ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023
ఈ వీడియోలోని సంఘటనలు కల్పితం అని ఒరిజినల్ వీడియో అంత చూస్తే అర్దమవుతుంది, ఎందుకంటే అందులో అంత కల్పితం అనే డిస్క్లైమర్ ను పొందుపరిచారు.
నేపధ్యం
ఒక వృద్ధుడు ఒక పడుచు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఒక పెళ్ళయిన జంట గుడిలో నుంచి బయటకి వస్తుంది. తను ఈ పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకున్నానని పెళ్ళికూతురు చెప్పగా, తన కొడుకు చనిపోయాక కోడలని పెళ్లి చేసుకున్నానని పెళ్లి కొడుకు చెప్పడం మనం వీడియోలో చూడొచ్చు. తనని చూసుకోవటానికి ఎవరూ లేకపోవటం ఈ పెళ్ళికి కారణం అని పెళ్ళికూతురు చెబుతుంది. “కొడుకు చనిపోయాక తండ్రి తన కోడలిని పెళ్లి చేసుకున్నాడు” అనే వ్యాఖ్యతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నది.
అయితే ఈ వ్యాఖ్య తప్పు. పైన పేర్కొన్న వీడియోకి ఈ అసత్యమైన వ్యాఖ్య జోడించారు.
వాస్తవం
ఈ వీడియో 2022 నుండి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న సంగతి గుర్తించాము. మొత్తం వీడియోని మొదటిసారిగా జూన్ 4, 2022 నాడు ఫేస్బుక్ లో పోస్ట్ చేయటం జరిగింది. ఆరు నిమిషాల నిడివి ఉన్న మొత్తం వీడియోని ‘కొడుకు చనిపోయాక తండ్రి కోడలిని పెళ్లిచేసుకున్నాడు; భర్త చనిపోయాక భార్య తన మావయ్యని పెళ్లిచేసుకుంది’ అనే వ్యాఖ్యతో (అది హిందీలో ఉంది. ఇక్కడ తెలుగులో ఇస్తున్నాము) పోస్ట్ చేశారు. వీడియో చివరిలో ఒక ప్రకటన ఉంది- ఈ వీడియోలో ప్రతిదీ కల్పితం. మన దేశంలో జరుగుతున్న విషయాలతో పోలిస్తే ఈ వీడియోలో చూపించింది ఏదీ వాస్తవం కాదు.
అలాగే, జూన్ 5, 2022 నాడు ట్విట్టర్ లో ఇదే వీడియోలో నుండి రెండు నిమిషాల భాగాన్ని ట్వీట్ చేశారు. ఈ రెండు నిమిషాల వీడియోలో కూడా అదే ప్రకటన ఉంది.
మే 5, 2023 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) పత్రిక ఈ వీడియో గురించి వార్తా కథనం రాసి, ఇది కల్పితం అని తేల్చింది.
జూన్ 2022లో బూమ్ లైవ్ వెబ్సైట్ వాళ్ళు ఫేస్బుక్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది ‘రాహుల్ ఎక్స్పోజ్’ అనే పేజ్ అని గుర్తించారు. పైన పేర్కొన్న వీడియోలో పెళ్లి కూతురు పాత్రలో నటించిన మహిళే ఇదే పేజ్ లో పోస్ట్ చేసిన ఇతర వీడియోలలో కూడా కొత్త పెళ్లి కూతురు పాత్రలు చేసింది. అయితే ఈ ఫేస్బుక్ పేజ్ ఇప్పుడు లేదు.
తీర్పు
ఈ మొత్తం వీడియో కల్పితం అని ఆ వీడియోలోనే స్పష్టంగా తెలిపారు. ఈ వీడియోలో పెళ్లి కూతురిగా కనిపించిన మహిళ ఇతర వీడియోలలో కూడా వివిధ పాత్రలు పోషించింది. కాబట్టి ఈ వార్త ఆబద్ధం అని మేము నిర్ధారించాము.