ద్వారా: అంకిత కులకర్ణి
ఆగస్టు 6 2024
వైరల్ అవుతున్న వీడియో కేరళ లో జూన్ 2024 లో ఇద్దరు నిర్మాణ కార్మికులు ఒక ప్రమాదం తరువాత ఇసుక లో ఇరుక్కుపోతే వారిని రక్షించిన సందర్భం లోనిది.
క్లెయిమ్ ఏమిటి?
పాఠకుల గమనిక : ఈ కథనం లో బాధాకరమైన సంఘటన గురించిన వివరణ ఉంటుంది, పాఠకులు గమనించగలరు.
జులై 30, 2024 నాడు, కేరళ లోని వయనాడ్ జిల్లాలో కొండా చరియలు విరిగి పడిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో 300లకు పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఇంకా కనపడకుండా పోయిన వారి కోసం సహాయక దళాలు వెతుకుతున్నాయి. ఈ ఘటన తరువాత, ఒక వ్యక్తిని మట్టినుండి రక్షిస్తున్న వీడియోని షేర్ చేసి, ఇది వయనాడ్ లో చోటు చేసుకుంది అంటూ షేర్ చేస్తున్నారు.
ఒక ఎక్స్ పోస్ట్ (పూర్వపు ట్విట్టర్) లో ఈ వీడియోని షేర్ చేసి, “అనేక కుటుంబాలు ఈ సంఘటన వలన నరకం చూసుంటారు. వయనాడ్ మరియు ఇతర భాదితుల గురించి ప్రార్థిస్తున్నాను.” ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 35,800 వ్యూస్ ఉన్నాయి.
అదే వీడియోని ఫేస్బుక్ లో కుడా ఇలాంటి క్లైమ్ తోనే షేర్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ, వైరల్ అవుతున్న వీడియో వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన కన్నా ముందే ఇడుక్కి లో జరిగిన ఘటన.
మేము ఏమి కనుగొన్నము?
వైరల్ వీడియోలో కుడిపక్కన ఉన్న దానిలో జూన్ 11, 2024 అనే తేదీ ఉంది, ఇది మనకు ఈ ఘటన ఇటీవలది కాదు అని తెలియజేస్తుంది. పైగా, ఆ వీడియోలో ‘కైరాళీ న్యూస్’ అనే ఒక మళయాళం వార్తా ఛానల్ లోగో కుడా ఉంది. దీనిని అనుసరించి, కైరాళీ న్యూస్ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఒరిజినల్ వీడియోని మేము కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియోని ఆ ఛానల్ లో జూన్ 11 నాడు పోస్ట్ చేసింది. వివరణ లో ఇద్దరు నిర్మాణ కార్మికులు అడిమాలిలో జాతీయ రహదారి నిర్మాణం మీద జరిగిన దుర్ఘటన లో ఇరుక్కుపోయినట్టుగా ఉంది.
కైరాళీ న్యూస్ అప్లోడ్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ యూట్యూబ్)
గూగుల్ సెర్చ్ చేయగా, ది హిందూ పత్రిక జూన్ 11, 2024 నాడు ప్రచురించిన ఒక కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, తమిళనాడు లోని టెంకసి అనే నగరానికి చెందిన జోస్ మరియు కాళిస్వామి అనే ఇద్దరు నిర్మాణ కార్మికులు కేరళ లో కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారి నిర్మాణం వద్ద జరిగిన దుర్ఘటన లో మట్టిలో ఇరుక్కుపోయి, స్వల్ప గాయాలతో బయటపడగా, కేరళ లోని ఒక తాలూకా ఆసుపత్రి లో చేర్చారు.
జన్మభూమి అనే ఒక మళయాళం వార్తా పత్రిక కి చెందిన ఒక పాత్రికేయుడు కుడా ఈ వీడియోని పోస్ట్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ), ది హిందూ పత్రిక లో ఉన్నట్టుగానే వివరాలు రాసుకొచ్చారు.
తీర్పు
కేరళ లోని ఇడుక్కిలో ఒక వ్యక్తిని కాపాడుతున్న వీడియోని ఈ మధ్య కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనకి చెందిన వీడియో గా షేర్ చేస్తున్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)