాణలో ప్రముఖంగా పూలతో జరుపుకునే పండుగ, ప్రతి ఏడాది సెప్టెంబర్ మరియు అక్టోబర్ లో జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు మొదలు కాగానే, సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది మహిళలు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అక్టోబర్ 18 నాడు ఎక్స్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో ఇలా రాశారు- చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడుతున్నందుకు పోలీసులు హిందువులైన మహిళలని అరెస్ట్ చేశారు. పోలీసులు బతుకమ్మ ఆడడానికి కూడా అనుమతి తీసుకోవాలని అన్నారు, ఇది ఇండియానా లేక పాకిస్థానా? కనుక హిందువులందరూ కూడా మనకి ఏం జరుగుతుందో ఆలోచించండి.

ఇతర మాధ్యమాలలో కూడా ఇలాగే షేర్ చేశారు, వాటి ఆర్కైవ్ పోస్ట్లు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.



సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ )

అయితే ఇది తప్పుదోవపట్టించేటట్టుగా ఉంది, ఎందుకంటే ఇది 2018 నాటి వీడియో. 

వాస్తవం ఏమిటి?

ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతుంటే మేము కీవర్డ్ సెర్చ్ చేసి, చార్మినార్ ప్రాంతంలో ఈమధ్య కాలంలో ఎవరినైనా బతుకమ్మ ఆడినందుకు అరెస్ట్ చేశారా అని వెతికాము. అయితే మాకు అటువంటి కథనాలు ఏవి లభించలేదు. 

అయితే న్యూస్ 18 ప్రచురించిన 2018 నాటి రిపోర్ట్ ఒకటి దొరికింది, “చార్మినార్ వద్ద బతుకమ్మ, బిజెపి నేతల అరెస్ట్”, అని ఈ కథనం శీర్షిక. ఈ కథనంలో బిజెపి మహిళా మోర్చా నేతలు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వద్ద బతుకమ్మ సంబరాలు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అని ఉంది. పైగా వాగ్వాదం ఎక్కువ అవటంతో పోలీసులు బిజెపి మహిళలను అదుపులోకి తీసుకున్నారు అని కూడా ఉంది. చార్మినార్ అనేది హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పురాతన కట్టడం. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. 

మరో యూట్యూబ్ చానల్, టిడి న్యూస్ 24*7లో కూడా 2018 లో ఇలాంటి వీడియోనే అప్లోడ్ చేశారు. చార్మినార్ పోలీసులు 25-30 మందిమహిళలని అనుమతి లేకుండా బతుకమ్మ ఆడుతున్నందుకు అరెస్ట్ చేశారు అని ఈ వీడియోలో పేర్కొన్నారు.  ఈ వీడియోలో కూడా వైరల్ వీడియోలో ఉన్న మహిళలే పొలీసులతో గొడవ పడుతున్నారు.

ఇలా పాత వీడియో వైరల్ అవుతుంటే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య కూడా ఎక్స్ లో ఈ వీడియో పాతది అని తెలిపారు. “పాత వీడియోని కొంతమంది వ్యక్తులు ఈ మధ్య  జరిగినట్టుగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్ట్ లను నమ్మొద్దు. ఇది చాలా కాలం కిందట జరిగింది. మేము దీని వెనుక ఉన్న వ్యక్తులపైనా మరియు దీనిని ప్రచారం చేసే వారి పైనా చర్యలు తీసుకుంటున్నాము.” అని రాసుకొచ్చారు. 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ / @CPHydCity)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తెలంగాణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షులు కే. గీతా మూర్తిని సంప్రదించింది, ఆమె మాట్లాడుతూ, ఈ విషయం 2018 నాటిది అని నిర్ధారించారు. ఇంకాస్త వివరిస్తూ, మహిళా మోర్చా నేతలు భాగ్యలక్ష్మి గుడి వద్ద ముందస్తు అనుమతి లేకుండా బతుకమ్మ ఆడినందుకు పోలీసులు వారిని అడ్డుకున్నారు అని గీతా మూర్తి తెలిపారు. 

తీర్పు

అనుమతి లేకుండా బతుకమ్మ ఆడినందుకు బిజెపి మహిళలని అడ్డుకున్న 2018 నాటి ఘటన వీడియోని ఈ మధ్య కాలం జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారు. కనుక మేము ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది అని నిర్ధారించాము.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.