ద్వారా: మొహమ్మద్ సల్మాన్
ఆగస్టు 2 2024
కుంభవృష్టి లో ఇల్లు మునిగిపోతున్నట్టున్న ఈ వీడియో చైనా కి సంబంధించిన వీడియో. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన కన్నా ముందే జరిగింది ఇది.
క్లైమ్ ఏంటి?
జూలై 30, 2024 నాడు కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన లో 320 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఈ నేపధ్యంలో ఒక ఇంటి గేటు నీటిలో మునిగిపోతున్న ఒక వీడియోని షేర్ చేసి, ఇది వయనాడ్ కి చెందిన వీడియో అని క్లైమ్ చేశారు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ (ఆర్కైవ్ ఇక్కడ) ఈ వీడియోని షేర్ చేసి, “కేరళ లోని వయనాడ్ ప్రమాదం లో ఉంది,” అని రాసుకొచ్చారు. #PrayforWayanad అనే హ్యాష్ ట్యాగ్ తో దీనిని షేర్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఈ క్లైమ్ తప్పు. ఈ వీడియో చైనా కి చెందిన వీడియో.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియో లో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఈ వీడియో చైనా లోని గ్వామ్గ్డాంగ్ కి చెందినది అంటూ మాండరిన్ భాషలో కథనాలు, యూట్యూబ్ వీడియోలు లభించాయి.
ఇదే వీడియో ని aboluowang.com అనే చైనీస్ వెబ్సైట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో జూన్ 24, 2024 నాడు అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. కుంభవృష్టి కారణంగా చైనాలో భారీ విధ్వంసం జరిగింది అని, దానికి ఒక ముఖ్య కారణం రిజర్వాయర్ల నుండి పారిన వరద నీరు అని ఈ కథనంలో ఉంది. హ్యూయాంగ్టియాన్ రిజర్వాయర్ నుండి వచ్చిన వరద నీరు కారణంగా జూన్ 16 నాడు గ్వామ్గ్డాంగ్ రాష్ట్రం లోని మెయిజౌ నగరంలో పింగ్యువాన్ కౌంటీ లోని హ్యూయాంగ్టియాన్ గ్రామంలో గ్రామస్తులు ఇరుక్కుపోయారు అని, వరద స్థాయి మూడు గంటలలో రెండు మీటర్లు పెరిగింది అని ఈ కథనంలో ఉంది.
మాండరిన్ భాషలో ఉన్న కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: aboluowang.com)
మరొక కథనం లో, అధికారిక వర్గాలని ఉటంకిస్తూ, ఈ వరదల కారణంగా 38 మంది చనిపోయారు, ఇద్దరు తప్పిపోయారు అని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజిని కూడా ఇందులో జతపరిచారు. వరద తీవ్రత వేగంగా పెరియిగిపోయి, గ్రామస్తులు తప్పించుకునే అవకాశం లేకపోవటాన్ని మనం ఈ ఫుటేజి లో చూడవచ్చు. సీసీటీవీ ఫుటేజి లోని తేదీ కథనంలో తేదీ సరిపోలాయి.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో జూన్ 21, 2023 నాడు వచ్చిన కథనం ఈ వివరాలని ధృవపరుస్తున్నది. చైనా సెంట్రల్ టెలివిజన్ వారి సమాచారం ఆధారంగా వారు ఈ వివరాలని తెలిపారు.
అదే కాక, ఇదే వీడియో ని చైనీస్ వీడియో షేరింగ్ వెబ్సైట్ అయిన Bilibili (ఆర్కైవ్ ఇక్కడ) లో జూన్ 23, 2024 నాడు పోస్ట్ చేశారు.
Bilibili లో పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: Bilibili)
ఇదే వీడియోని జూన్ లో వివిధ తేదీలలో, వివిధ అకౌంట్లు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాయి. వీటికి మాండరిన్ భాషలో శీర్షికలు పెట్టారు. ఇది గ్వామ్గ్డాంగ్ రాష్ట్రం లోని మెయిజౌ నగరానికి చెందిన వీడియో అనే ఈ శీర్షికల సారాంశం. ఈ యూట్యూబ్ వీడియోలని ఇక్కడ (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ (ఆర్కైవ్ ఇక్కడ) చూడవచ్చు.
ఈ వీడియో ఒరిజినల్ సోర్స్ స్పష్టంగా తెలియకపోయినా కూడా, వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడినప్పటికి ముందే ఈ వీడియో ఆన్లైన్ లో ఉంది అనేది స్పష్టం అవుతున్నది.
తీర్పు
చైనా కి చెందిన సీసీటీవి ఫుటేజి షేర్ చేసి, వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటన కి సంబంధించిన వీడియో అంటూ తప్పుగా క్లైమ్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)