హోమ్ ‘తమిళనాడులో పోటీ చేసిన చోట్ల కన్నా ఎక్కువ చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది’ అని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలపలేదు

‘తమిళనాడులో పోటీ చేసిన చోట్ల కన్నా ఎక్కువ చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది’ అని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలపలేదు

ద్వారా: రాహుల్ అధికారి

జూన్ 3 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
‘తమిళనాడులో పోటీ చేసిన చోట్ల కన్నా ఎక్కువ చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది’ అని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలపలేదు కాంగ్రెస్ తమిళనాడులో 9 సీట్లలో మాత్రమే పోటీ చేయగా, 13-15 చోట్ల గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో చెప్పారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ ఫొటోలో ఉన్న సంఖ్య డీఏంకే కాకుండా ఇండియా కూటమిలో ఉన్న మిగతా అన్ని పార్టీలకి కలిపి వచ్చే సీట్ల సంఖ్య. కేవలం కాంగ్రెస్ పార్టీ సంఖ్య కాదు ఇది.

క్లైమ్ ఏంటి?

ఆజ్ తక్ చానల్ కి చెందిన స్క్రీన్ షాట్ ఒక దానిని షేర్ చేసి, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 13-15 సీట్లలో గెలుపొందనుంది అని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో తెలిపారు అని క్లైమ్ చేశారు. మొన్న లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులో కాంగ్రెస్ 9 చోట్ల మాత్రమే పోటీ చేసింది.

ఈ వైరల్ స్క్రీన్ షాట్ లో ఈ క్రింది సంఖ్యలు ఉన్నాయి:

మొత్తం సీట్లు: 39

బీజేపీ+: 2-4 సీట్లు

కాంగ్రెస్+: 13-15 సీట్లు

డీఏంకే: 20-22 సీట్లు

ఏఐడీఏంకే: 0-2 సీట్లు 

“బిగ్ బ్రేకింగ్: నరేంద్ర మోదీ గోదీ మీడియా వాస్తవం చూడండి, తమిళనాడు వాసులారా. 👇😂తమిళనాడులో ఉన్న 39 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాడు 9 చోట్ల అయితే, గోదీ మీడియా మాత్రం కాంగ్రెస్ 13-15 చోట్ల గెలుస్తుంది అని చెబుతున్నది. #ExitPoll,” అని ఒక యూజర్ ఈ ఫొటో షేర్ చేసి, రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఇందులో “కాంగ్రెస్+” అంటే డీఏంకే పార్టీని మినహాయించి ఇండియా కూటమి అని అర్థం. డీఏంకే వివరాలు ఇదే ఫొటోలో వేరేగా ఇచ్చారు.

మేము వాస్తవం ఎలా తెలుసుకున్నాము?

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఆజ్ తక్ చానల్ ప్రసారం చేసిన కార్యక్రమం వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) మేము చూశాము. దీని ప్రకారం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)కి తమిళనాడులో 2-4 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, ఇండియా కూటమికి (డీఏంకేతో సహా) 33-37 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, ఏఐడీఏంకేకి 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇందులో ఉంది. ఇందులో, కాంగ్రెస్+ కి 13-15 సీట్లు వచ్చే అవకాశం ఉందని, డీఏంకేకి 20-22 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఉంది.

ఈ వివరాలని చెబుతూ, యాంకర్ అంజనా ఓం కశ్యప్ ఇండియా కూటమికి 33-37 సీట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పటం మనం చూడవచ్చు. అలాగే, కాంగ్రెస్ ఓట్ల శాతంతో సహా, ఇండియా కూటమికి 46 శాతం వచ్చే అవకాశం ఉందని తెలిపారు,

ఈ వైరల్ ఇమేజ్ ని ఈ కార్యక్రమంలో మనం చూడవచ్చు. ఇందులో ఎన్డీఏ ని బీజేపీ+ గా రాశారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి, పాలక డీఏంకే సీట్లు వేరుగా, ఇండియా కూటమిలో మిగతా పార్టీల సీట్లు వేరేగా చూపించారు.

ఇందులో “కాంగ్రెస్+” అంటే ఇండియా కూటమిలో డీఏంకే కాక మిగతా పార్టీలు అని అర్థం. 

తమిళనాడులో ఇండియా కూటమి

తమిళనాడులో ఇండియా కూటమి మొత్తం 39 సీట్లలో పోటీ చేసింది. పాలక డీఏంకే 22 సీట్లలో పోటీ చేయగా (కేడీఏంకే పోటీ చేస్తున్న ఒక స్థానంతో సహా), కాంగ్రెస్ 9 సీట్లలో పోటీ చేసింది. వీసీకే, సీపీఐ, సీపీఏం చెరో రెండో చోట్ల పోటీ చేశాయి. అలాగే ఐయూఏంఎల్, ఏండీఏంకే చెరొక స్థానంలో పోటీ చేశాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఏంక్లే పోటీ చేసిన 22 స్థానాలలో 20-22 చోట్ల గెలిచే అవకాశం ఉందని, ఇండియా కూటమిలో మిగతా పార్టీలు పోటీ చేసిన 17 స్థానాలలో 12-15 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఉంది.

దీని బట్టి, వైరల్ ఫొటోలో ఇచ్చిన సీట్ల సంఖ్య కేవలం కాంగ్రెస్ కి మాత్రమే సంబంధించి కాదని, డీఏంకే మినహాయించి మిగతా ఇండియా కూటమికి సంబంధించిన సంఖ్య అని స్పష్టం అవుతున్నది.

వైరల్ స్క్రీన్ షాట్

ఆజ్ తక్ చానల్ జూన్ 1 నాడు అప్లోడ్ చేసిన వీడియో (ఆర్కైవ్ ఇక్కడ నుండి ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారని మేము తెలుసుకున్నాము. ఈ వీడియోలో అంజనా ఓం కశ్యప్, సుధీర్ చౌధరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని చర్చిస్తున్నారు. ఇందులో ఉన్న గ్రాఫిక్స్ లో తమిళనాడు వివరాలు ఉన్నాయి కానీ, వారు చర్చిస్తున్నది కేరళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి. ఈ వీడియోలో 0:28 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ ఫొటోని చూడవచ్చు. 

ఒరిజినల్ స్క్రీన్ షాట్, వైరల్ స్క్రీన్ షాట్ మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్)

కేరళ, తమిళనాడు కి సంబంధించి కాంగ్రెస్+ అనే లేబుల్ వాడారని, అయితే కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలకి సంబంధించి మాత్రం ఈ + లేబుల్ లేదని మేము గమనించాము. అంటే, + అనే లేబుల్ ఉంది అంటే కూటమి అని అర్థం.

యాక్సిస్ మై ఇండియా అనేది మార్కెట్ రీసెర్చ్ మరియు ప్రజాభిప్రాయాన్ని సేకరించే పోలింగ్ సంస్థ. ఇండియా టుడే సంస్థతో కలిసి ఎగ్జిట్ పోల్స్ ని ఈ సంస్థ ప్రచురిస్తూ ఉంటుంది.

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఇండియా టుడే ఒక కథనాన్నిప్రచురించింది. 

తీర్పు

తమిళనాడులో కాంగ్రెస్ 9 చోట్ల మాత్రమే పోటీ చేసినా, యాక్సిస్ మై ఇండియాలో వాళ్ళు 13-15 సీట్లు గెలుస్తారు అని ఉందని ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసి క్లైమ్ చేశారు. అయితే, ఇందులో ఉన్నది డీఏంకే మినహాయించి, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిపి గెలుచుకునే అవకాశాలు ఉన్న సీట్ల సంఖ్య. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.