ద్వారా: రోహిత్ గుత్తా
జూలై 30 2024
జూలై 30, 2024 నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి పాస్ పుస్తకం మీద రాజ ముద్ర మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ లేదు.
క్లైమ్ ఏంటి?
అనకాపల్లి జిల్లా అంకూరు గ్రామానికి చెందిన కొందరి భూమి వివరాలు ఉన్న ఒక ప్రింట్ ఔట్ ఫొటో షేర్ చేసి, భూ యాజమానులకి ఇస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బొమ్మలు ఉన్నాయి అని క్లైమ్ చేశారు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ ఫొటో (ఆర్కైవ్ ఇక్కడ) షేర్ చేసి, “భూమి పత్రాలు మీద జగన్ గారి బొమ్మలు ఉన్నాయని రచ్చ చేశారు కదా!! మరి ఇది ఎంటి మేధావులు చెప్పాలి,” అని రాసుకొచ్చారు. ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మొన్న జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలుపొందింది.
సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఇది పట్టాదార్ పాస్ పుస్తకం ఫోటోనూ కాదు, పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మాను లేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
వైరల్ ఫొటో పట్టాదార్ పాస్ పుస్తకం ఫొటో కాదని, భూమి యాజమాన్య వివరాలు లభించే ఒక ప్రభుత్వ వెబ్సైట్ నుండి తీసుకున్న ప్రింట్ ఔట్ ఫొటో అని మేము తెలుసుకున్నాము. పట్టాదార్ పాస్ బుక్ గా పిలవబడే టైటిల్ డీడ్ మాత్రమే అధికారిక భూ యాజమాన్య పత్రం.
వైరల్ ఇమేజ్ ఎక్కడిది?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే మీ భూమి అనే వెబ్సైట్ నుండి ఆర్ఓఆర్ 1బి పత్రాన్ని డౌన్లోడ్ చేసి, దాని ఫొటో ని పట్టాదార్ పాస్ పుస్తకం ఫొటో గా షేర్ చేస్తున్నారు అని మేము తెలుసుకున్నాము. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఇందులో భూ యజమాని పేరు, సర్వే/ఖాతా సంఖ్య, భూ విస్తీర్ణం, భూమి వర్గీకరణ వివరాలు ఉంటాయి. ఈ వివరాలని నమోదు చేసే పత్రమే 1 బి పత్రం.
ఈ వైరల్ ఇమేజ్ లో ఉన్న వివరాల ద్వారా ఆ 1 బి పత్రాన్ని మేము సంపాదించాము. అందులో, “ఈ వెబ్సైట్ ద్వారా అందించే వివరాలు కేవలం సమాచారం కోసమే. న్యాయస్థానల్లో ఆధారంగా చూపించడానికి కానీ, లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చట్టాలు/నియమాల కింద ఏమైనా క్లైమ్స్ చేయడానికి కానీ ఇది వాడటానికి వీలు లేదు,” అనే ప్రకటన ఉంది. ఈ పత్రం ఏ రోజు, ఏ సమయంలో డౌన్లోడ్ చేశారు అనే వివరాలు కూడా ఉన్నాయి. ఈ వైరల్ ఇమేజ్ ని జూలై 25, ఉదయం 8:44 కి డౌన్లోడ్ చేశారు.
ప్రకటన ని హై లైట్ చేస్తూ చేసిన వెబ్సైట్ డెస్క్ టాప్ వెర్షన్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: మీ భూమి)
ఈ వైరల్ ఇమేజ్ లో చంద్రబాబు, సత్య ప్రసాద్ ఫొటోలు నిలువుగా ఉన్నాయి. అంటే, ఈ ప్రింట్ అవుట్ ని మొబైల్ నుండి తీశారు అని అర్థం. డెస్క్ టాప్ వెర్షన్ లో ఇవే ఫొటో లు అడ్డంగా ఉంటాయి.
ప్రతి ప్రభుత్వ వెబ్సైట్ లో ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి ఫొటోలు ఉంటాయి. ఉదాహరణకి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి వెబ్సైట్ లో చంద్రబాబు, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలు ఉన్నాయి. ఆలాగే పాఠశాల విద్య వెబ్సైట్ లో ముఖ్యమంత్రి ఫొటో, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫొటోలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి, ఆయా శాఖల మంత్రుల ఫొటోలు ఉన్న వెబ్సైట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: https://appanchayats.ap.gov.in/APPRPortal/ https://schooledu.ap.gov.in/samagrashiksha/)
కొత్త పాస్ పుస్తకం లో రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయా?
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం జూలై 30, 2024 నాడు ప్రభుత్వం కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కథనంలో ఈ కొత్త పాస్ పుస్తకం ఫొటో ఉంది. దాని మీద రాజ ముద్ర మాత్రమే ఉంది. ఈ పాస్ పుస్తకం ఫొటో ఉన్న ఈనాడు లోని కథనం, డెక్కన్ క్రానికల్ లో కథనం ఈ వివరాలని నిర్ధారిస్తున్నాయి.
విడుదల చేసిన కొత్త పాస్ పుస్తకం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఈనాడు)
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోని పాస్ పుస్తకంతో పోల్చుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కొత్త పాస్ పుస్తకం ఫొటోని తమ ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో పోస్ట్ చేశారు. పాత పుస్తకం మీద వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ఉండగా, కొత్త దాని మీద కేవలం రాజ ముద్ర మాత్రమే ఉంది. దీనిబట్టి కొత్త పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉంది అనే క్లైమ్ అబద్ధం అని స్పష్టం అవుతున్నది.
నారా లోకేష్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/Nara Lokesh)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ కూడా ఈ వైరల్ ఇమేజ్ ఫేక్ అని తమ ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ వివరణ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/FactCheck.AP.Gov.in)
పాస్ పుస్తకాల మీద బొమ్మల వివాదం
పాస్ పుస్తకాల మీద వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ వేసిన పాత ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగు దేశం ఎన్నికల ప్రచార సమయంలో తప్పుబట్టింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ చంద్రబాబు నాటి పాస్ పుస్తకం ఒకదాన్ని ప్రతీకాత్మకంగా చించివేశారు కూడా. ఆంధ్రజ్యోతి జూలై 30, 2024 నాటి కథనం ప్రకారం పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేయడానికి గత ప్రభుత్వం 15 కోట్లు ఖర్చుపెట్టింది.
తీర్పు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ నుండి తీసిన ప్రింట్ ఔట్ ఫొటో ఒకటి షేర్ చేసి, ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి బొమ్మలు వేస్తున్నదని తప్పుగా క్లైమ్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)