ద్వారా: ఇషిత గోయల్ జె
మే 22 2024
వైరల్ అవుతున్న వీడియో 2021 లోనిది, ఇక్కడ ఉన్నది మాజీ ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
క్లెయిమ్ ఏమిటి?
ఒక కార్యక్రమంలో కొంత మంది వ్యక్తులు స్టేజీని ధ్వంసం చేస్తున్నట్టుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ వీడియోని షేర్ చేస్తూ తెలుగులో, ఇలా రాసుకొచ్చారు, “హర్యానా ముఖ్యమంత్రి ప్రచార సభ వేదికను పగలగొట్టిన ప్రజానీకం. బీజేపీ అభ్యర్థులను కూడా తరిమి తరిమి కొట్టిన ప్రజలు. బిజేపీ అబద్ధాల వాగ్దానాలపై విసిగెక్కిన ప్రజానికం. బత్తాయిలకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు అంటున్న ప్రజలు. మొన్న ఉత్తర్ ప్రదేశ్, నిన్న మధ్యప్రదేశ్, నేడు హర్యానా”
ఆ పోస్ట్ షేర్ చేసిన వీడియో పైన హిందీలో “ హర్యానా ముఖ్య మంత్రి సైనీ నిర్వహించిన కార్యక్రమం స్టేజీని రైతులు ధ్వంసం చేసారు,” అని ఉంది. పైగా పోలీసులు కుడా ఆపలేకపోయారు అని, బీజేపీ దీనితో మూగబోయింది అని ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ఇక్కడ.
కానీ, ఇలా వైరల్ అవుతున్న వీడియో 2021 నాటిది, ఇందులో ఉన్నది ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ కాదు.
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ఒకటి లభించింది. “Haryana: Protesting farmers ransack venue of CM Khattar Karnal rally; police use water cannon, tear gas shells,” అనే శీర్షిక తో జనవరి 11, 2021 నాడు ప్రచురించిన కథనంలో ఈ సంఘటన జనవరి 10 నాడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాల గురించిన నిరసన అని అర్ధమయింది.
వైరల్ వీడియో మరియు ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన వీడియో మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కథనం ప్రకారం, కిసాన్ మహాపంచాయత్ అనే కార్యక్రమం హర్యానా లోని కర్నల్ జిల్లాలో జరిగింది, దీనిని కొంతమంది రైతులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొని వ్యవసాయ చట్టం గురించి వివరించాల్సి ఉండగా, ఈ గొడవ వలన ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఒక టైమ్స్ నౌ పాత్రికేయుడు ఈ కార్యక్రమాన్ని ఖట్టర్ నిర్వహించారు అని కుడా పేర్కొన్నారు.
ఇండియా టుడే కుడా ఈ సంఘటనని జనవరి 11, 2021 నాడు టీవీలో ప్రచారం చేసింది. ఈ కథనం ప్రకారం, హర్యానా పోలీసులు వాటర్ క్యానన్లు మరియు బాష్పావాయువు వాడి నిరసనకారులను చెదరగొట్టారు అని ఉంది.
వైరల్ వీడియో మరియు ఇండియా టుడే వీడియో మధ్య పోలిక (సౌజ్యన్యం : ఎక్స్/ఇండియా టుడే వెబ్సైటు/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)
ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కుడా ఈ సంఘటన గూర్చి అనేక ఫొటోలను ప్రచురించింది. ఈ ఫొటోలలో కుడా ప్రస్తుతం వైరల్ ఫొటోలో ఉన్నలాంటి పరిసరాలే ఉన్నాయి. ఇక్కడ ఉండే స్టేజీని, బ్యారికేడ్లను, మరియు ఇతర విషయాలను వైరల్ వీడియోతో పోల్చి చూస్తే, అది కుడా 2021 లో రైతుల నిరసన నాటిదే అని అర్ధమవుతుంది. ఈ వీడియోకి ప్రస్తుతం జరుగుతున్న జనరల్ ఎన్నికలకి కానీ, ప్రస్తుత హర్యానా ముఖ్య మంత్రికి కానీ సంబంధం లేదు.
2021 లో ప్రధాని నరేంద్ర మోడీ రైతుల నిరసనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అదే సంవత్సరంలో డిసెంబర్ లో అవి రద్దు అయ్యాయి.
తీర్పు
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 2021లో వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన లోనిది. అప్పట్లో హర్యానా ముఖ్య మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఆయన నిర్వహించిన కార్యక్రమంలో ఆ గొడవ జరిగింది. ప్రస్తుత ఎన్నికలకి కానీ, ప్రస్తుత హర్యానా ముఖ్య మంత్రికి కానీ సంబంధం లేదు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.
(అనువాదం: రాజేశ్వరి పరస)