ద్వారా: రాజేశ్వరి పరస
మార్చి 13 2024
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఏ పార్టీకి సమంత మద్ధతు తెలపలేదని సమంత మీడియా బృందం లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి స్పష్టం చేసింది.
క్లైమ్ ఏంటి?
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో 14 సెకన్ల నిడివి గల నటి సమంత వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇందులో తను ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్ధతు పలికిందని క్లైమ్ చేశారు.
“నేను మీ సమంత. అభివృద్ధికి ఓట్ చేయండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు,” అని సమంత చెప్పడం మనం ఈ వీడియోలో వినవచ్చు. ఇదే భాగం ఈ వైరల్ వీడియోలో నాలుగు సార్లు ఉంది. సైకిల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ క్లైమ్ తప్పు దోవ పట్టించేటట్టు ఉంది. ఇది పాత వీడియో. రాబోయే ఎన్నికలలో సమంత ఏ పార్టీకి తన మద్ధతు ప్రకటించలేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వైరల్ వీడియోలో జంప్ కట్స్, ఏడిట్స్ ఉన్నాయి. దీని బట్టి మరింత నిడివి ఉన్న వీడియో నుండి ఈ భాగాన్ని క్లిప్ చేసుంటారని తెలుస్తుంది. అలాగే సమంత తెలుగు దేశం పార్టీకి తన మద్ధతు ప్రకటించిందని తెలుపుతూ ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనం లేదు.
2019 ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం తెలుగు దేశం అభ్యర్ధిగా పోటీ చేసిన అనగాని సత్య ప్రసాద్ కి సమంత తన మద్ధతు తెలిపింది అనే వార్తా కథనాలు మాకు లభించాయి.
2019లో వివిధ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఈ 12 సెకన్ల ఒరిజినల్ వీడియోలో “నేను మీ సమంత. మన రేపల్లె, మన అనగాని. అభివృద్ధికి ఓట్ చేయండి. అనగాని సత్య ప్రసాద్ గారికి ఓట్ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు,” అని సమంత చెప్పడం మనం వినవచ్చు.
ఒరిజినల్ వీడియోలో 00:02- 00:10 భాగం మనకి వైరల్ వీడియోలో కనిపించదు. ఈ భాగంలో సమంత అనగాని సత్య ప్రసాద్ పేరు తీసుకుని తనకి ఓటు వేయమని చెబుతుంది. ఇలా ఎడిట్ చేసి, సమంత తెలుగు దేశం పార్టీకి తన మద్ధతు తెలియచేసింది అన్నట్టు క్లైమ్ చేశారు.
ది హిందూ దినపత్రికలో ఏప్రిల్ 10, 2019 నాడు వచ్చిన ఒక కథనంలో ఈ వీడియో గురించి వివరణ ఉంది. సమంత తన అధికారిక సామాజిక అకౌంట్ లలో ఈ వీడియోని షేర్ చేయలేదు. అయినా కూడా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది అని ఈ కథనంలో ఉంది. ఈ వీడియోని అధికారికంగా విడుదల చేయనందుకు సామాజిక మాధ్యమ యూజర్లు సమంతని విమర్శించినట్టు, అలాగే అనగాని సత్య ప్రసాద్ సమంత మధ్య పరిచయం గురించి యూజర్లు ఆసక్తి తెలిపారని కూడా ఈ కథనంలో ఉంది.
దీని గురించి 2019లో సమంత వివరణ ఇస్తూ, అనగాని సత్య ప్రసాద్ తనకి ‘కుటుంబ స్నేహితుడు’అని, సత్య ప్రసాద్ సోదరి డాక్టర్. అనగాని మంజుల ద్వారా తనకు సత్య ప్రసాద్ పరిచయం అని, ఆవిడ ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ సహ వ్యవస్థాపకులు అని తమ ఎక్స్ పోస్ట్ లో తెలిపారు. ది హిందూ కథనం ప్రకారం, అలాగే ప్రత్యూష ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం సమంత ప్రత్యూష ఫౌండేషన్ ని 2014లో స్థాపించారు.
ప్రత్యూష ఫౌండేషన్ వెబ్సైట్ లోని ‘మా గురించి’ విభాగం మరింత సమాచారం అందిస్తుంది (సౌజన్యం: ప్రత్యూష ఫౌండేషన్/స్క్రీన్ షాట్)
లాజికల్లీ ఫ్యాక్ట్స్ సమంత మీడియా బృందాన్ని సంప్రదించింది. రానున ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో సమంత ఏ పార్టీకి తన మద్ధతు ప్రకటించలేదు అని, వైరల్ అయిన వీడియో గతంలో ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతు తెలిపిన వీడియో అని వారు మాకు తెలిపారు.
తీర్పు
2019 ఎన్నికలలో సమంత ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి మద్ధతు తెలిపిన వీడియోని రాబోయే ఎన్నికలలో తను తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలుపుతున్నట్టు షేర్ చేసి. రాబోయే ఎన్నికలలో సమంత ఏ పార్టీకి తన మద్ధతు ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)