ద్వారా: రాజేశ్వరి పరస
జూలై 5 2024
మా పరిశోధన ప్రకారం, వీడియోలో ఉన్న దృశ్యాలు మథురాలో మర్చి, 2024లో హోలీకి ముందు జరిగిన కార్యక్రమ దృశ్యాలు.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో అనేక మంది యూజర్లు ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఇందులో అనేక మంది జనాలు ఇరుక్కుపోయి, బయటకి రావడానికి అవస్థ పడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు. హత్రాస్ లో జులై 2, 2024 నాడు భోలే బాబా అన బడే నారాయణ్ సర్కార్ హరి సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో పాటు ఈ విధంగా శీర్షిక పెట్టు షేర్ చేస్తున్నారు, “ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 116 మంది వ్యక్తులు, అందులో అధికంగా ఆడవారు, వారి ప్రాణాలు కోల్పోయారు.” ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆన్లైన్ లో ప్రచారం అవుతున్న స్క్రీన్ షాట్ ( సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వీడియో మార్చ్ లోనిది, మథురలోని ఒక హోలీకి ముందు జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడిన సందర్భం లోనిది.
మేము ఏమి కనుగొన్నాము?
వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఎన్డీటీవీ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్ మార్చ్ 17, 2024 నాడు షేర్ చేసిన వీడియో కథనం మాకు లభించింది. ఈ కథనం కుడా అదే వీడియోని షేర్ చేసి మథురాలో ఒక హోలీకి ముందు జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది అని పేర్కొంది. ఈ సంఘటన శ్రీజి దేవాయలం లో మథురాలో ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది, ఆ సమయంలో ఆరుగురు భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్టు, మరెందరో గాయాల పాలయినట్టు పేర్కొన్నారు.
ఎన్డీటీవీ కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎన్డీటీవీ)
లైవ్ మింట్ ప్రచురించిన మరో కథనంలో, ఆ సంఘటన చూసిన ఒక సాక్షి మాట్లాడుతూ, ఇది లడ్డూ హోలీ సంబరాలలో జరిగింది అని పేర్కొన్నారు. హోలీ అనేది, హిందూ సమాజం రంగులతో జరుపుకునే ఒక పండుగ.
మథుర పోలీసులు కుడా ఎక్స్ లో మార్చ్ 17, 2024 నాడు దీనిగురించి తమ ఎక్స్ లో వ్యాఖ్యానించారు (ఆర్కైవ్ ఇక్కడ). మథురా సీనియర్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శైలేష్ పాండే మాట్లాడుతూ, అక్కడ జరిగింది తొక్కిసలాట కాదని, లక్షల్లో భక్తులు రావటంతో రద్దీ ఏర్పడిందని తెలిపారు.
హత్రాస్ తొక్కిసలాట
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా కనీసం 121 మంది తమ ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయాల పాలయ్యారు.
ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనం ప్రకారం, ఆ కార్యక్రమానికి పరిమితి 80,000 కాగా Rs. 2.5 లక్షలకు పైగా జనాలు వచ్చారు. తొక్కిసలాట అనంతరం, ప్రభుత్వం మృతులకు రెండు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది, మరియు గాయపడిన వారికీ Rs.50,000 ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనకు సంబందిచి విచారణకు ఆదేశించారు. జులై 4 వ తేదీన ఈ ఘటన విషయంలో నిర్వాహక కమిటీ కి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో అసలు ముద్దాయి, ప్రధాన నిర్వాహకులు దేవ్ ప్రకాష్ మధుకర్ పరారీలో ఉన్నారు. పైగా పోలీసులు తాయారు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నారాయణ్ సర్కార్ హరి, ఒక కానిస్టేబుల్ నుండి ఆధ్యాత్మిక గురువుగా మారిన వ్యక్తి పేరు ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు చేర్చలేదు.
తీర్పు :
ఉత్తర్ ప్రదేశ్ లోని మథురలో మార్చ్ 2024 లో ఒక హోలీ కి ముందు జరిగిన కార్యక్రమం వీడియోని హత్రాస్ తొక్కిసలాట వీడియోగా షేర్ చేస్తున్నారు.