ద్వారా: రోహిత్ గుత్తా
మే 7 2024
ఝార్ఖండ్ కి చెందిన ఒక మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పని మనిషిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇంటి నుండి ఈడీ డబ్బులు జప్తు చేసిన వీడియో ఇది.
క్లైమ్ ఏంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో సామజిక మాధ్యమాలలో 13 సెకన్ల వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇందులో కొంత మంది వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ, డబ్బుల కట్టలు సర్దుతుండటం మనం చూడవచ్చు. ఇవి అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి సిఎం రమేష్ దగ్గర నుండి జప్తు చేసిన డబ్బు అని క్లైమ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయి. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాగా, తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అనకాపల్లిలో మే 6 నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన రోజే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఇది ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియో కాదు. ఝార్ఖండ్ కి చెందిన వీడియో.
మేము ఏమి తెలుసుకున్నాము?
సిఎం రమేష్ ఇంటి నుండి కానీ, లేదా ఆయన అనుచరుల ఇంటి నుండి కానీ డబ్బులు జప్తు చేసినట్టు విశ్వసనీయమైన వార్తలు లేవు.
ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఈ వీడియోకి సంబంధించిన వార్తా కథనాలు మాకు లభించాయి. ఇదే వీడియో ఉన్న ఎన్ డి టి వి కి చెందిన ఒక కథనం ప్రకారం, మే 6 నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద పెట్టిన ఒక కేసుకి సంబంధించి ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సోదాలు నిర్వహించింది. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి చెందిన ఒక అధికారి అయిన వీరేంద్ర రామ్ కి సంబంధించిన ప్రదేశాలలో సోదాలు జరిగాయి అని ఈ కథనంలో ఉంది. అక్కడ నుండి 25 కోట్లు జప్తు చేశారని ఈ కథనంలో తెలిపారు.
న్యూస్ ఏజెన్సీ ఏ ఎన్ ఐ ఎక్స్ లో మే 6 నాడు ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ )లో కూడా ఇదే వీడియో ఉంది. సంజీవ్ లాల్ అనే వ్యక్తి యొక్క పని మనిషి ఇంట్లో నుండి ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నారని ఈ పోస్ట్ లో తెలిపారు. సంజీవ్ లాల్ ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి. ఫిబ్రవరి 2023లో వీరేంద్ర రామ్ కేసుకి సంబంధించి ఈ డబ్బుని జప్తు చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ పధకాల అమలులో అవకతవకాల గురించి ఈ కేసు నమోదు చేశారని ఈ పోస్ట్ లో ఉంది. హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఒక కథనం ఈ వివరాలని ధృవపరుస్తున్నది.
ఈడీ సోదాల వీడియోతో ఉన్న ఏఎన్ఐ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఏఎన్ఐ)
సిఎం రమేష్ మీద ఈడీ విచారణ
2019లో బిజేపీలో చేరిన రమేష్ మీద బ్యాంకులని మోసం చేశారు అనే కేసు ఉంది. ఈ కేసుని సిబిఐ, ఈడీ రెండూ కూడా వేరు వేరుగా విచారిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం రమేష్ కి చెందిన ఒక సంస్థలో 100 కోట్ల రూపాయల అనుమానస్పద లావాదేవిలు జరిగాయి. రమేష్ సంస్థలలో ఆదాయ పన్ను శాఖ 2018లో సోదాలు నిర్వహించింది అని ఈ కథనంలో ఉంది. సిబిఐ విచారణని ప్రభావితం చేస్తున్నాడు అని సిబిఐ తనని విచారిస్తుండగా, మనీ లాండరింగ్ ఆరోపణల గురించి ఈడీ విచారిస్తున్నది. ఈడీ తన ఆస్తులని కూడా జప్తు చేసింది. రమేష్ పార్టీ మారినప్పుడు దర్యాప్తు సంస్థల విచారణ నుండి తప్పించుకోవడానికి మారాడు అనే ఆరోపణలు వచ్చాయి.
తీర్పు
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి సంబంధించిన ప్రదేశాల నుండి ఈడీ డబ్బు స్వాధీనం చేసుకున్న వీడియోని షేర్ చేసి అనకాపల్లి బిజేపీ అభ్యర్ధి సిఎం రమేష్ దగ్గర డబ్బులు పట్టుబడ్డాయి అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)