హోమ్ కేవలం ముస్లింలకి మాత్రమే కర్ణాటక ప్రభుత్వం రాయితీ మీద వాహనాలు అందిస్తున్నదన్న క్లైమ్ అవాస్తవం

కేవలం ముస్లింలకి మాత్రమే కర్ణాటక ప్రభుత్వం రాయితీ మీద వాహనాలు అందిస్తున్నదన్న క్లైమ్ అవాస్తవం

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

సెప్టెంబర్ 11 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కేవలం ముస్లింలకి మాత్రమే కర్ణాటక ప్రభుత్వం రాయితీ మీద వాహనాలు అందిస్తున్నదన్న క్లైమ్ అవాస్తవం సౌజన్యం: ఎక్స్,ఫేస్బుక్/స్క్రీన్ షాట్

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ రాష్ట్ర ప్రభుత్వ పధకానికి అన్ని మైనారిటీ వర్గాలకి చెందినవారు అర్హులే. కర్ణాటకలో మైనారిటీ వర్గాలు ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు.

క్లైమ్ ఏంటి?

కర్ణాటకలో ముస్లిం సమాజానికి అక్కడి ప్రభుత్వం ఒక రాయితీ పధకాన్ని “బహుమతిగా” ఇస్తున్నదంటూ ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆటోలు, టాక్సీలు, మంచి వాహనాలు కొనుక్కోవాటానికి ప్రభుత్వం ముస్లింలకి మూడు లక్షల వరకు రాయితీ ఇస్తుందనేది ఈ క్లైమ్ సారాంశం. ఈ పధకం వివరాలకి సంబంధించిన పోస్టర్ కూడా ఒకటి ఈ పోస్ట్ లో ఉంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ హిందువులందరూ ఏకం అవ్వాలి అని రాసుకొచ్చారు  

ఈ పోస్ట్ ని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో షేర్ చేస్తూ ఒక యూజర్ “ముస్లింలకి కర్ణాటక ప్రభుత్వం మరొక బహుమతి. హిందువులేమో 200-300 రూపాయలకి అమ్ముడుపోయారు. ఇప్పుడు చూడండి హిందువుల పరిస్థితి ఎలా ఉందో, ముస్లింల పరిస్థితి ఎలా ఉందో” అని రాసుకొచ్చారు. 

ఇదే పోస్ట్ ని ఫేస్బుక్ లో కూడా ఇలాగే మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు. “మోదీజి కనుక అధికారం కోల్పోతే ఈ రోజు కర్ణాటకలో ఏమవుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అలా జరిగితే ఇక భారత దేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఆపటం ఎవరి తరం కాదు.”, అని ఒక ఫేస్బుక్ యూజర్ రాసుకొచ్చారు. 

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్, ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మా పరిశోధనలో తేలింది. ఈ పధకం కేవలం ముస్లింలకి మాత్రమే కాదు. కర్ణాటకలో ఉన్న మైనారిటీ వర్గాలు అన్నిటికీ వర్తిస్తుంది. కర్ణాటకలో మైనారిటీ వర్గాలు అంటే క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, ముస్లింలు. 

వాస్తవం ఏమిటి?

కర్ణాటకలో మైనారిటీ వర్గాల విద్యార్ధులకి రాష్ట్ర ప్రభుత్వం పధకం గురించి హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ఒక కథనం మాకు దొరికింది. ఈ కథనం ఆగస్ట్ 23 నాడు ప్రచురితం అయ్యింది. ఈ కథనం ప్రకారం కర్ణాటక మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మైనారిటీ వర్గాలలో నిరుద్యోగ వ్యక్తులు వాహనం కొనుక్కోవటానికి మూడు లక్షల రూపాయలు రాయితీ ఇచ్చే పధకాన్ని అధికారికంగా మొదలుపెట్టారు. 

దీని తరువాత మేము కర్ణాటక మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(కెఎండిసిఎల్) వెబ్సైట్ చూస్తే మాకు అందులో ఒక ప్రకటన కనిపించింది. “టాక్సీ/రవాణా వాహనం/ప్యాసింజర్ ఆటో రిక్షా కొనుక్కోవటానికి రాయితీ పధకం”, అనేది ఈ ప్రకటన శీర్షిక. 

ఈ వెబ్సైట్ లో ఈ పధకం గురించి ఉన్న నియమాలలో ఇలా ఉంది. ఆటో రిక్షా/రవాణా వాహనం/టాక్సీ కొనుక్కోవటానికి ఎవరికైతే బ్యాంకులు ఋణం ఇచ్చాయో, ఆ ఋణంలో యాభై శాతం కానీ లేదా గరిష్టంగా మూడు లక్షలు రాయితీగా ఇవ్వబడుతుంది. మహిళా దరఖాస్తూదారులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని ఈ పధకం మార్గదర్శకాలలో ఉంది.

దరఖాస్తుదారులు కర్ణాటకలో మైనారిటీ వర్గాలకి చెందినవారై ఉండాలని కెఎండిసిఎల్ పేర్కొంది (సౌజన్యం: కెఎండిసిఎల్/స్క్రీన్ షాట్)

ఈ పధకానికి అర్హులు అవ్వటానికి ప్రధాన అర్హత దరఖాస్తుదారులు కర్ణాటకలో మైనారిటీ వర్గానికి చెందిన వారై ఉండాలి. అలాగే కర్ణాటకలో శాశ్వత నివాసి అయ్యుండాలి. అలాగే వారి వార్షిక ఆదాయం 4.5 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తుదారులు వివిధ పత్రాలు సమర్పించాలి. 

ఎక్కడా కూడా ఈ పధకం కేవలం ముస్లింలకి మాత్రమే అని లేదు. మైనారిటీ వర్గాల వారికోసం ఈ పధకం అని మాత్రమే ఉంది. 

ఆ తరువాత ఈ వెబ్సైట్ ఎబౌట్ సెక్షన్ చూస్తే కర్ణాటకలో మైనారిటీ వర్గాలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు అని ఉంది. 

కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు మైనారిటీ వర్గాలు (సౌజన్యం: కెఎండిసిఎల్/స్క్రీన్ షాట్)

తీర్పు

మా పరిశోధన ద్వారా తేలింది ఏమిటంటే కర్ణాటక ప్రభుత్వం ఈ రాయితీని కేవలం ముస్లింలకి మాత్రమే ఇవ్వటం లేదు. అన్ని మైనారిటీ వర్గాల వారు ఈ పధకానికి అర్హులే. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

 

హిందీ నుండి ఆంగ్లం అనువాదం- రజిని కె జి  

 

తెలుగు అనువాదం- గుత్తా రోహిత్ 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.